Pakistan: పాకిస్థాన్‌కు పొంచి ఉన్న ‘పెట్రో’ ముప్పు.. ఒక్కమాటలో చెప్పాలంటే..
ABN, First Publish Date - 2023-02-12T14:39:55+05:30
క్రమంగా ఆర్థిక సంక్షోభంలోకి పీకల్లోతు కూరుకుపోతున్న దాయాదీ దేశం పాకిస్థాన్(Pakistan) ముంగిట ఇప్పుడు మరో ముప్పు పొంచి ఉంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి..
క్రమంగా ఆర్థిక సంక్షోభంలోకి పీకల్లోతు కూరుకుపోతున్న దాయాదీ దేశం పాకిస్థాన్(Pakistan) ముంగిట ఇప్పుడు మరో ముప్పు పొంచి ఉంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి.. పాక్‌లో ధరల పెరుగుదల ప్రారంభమైంది. అంతలోనే వాయవ్య పాకిస్థాన్‌లో వరదలు.. తహ్రీక్ తాలిబాన్ పాకిస్థాన్(TTP) ఉగ్రవాదుల దాడులు.. తాజాగా ఆర్థిక(Financial Crisis), రాజకీయ సంక్షోభాలు(Political Crisis) పాక్‌ను కోలుకోలేకుండా చేస్తున్నాయి. విదేశీ నిల్వలు కరిగిపోతూ.. అంతర్జాతీయంగా అప్పుపుట్టక, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్(IMF) షరతులకు తలొగ్గుతోంది.
ఇప్పుడు ఆ దేశం పెట్రో కొరత(Petro Crisis)ను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచినా.. అవసరాలకు సరిపడా నిల్వలు(Crude stock) లేవు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఇప్పుడు పాక్ మరో శ్రీలంక(Sri Lanka)లా మారుతోంది. చాలా ప్రావిన్సుల్లో పెట్రోల్ దొరకడం లేదు. బంకులు ఖాళీ అయ్యాయి. అరకొర స్టాక్ ఉన్న బంకుల వద్ద వాహనదారులు కిలోమీటర్ల కొద్దీ బారులుతీరారు. నెలరోజులుగా పంజాబ్ ప్రావిన్స్‌లో సరఫరా నిలిచిపోగా.. ఒకట్రెండు రోజుల్లో లాహోర్(Lahore), ఫైసలాబాద్(Faisalabad), గుజ్రన్‌వాలా(Gujranwala) వంటి నగరాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొననుంది.
విదేశీ మారక నిల్వలతోనే..
డాలర్‌తో పోలిస్తే పాకిస్థాన్ రూపాయి మారక విలువ(Forex) రికార్డుస్థాయిలో కనిష్ఠానికి పడిపోయింది. ఓ దశలో డాలరుతో పోలిస్తే.. 263 పాకిస్థానీ రూపాయలకు విలువలు పడిపోయాయి. దాంతో.. ఆటోమేటిక్‌గా పాక్ వద్ద ఉన్న విదేశీ మారక నిల్వల విలువ పడిపోతుంది.
రెండు నెలలుగా చమురు ఒప్పందాలు బంద్!
