Russia: అత్యంత వినాశకరమైన మిసైల్‌ని బయటకు తీసిన రష్యా.. వారికి స్ట్రాంగ్ వార్నింగ్
ABN, First Publish Date - 2023-09-02T23:12:54+05:30
తన వద్ద ఉన్న అత్యంత వినాశకరమైన అణుక్షిపణి ‘RS-28 సర్మత్ ఇంటర్‌కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్’ని రష్యా ఇప్పుడు బయటకు తీసింది. ఇన్నాళ్లూ పెళ్లికూతురిని దాచినట్టు లోపలే...
తన వద్ద ఉన్న అత్యంత వినాశకరమైన అణుక్షిపణి ‘RS-28 సర్మత్ ఇంటర్‌కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్’ని రష్యా ఇప్పుడు బయటకు తీసింది. ఇన్నాళ్లూ పెళ్లికూతురిని దాచినట్టు లోపలే ఉంచిన ఈ మిసైల్‌ను ఇప్పుడు బయటకు తీసి.. పోరాట విధిలో భాగంగా కొన్ని కీలకమైన ప్రాంతాల్లో మోహరించింది. దీంతో.. తమ జోలికి రావొద్దని రష్యా ప్రపంచదేశాలకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చినట్టు అయ్యింది. ఈ అణుక్షిపణిని సాధారణంగా ‘సాటన్ II’గా పిలుస్తుంటారు.
గతంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ మిసైల్‌ని అజేయంగా వర్ణించారు. తమతో పెట్టుకోవడానికి ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని కూడా ఈ మిసైల్‌ని చూపిస్తూ హెచ్చరించారు. ఇక శుక్రవారం ఈ మిసైల్‌ని మోహరించిన నేపథ్యంలో.. ఇది క్రియాశీల విధుల్లోకి ప్రవేశించిందని రష్యా అంతరిక్ష సంస్థ అధిపతి రాస్‌కామోస్ చెప్పారు. ప్రస్తుతం ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో.. ఈ వినాశకరమైన మిసైల్‌ని బయటకు తీయడంతో చర్చనీయాంశంగా మారింది.
గతేడాదిలో ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు దిగినప్పుడు.. మే నెలలో తాము నాటోలో చేరుతామని ఫిన్‌లాండ్, స్వీడెట్ దేశాలు ఆకాంక్షించాయి. అప్పుడు రష్యా రక్షణ కమిటీ డిప్యూటీ ఛైర్మన్ అలెక్సీ జురావ్‌లియోవ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆ రెండు దేశాలు నాటోలో చేరితే సాటన్ IIని ప్రయోగిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. అయితే.. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఫిన్‌లాండ్ నాటో కూటమిలో చేరగా.. స్వీడెన్ ఇంకా ఆమోదం కోసం వేచి చూస్తోంది.
మరోవైపు.. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం ఏడాదిన్నర నుంచి కొనసాగుతోంది. తొలుత ఉక్రెయిన్ కాస్త డీలా పడినట్టు కనిపించింది కానీ.. అమెరికా అండదండలతో రష్యా దాడుల్ని ధీటుగానే తిప్పికొడుతోంది. మొదట్లో రష్యా స్వాధీనం చేసుకున్న ఒక్కో ప్రాంతానికి తిరిగి తన వశం చేసుకుంటోంది. ఈ దెబ్బతో రష్యా సేనలు డిఫెన్స్‌లో పడ్డాయి. ఇలాంటి తరుణంలో రష్యా సాటన్ IIని బయటకు తీయడం.. హాట్ టాపిక్‌గా మారింది.
ఇక సాటన్ ll ప్రత్యేకతల గురించి మాట్లాడుకుంటే.. ఇది 116 మీటర్ల పొడవు, 220 టన్నులు బరువు ఉంటుంది. ఇందులో 10-15 వార్‌హెడ్‌లను అమర్చే వీలుంటుంది. శత్రువుల రాడార్లు, ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థలు ఈ మిసైల్‌ను గుర్తించేలోపే.. ఇది లక్ష్యానికి చేరుకొని, భీకర విధ్వంసం సృష్టిస్తుంది. ఇది గంటకు 10 వేల నుంచి 18 వేల కి.మీ. వేగంతో దూసుకుపోతుంది. అమెరికాకు చేరుకోవడానికి ఈ క్షిపణికి కేవలం 14 నిముషాలు మాత్రమే పడుతుంది.
Updated Date - 2023-09-02T23:12:54+05:30 IST