Denmark: పండగ సెలవు రద్దు యోచన.. ప్రభుత్వంపై విమర్శలు..

ABN , First Publish Date - 2023-01-27T21:58:40+05:30 IST

పండగ సెలవు రద్దుకు సిద్ధమైన డెన్మార్క్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Denmark: పండగ సెలవు రద్దు యోచన.. ప్రభుత్వంపై విమర్శలు..

ఇంటర్నెట్ డెస్క్: ఖజానాకు అదనపు ఆదాయం కోసం పండగ సెలవు(Public Holiday) రద్దుకు సిద్ధమైన డెన్మార్క్(Denmark) ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సెలవు రద్దుతో ప్రభుత్వ ఖజానాకు 3590 కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉందని ఓ అంచనా. డెన్మార్క్ దేశ జీడీపీలో రక్షణ బడ్జెట్ వాటా 2033 కల్లా శాతానికి చేరుకోవాలని తన సభ్యదేశానికి నాటో నిర్దేశించింది. అయితే.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో 2030 కల్లా ఈ టార్గెట్ చేరుకోవాలని ప్రధాని మాట్టే ఫ్రెడ్రిక్సన్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ దిశగా ‘గ్రీన్ ప్రేయర్ డే’ పండగ సెలవును రద్దు చేసే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. ఈ రద్దు అమల్లోకి వస్తే ప్రతి పౌరుడు అదనంగా 7.5 గంటల పనిచేయాల్సి ఉంటుంది. ఫలితంగా దేశానికి అదనపు ఆదాయం సమకూరుతుంది.

17వ శతాబ్దం నుంచి డెన్మార్క్ ప్రజలు భక్తి శ్రద్ధలతో ఈ పండగలో పాలుపంచుకుంటున్నారు. ఈ రోజు కుటుంబంతో కలిసి ప్రార్థన, దైవచింతనలో గడుపుతారు. అయితే.. పండగపూట కుటుంబంతో గడిపే అవకాశాన్ని తమకు దూరం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించడాన్ని అక్కడి ఉద్యోగులు, కార్మికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

Updated Date - 2023-01-28T00:42:31+05:30 IST