పాకిస్థాన్ దిగుమతుల్లో సింహభాగం చమురుదే. అయితే.. గడిచిన రెండు నెలలుగా పాకిస్థాన్ ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన పీఎస్‌వో(PSO), ఎల్ఎన్‌జీ లిమిటెడ్(LNGL)లు కొనుగోళ్ల కోసం టెండర్లు పిలవలేదు. పాకిస్థాన్ రూపాయి(Pakistani Rupee) విలువ దారుణంగా పడిపోవడంతో.. చమురుకు ఎక్కువ మొత్తం వెచ్చించాల్సి రావడం ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇక అప్పటికే ఆర్డరిచ్చిన చమురు ఓడలు కూడా సముద్రం మధ్యలోనే ఆగిపోయినట్లు వారం క్రితం వార్తలొచ్చాయి. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి లెటర్ ఆఫ్ క్రెడిట్(LC)లలో ఆలస్యమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇదే కారణంతో పలు పెట్రోల్ కార్గోలు రద్దయినట్లు సమాచారం. దీంతో.. ప్రస్తుతం పాక్ వద్ద ఉన్న నిల్వలే(Petro Reserves) దేశ ప్రజల అవసరాలకు సరిపెట్టాలి. లేకుంటే.. మరో వారం రోజుల్లో పెట్రోల్ కొరత తీవ్ర స్థాయికి చేరుకుంటుంది. ఇస్లామాబాద్‌లోనూ పెట్రోల్ దొరకని పరిస్థితి నెలకొంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇవీ.. పాకిస్థాన్ అవసరాలు
పాక్ ఆర్థిక శాఖ గణాంకాల ప్రకారం.. ప్రతి నెల ఆ దేశానికి 4.3 మెట్రిక్ టన్నుల పెట్రోల్, 2 లక్షల టన్నుల డీజిల్, ఆరున్నర లక్షల టన్నుల క్రూడాయిల్ అవసరం ఉంటుంది. వీటి విలువ 1.3 బిలియన్ డాలర్లు. పాకిస్థాన్ 2021 డిసెంబరులో 6 లక్షల టన్నుల పెట్రోల్‌ను దిగుమతి చేసుంది. ఈ దిగుమతులు గత ఏడాది డిసెంబరులో 2.2 లక్షల టన్నులకు పడిపోయాయి. ఈ కారణంగానే పాక్ ప్రభుత్వం వినియోగాన్ని తగ్గించే ఉద్దేశంతో పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచినట్లు తెలుస్తోంది.
విద్యుత్తు వ్యవస్థ కూడా ఢమాలే?
పెట్రో దెబ్బతో పాకిస్థాన్‌లోని విద్యుత్తు(Electricity) వ్యవస్థ కూడా ఢమాల్ అయ్యే ప్రమాదముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుక్కారణం.. దేశ వార్షిక విద్యుత్తు వినియోగంలో మూడోవంతు ఉత్పత్తి దిగుమతి చేసుకునే సహజవాయువుతోనే జరుగుతుంది. ఇప్పుడు పాకిస్థానీ రూపాయి రికార్డు స్థాయిలో కనిష్టానికి పడిపోవడంతో.. దిగుమతుల కోసం భారీ చెల్లింపులు చేయలేక.. ప్రభుత్వ రంగ చమురుసంస్థలు మిన్నకుంటున్నాయని తెలుస్తోంది. ఇక చమురు సరఫరా దేశాలు కూడా.. సంక్షోభాల్లో ఉన్న దేశాలకు సరఫరా చేయడంలో వెనకాముందు ఆలోచిస్తాయి. ఈ కారణంగా.. ఇప్పుడు శ్రీలంక, పాకిస్థాన్‌లకు చమురు సరఫరా చేసేందుకు వెనకాడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చమురు కొరతతోపాటు.. మరికొన్ని కారణాలు ఆ దేశ విద్యుత్తు వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.
గత సోమవారం పాకిస్థాన్ వ్యాప్తంగా నేషనల్ గ్రిడ్ సమస్యలతో సరఫరాలో ఇబ్బందులు ఎదురయ్యాయి. సింహభాగం పాకిస్థాన్ అంధకారం(Power Outage)లో కూరుకుపోయింది. గ్రిడ్ సమస్య తీరినా.. కరెంటు కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రధాన నగరాలైన ఇస్లామాబాద్, కరాచీ, పెషావర్(Peshawar), రావల్పిండి(Rawalpindi) వంటి నగరాల్లోనూ విద్యుత్తు కోతలు మొదలయ్యాయి. శ్రీలంకలో ఇంధన సంక్షోభం నెలకొన్న సమయంలో భారత్ ఆదుకుంది. ఇప్పుడు పాకిస్థాన్ అదే స్థితికి చేరుకుంది. ఈ నేపథ్యంలో.. పాక్‌ను మిత్రదేశాలైన చైనా(China), గల్ఫ్ దేశాలు(Gulf Countries) ఆదుకుంటాయా? సమస్య నుంచి పాక్ గట్టెక్కుతుందా? లేదా మరింతగా సమస్యల్లో కూరుకుపోతుందా? వేచి చూడాల్సిందే..!
Updated Date - 2023-03-01T15:13:50+05:30 IST