Share News

Israel Hamas War: దాడుల్ని ఆపితే హమాస్ మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉంది.. ఆ ప్రతిపాదనపై అమెరికా రియాక్షన్

ABN , First Publish Date - 2023-11-05T15:31:34+05:30 IST

హమాస్ చేసిన మెరుపుదాడులకు ప్రతీకారంగా గాజాలో ఇజ్రాయెల్ విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. హమాస్‌ని సర్వనాశనం చేయాలన్న లక్ష్యంతో.. వైమానిక దాడులతో పాటు గ్రౌండ్ ఆపరేషన్స్..

Israel Hamas War: దాడుల్ని ఆపితే హమాస్ మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉంది.. ఆ ప్రతిపాదనపై అమెరికా రియాక్షన్

హమాస్ చేసిన మెరుపుదాడులకు ప్రతీకారంగా గాజాలో ఇజ్రాయెల్ విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. హమాస్‌ని సర్వనాశనం చేయాలన్న లక్ష్యంతో.. వైమానిక దాడులతో పాటు గ్రౌండ్ ఆపరేషన్స్ నిర్వహిస్తోంది. అయితే.. ఈ దాడుల్లో సామాన్య పౌరులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటివరకూ సుమారు 9 వేల మందికి పైగా మరణించినట్టు తేలింది. ఈ నేపథ్యంలోనే.. గాజా పౌరుల్ని రక్షించేందుకు ఈ యుద్ధానికి ముగింపు (సీజ్‌ఫైర్) పలకాలని అరబ్ దేశాలు తెలిపాయి. వెంటనే ఇరువైపులా దాడులను విరమించుకోవాలని పిలుపునిచ్చాయి. అమెరికా విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో భేటీ సందర్భంగా.. వాళ్లు ఈ ప్రతిపాదనని ఆయన ముందు ఉంచారు. అయితే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాల్పుల విరమణకు పిలుపునిస్తే, హమాస్‌కు పై చేయి లభించే అవకాశాలు ఉన్నాయని బ్లింకెన్ అభిప్రాయపడ్డారు. కొంత విరామం దొరికినా.. హమాస్ తిరిగి శక్తిని కూడగట్టుకొని.. ఇజ్రాయెల్‌పై మరింత తీవ్రమైన దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.


శనివారం జోర్డాన్‌ రాజధాని అమ్మాన్‌లో ఈజిప్టు, జోర్డాన్‌, సౌదీ అరేబియా, ఖతర్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ దౌత్యవేత్తలతో పాటు పాలస్తీనా అథారిటీ అధికారితో ఆంటోనీ బ్లింకెన్‌ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా.. ఆత్మరక్షణ పేరుతో ఇజ్రాయెల్ యుద్ధ నేరాలకు పాల్పడిందని అరబ్ దేశాలు ఆరోపించాయి. ఇది ఆత్మరక్షణ అని తాము అంగీకరించమని జోర్డాన్ విదేశాంగ మంత్రి ఐమన్ సఫాది అన్నారు. ఈజిప్టు ప్రతినిధి కూడా ఇదే వాదనని వినిపించారు. గాజాలోని పాలస్తీనావాసులకు సామూహిక శిక్ష విధిస్తున్నట్లుగా ఉందని, దీన్ని చట్టబద్ధ ఆత్మరక్షణగా పేర్కొనలేమని చెప్పారు. వీరి వాదనల్ని విన్న బ్లింకెన్.. అక్టోబర్ 7న హమాస్ హేయమైన దాడి జరిపిందని, అందుకు ఆత్మరక్షణగానే ఇజ్రాయెల్ కఠినమైన చర్యలు చేపడుతోందని, ఇది వారి హక్కు అని ఆయన పునరుద్ఘాటించారు. కాల్పుల విరమణకు పిలుపునివ్వడం అనేది.. ఇజ్రాయెల్ హక్కును భంగం కలిగించడం అవుతుందని బ్లింకెన్‌ స్పష్టం చేశారు. ఇజ్రాయెల్‌ ఆత్మరక్షణ హక్కుపై తమ మద్దతు ఉంటుందని తేల్చి చెప్పారు. అయితే.. మానవతా సాయం దృష్ట్యా ఇజ్రాయెల్‌ సైనిక చర్యలను తాత్కాలికంగా నిలిపివేయాలనే ప్రతిపాదనపై తాము కూడా సానుకూలంగానే ఉన్నామన్నారు. ఈ యుద్ధాన్ని తాత్కాలికంగా నిలిపవేయడం వల్ల.. గాజాలోని పౌరులకు అవసరమైన సామగ్రిని సరఫరా చేసేందుకు అవకాశం లభిస్తుందన్నారు.

ఇదిలావుండగా.. గాజాలో సామాన్య పౌరుల మరణాలు రోజురోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ యుద్ధానికి తాత్కాలిక విరామం ప్రకటించాల్సిందిగా అరబ్ దేశాలతో పాటు ప్రపంచ దేశాలు కూడా పిలుపునిస్తున్నాయి. కానీ.. ఇజ్రాయెల్ మాత్రం అందుకు సుముఖంగా లేదు. అసలు ఈ వినతుల్ని పట్టించుకోకుండా.. గాజాపై దాడుల్ని కొనసాగిస్తూనే ఉంది. ఆ దేశ ప్రధాని నెతన్యాహు సైతం.. బందీలను విడిచిపెట్టేదాకా తమ దాడుల్ని ఆపేది లేదని తేల్చి చెప్పారు. చూస్తుంటే.. హమాస్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఇప్పుడప్పుడే ఆగేలా కనిపించడం లేదు. కానీ.. ఇందుకు సామాన్య పౌరులు బలి అవ్వడమే బాధాకరమైన విషయం.

Updated Date - 2023-11-05T15:31:35+05:30 IST