Israel-Hamas War: హమాస్ సొరంగాలపై ఇజ్రాయెల్ మాస్టర్ ప్లాన్.. ఏం చేస్తోందో తెలుసా?
ABN , First Publish Date - 2023-12-05T15:42:19+05:30 IST
హమాస్‌ని పూర్తిగా తుడిచిపెట్టేయాలన్న ఉద్దేశంతో గాజాలో గ్రౌండ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్న ఇజ్రాయెల్ దళాలకు హమాస్ సొరంగాలు పెద్ద తలనొప్పిగా మారాయి. హమాస్ దళాలు ఈ సొరంగాల్లో తలదాచుకొని, వీలు చూసుకొని ఎటాక్ చేస్తుండటంతో..
Hamas Tunnel Network: హమాస్‌ని పూర్తిగా తుడిచిపెట్టేయాలన్న ఉద్దేశంతో గాజాలో గ్రౌండ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్న ఇజ్రాయెల్ దళాలకు హమాస్ సొరంగాలు పెద్ద తలనొప్పిగా మారాయి. హమాస్ దళాలు ఈ సొరంగాల్లో తలదాచుకొని, వీలు చూసుకొని ఎటాక్ చేస్తుండటంతో.. వారిని అడ్డుకోవడం ఇజ్రాయెల్ సైన్యానికి కొంచెం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలోనే.. వాళ్లు ఒక మాస్టర్ ప్లాన్ చేపట్టారు. హమాస్ సొరంగాల్ని సముద్రపు నీరుతో నింపేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. నీళ్లతో ఆ సొరంగాల్ని నింపితే.. లోపల దాక్కున్న హమాస్ దళాలు తమ ప్రాణాలు కాపాడుకోవడం కోసం తప్పకుండా బయటకు రావాల్సి వస్తుంది. అప్పుడు ప్లాన్ ప్రకారం వారిని అంతం చేయొచ్చని ఇజ్రాయెల్ అంచనా వేస్తోంది.
ఇప్పటికే ఐడీఎఫ్ (ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్) దళాలు భారీ నీటి పంపులతో హమాస్ సొరంగాల వద్దకు చేరుకున్నాయి. నవంబర్ మధ్య నాటికి.. ఐదు భారీ పంపులను అల్-షతి శరణార్థి శిబిరానికి ఒక కిలోమీటర్ దూరంలోకి చేర్చినట్టు తెలిసింది. ఈ పంపులతో గంటకు వేల క్యూబిక్ మీటర్ల నీటిని సొరంగాల్లోకి పంపించొచ్చు. ఫలితంగా.. కొన్ని వారాల్లోనే సొరంగాలను నీళ్లతో పూర్తిగా నింపేందుకు అవకాశం ఉంటుంది. అయితే.. ఇజ్రాయెల్ దళాలకు ఇక్కడో చిన్న సమస్య వచ్చిపడింది. అదేమిటంటే.. తాము బందీలను సొరంగాల్లోనే సురక్షితంగా ఉంచామని గతంలోనే హమాస్ ప్రకటించింది. కాబట్టి.. సొరంగాల్ని నీటితో నింపితే బందీల ప్రాణాలకు కూడా ప్రమాదమే. దీంతో.. ఈ వ్యూహాన్ని ఎప్పుడు అమలు చేస్తారన్న విషయంపై స్పష్టమైన క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. మరోవైపు.. ఈ సొరంగాల్ని నిరుపయోగంగా మార్చేందుకు ఇజ్రాయెల్ అనేక మార్గాల్ని పరిశీలిస్తోందని అమెరికా అధికారులు కూడా వెల్లడించారు.
ఇదిలావుండగా.. హమాస్ కార్యకలాపాలకు ప్రధాన కేంద్రమైన ఖాన్ యూనిస్ ప్రాంతాన్ని ఇజ్రాయెల్ బలగాలు టార్గెట్ చేశాయి. ఇప్పటికే ఆ పట్టణ సమీపానికి దళాలు చేరుకున్నాయని, కొన్ని ప్రదేశాలను లక్ష్యంగా చేసుకొని దాడులు కూడా జరిపాయని ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది. భారీ ట్యాంకులు, సాయుధ వాహనాలతో పాటు బుల్‌డోజర్లను కూడా ఖాన్ యూనిస్ వద్దకు తరలించారు. ఈ పట్టణంలో కీలక నాయకులైన యాహ్యా సిన్‌వార్, మహమ్మద్ డెయిఫ్ ఇక్కడి శరణార్థి శిబిరాల్లోనే పుట్టి.. ఈ నగరం కేంద్రంగానే కార్యకలాపాలు నిర్వహించారు. అందుకే.. ఇజ్రాయెల్ దళాలు ప్రత్యేకంగా ఈ నగరంపై దృష్టి సారించాయి.