AI: గాజాపై దాడిలో ఏఐని వినియోగిస్తున్న ఇజ్రాయెల్.. భవిష్యత్తు యుద్ధాలన్నీ ఇలాగే జరిగితే?
ABN , First Publish Date - 2023-12-10T12:16:54+05:30 IST
గాజా(Gaza)పై భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయెల్(Israeil) ఇందుకుగానూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) సాంకేతికతను వినియోగిస్తున్నట్లు పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
కాన్‌బెర్రా: గాజా(Gaza)పై భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయెల్(Israeil) ఇందుకుగానూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) సాంకేతికతను వినియోగిస్తున్నట్లు పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ సాంకేతికతతో పెను విధ్వంసం సృష్టించడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ చర్యలపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఏఐ సాంకేతికత సృష్టించే విధ్వంసంపై తీవ్రంగా చర్చించుకుంటున్నాయి. శాస్త్రవేత్తల్లో ఇప్పటికీ ఏఐపై చాలా అనుమానాలున్నాయి. దాన్ని సృష్టించిన మనుషులపైకే తిరగబడే అవకాశముందని ఓ వైపు భయాలు పెరుగుతున్న వేళ.. యుద్ధంలో దీని వాడకం భయోత్పాతాన్ని కలిగిస్తోంది.
ఇజ్రాయెల్ ప్రస్తుతం ఈ టెక్నాలజీని బాంబింగ్ కు, శత్రు లక్ష్యాలు కనుగోవడానికి, వారి స్థావరాలు తెలుసుకోవడానికి, హమాస్ టెర్రరిస్టులను టార్గెట్ చేయడానికి, పౌర మరణాలపై ముందుగానే సమాచారం తెలుసుకోవడానికి ఉపయోగిస్తోంది. ఈ సాంకేతికత యుద్ధం వేగాన్ని పెంచి, మరింత విధ్వంసం సృష్టించే అవకాశం లేకపోలేదు. ఏఐ ప్రత్యర్థి ప్రణాళికలను ముందే పసిగట్టగలదు. అయితే ఇది సరైన సమాచారం ఇవ్వొచ్చు లేదా.. తప్పుడు సమాచారం ఇవ్వచ్చని నిపుణులు అంటున్నారు.
కానీ దీని మేథా శక్తి ముందు మానవుడి ప్రణాళికలు తీసికట్టుగా మారుతాయి. శత్రువుతో యుద్ధం చేస్తున్న సమయంలో స్వయంగా ప్రణాళికలు ఇవ్వగలదు. డేటాను అన్వయించి, విశ్లేషించగలదు. ఎన్నో వందల రెట్ల అవుట్ పుట్ ని అందించగలదు. అమాయకపు ప్రజలకి హాని జరగకుండా ఎక్కువ మొత్తంలో శక్తిని ఉపయోగించుకుంటూ శత్రువుల్ని తుదముట్టించగలవు.
పెను విధ్వంసమేనా?
సైనిక ఆక్రమణలు, ఒప్పందాల ఉల్లంఘించడం వంటివి అనేక దేశాల్లో జటిల సమస్యలుగా మారిపోయాయి. యూఎస్ - చైనా(USA - China)ల మధ్య ఏళ్లుగా ఆధిపత్య పోరు నడుస్తోంది. వీటితో పాటు ఉక్రెయిన్ - రష్యా యుద్ధం ఇలాంటివి ఏటా ఎక్కడోచోట జరుగుతూనే ఉన్నాయి.
ఈ టైంలో ఏఐని యుద్ధాల్లో వాడటం అంటే విధ్వంసాన్ని కొనితెచ్చుకోవడమే అంటున్నారు నిపుణులు. యుద్ధాన్ని విరమించే బదులు దాన్ని తీవ్రతరం చేయడంలో ఏఐలు ప్రధాన పాత్ర పోషిస్తాయని అంటున్నారు.
చట్టాలను ఫాలో అవుతాయా?
ఏఐ టెక్నాలజీపై ఆధారపడటం ద్వారా యుద్ధాల్ని ఆపగలమా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. చాలా దేశాల్లో ఏఐ విషయంలో ప్రత్యేకంగా చట్టాలు, నిబంధనలు అంటూ లేవు. వీటి వాడకంకంటే ముందే మెరుగైన చట్టాలు అవసరమని చాలా మంది సూచిస్తున్నారు. దీని విధ్వంసంపై కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెషిన్ లర్నింగ్(Machine Learning) టెక్నాలజీని నియంత్రించడం చాలా కష్టమని అంటున్నారు.
ఏఐ సాంకేతికతతో రూపొందించిన ఆయుధాలు తమను తాము ప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు. అప్ డేట్ చేసుకోవచ్చు. ఒకానొక సమయంలో దాన్ని నియంత్రించడానికి రూపొందించిన చట్టాలను కూడా బుట్టదాఖలు చేయొచ్చు. దురదృష్టవశాత్తు వీటన్నింటినీ అనుసరించకుండానే ఏఐ టెక్నాలజీని యుద్ధాల్లో ఉపయోగిస్తున్నారు. ఈ పరిణామాలు భవిష్యత్తు యుద్ధ రంగంపై ఎలాంటి ప్రభావాలు చూపుతాయోనని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.