London church : చర్చి సమీపంలో కాల్పులు... ఏడేళ్ళ బాలిక సహా పలువురికి గాయాలు...
ABN, First Publish Date - 2023-01-15T13:15:58+05:30
మృతులకు నివాళులర్పించి, పావురాలను ఎగురవేయబోతున్నవారిపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో చిన్నారులు
లండన్ : మృతులకు నివాళులర్పించి, పావురాలను ఎగురవేయబోతున్నవారిపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో చిన్నారులు సహా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. లండన్‌లోని ఓ చర్చి సమీపంలో శనివారం ఈ దారుణం జరిగింది.
బ్రిటన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తల్లి, ఆమె కుమార్తె నవంబరులో కొద్ది రోజుల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయారు. వీరిద్దరికీ శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని చర్చి సమీపంలోని శ్మశాన వాటికలో శనివారం నిర్వహించారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత అందరూ బయటకు వెళ్లి, పావురాలను ఎగురవేసేందుకు ప్రయత్నించారు. అంతలోనే నల్లని కారులో కొందరు దుండగులు వచ్చారు. ఆ కారు నడుస్తుండగానే కాల్పులు జరిపి, పారిపోయారు.
ఈ సంఘటనలో ఏడేళ్ళ బాలిక తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. 12 ఏళ్ళ బాలికకు కాలిపై గాయం అయింది, ఆమెకు చికిత్స చేసి, ఆసుపత్రి నుంచి పంపించేశారు. నలుగురు మహిళలు కూడా ఈ సంఘటనలో గాయపడ్డారు. వీరికి కూడా చికిత్స జరుగుతోంది.
ఉత్తర లండన్‌లోని యూస్టర్ రైల్వే స్టేషన్‌కు సమీపంలో జరిగిన ఈ సంఘటన గురించి పోలీస్ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ, ఈ దారుణ సంఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని చెప్పారు. కాల్పుల సంఘటనలు ఆమోదయోగ్యం కాదన్నారు. బాలలతో సహా అనేక మంది గాయపడటం దిగ్భ్రాంతికరమని చెప్పారు.
సెయింట్ అలూసియస్ రోమన్ కేథలిక్ చర్చి ఫాదర్ జెరెమీ ట్రూడ్ మాట్లాడుతూ, శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని పూర్తి చేసిన తర్వాత, అందరూ బయటకు వెళ్లిపోతున్న సమయంలో తనకు బయట కాల్పుల శబ్దం వినిపించిందని చెప్పారు.
Updated Date - 2023-01-15T13:16:03+05:30 IST