Russia Vs Ukraine: పుతిన్ సురక్షితం... ప్రతీకారం తీర్చుకుంటాం: రష్యా
ABN, First Publish Date - 2023-05-03T19:47:01+05:30
పుతిన్ కార్యాలయంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడికి (Drone attack on Kremlin) పాల్పడిందని, తాము రెండు డ్రోన్లను కూల్చేశామని రష్యా ప్రకటించింది.
మాస్కో: తమ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Putin) హత్యకు ఉక్రెయిన్ (Ukraine) కుట్ర పన్నిందని రష్యా (Russia) ఆరోపించింది. పుతిన్ కార్యాలయంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడికి (Drone attack on Kremlin) పాల్పడిందని, తాము రెండు డ్రోన్లను కూల్చేశామని రష్యా ప్రకటించింది. దీన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని, ప్రతీకారం తీర్చుకుంటామని వెల్లడించింది. దాడి సమయంలో పుతిన్ క్రెమ్లిన్‌లో (Kremlin) లేరని, ఆయన సురక్షితంగా ఉన్నారని తెలిపింది. మాస్కోలో అనధికారిక డ్రోన్లు ఎగరడంపై నిషేధం విధించారు. ఈ నెల 9న విక్టరీ పరేడ్ యథాతథంగా కొనసాగుతుందని కూడా రష్యా ప్రకటించింది. అయితే ఏకంగా పుతిన్ కార్యాలయంపై డ్రోన్ దాడి జరగడం, ఆ దృశ్యాలు సీసీ టీవీలో రికార్డై ప్రపంచ వ్యాప్తంగా మీడియాలో ప్రసారం కావడంతో రష్యాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
మరోవైపు రష్యా పెద్ద ఎత్తున తమపై దాడి చేసేందుకు యోచన చేస్తోందని, తాము ఎప్పుడూ రష్యన్ ఫెడరేషన్‌లోని ప్రదేశాలను లక్ష్యం చేసుకుని దాడులు చేయలేదని ఉక్రెయిన్ తెలిపింది. క్రెమ్లిన్‌పై డ్రోన్ దాడి నెపంతో తమపై మరింత పెద్ద ఎత్తున దాడి చేసే కుట్ర అని ఉక్రెయిన్ చెబుతోంది.
రష్యా ఉక్రెయిన్ మధ్య ఇప్పటికే 14 నెలలుగా యుద్ధం జరుగుతోంది. వేలాది మంది చనిపోయారు. లక్షల సంఖ్యలో ప్రజలు ఇతర దేశాలకు వలసపోయారు. వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. అమెరికా ఉక్రెయిన్‌కు అండగా నిలబడి ఆయుధాలు కొనేందుకు వేల కోట్ల ప్యాకేజీలు ప్రకటించింది. ఆయుధాలను కూడా సరఫరా చేసింది. అంతేకాదు ఉక్రెయిన్‌పై దాడి చేసిన కారణంగా రష్యాపైన అమెరికా అనేక ఆంక్షలు పెట్టింది. ముఖ్యంగా అమెరికా, యూరోపియన్ యూనియన్ పెట్టిన ఆంక్షల కారణంగా చమురు కొనుగోళ్లు ఆగిపోవడంతో రష్యా విలవిలలాడింది. ఆ సమయంలో చైనా, భారత్ పెద్ద ఎత్తున రష్యా నుంచి కారుచౌకకు చమురు కొనుగోలు చేశాయి. దీంతో రష్యా ఆర్ధికంగా నిలదొక్కుకోగలిగింది.
తాజాగా క్రెమ్లిన్‌పై ఉక్రెయిన్ డ్రోన్ దాడి నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి. యుద్ధం మరింత తీవ్రమయ్యే అవకాశాలు కనపడుతున్నాయని అంతర్జాతీయ పరిశీలకులు చెబుతున్నారు.
Updated Date - 2023-05-03T20:03:06+05:30 IST