ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ukraine vs Russia: భారీ దాడికి రష్యా యత్నం.. పటాపంచలు చేసిన ఉక్రెయిన్.. ఏకంగా 22 డ్రోన్లు ధ్వంసం

ABN, First Publish Date - 2023-09-03T19:02:30+05:30

సుమారు ఏడాదిన్నర నుంచి ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. తొలుత తన బలంతో ఉక్రెయిన్‌పై రష్యా ఉక్కుపాదం మోపగా.. క్రమంగా ఉక్రెయిన్ సైతం ధీటుగా...

సుమారు ఏడాదిన్నర నుంచి ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. తొలుత తన బలంతో ఉక్రెయిన్‌పై రష్యా ఉక్కుపాదం మోపగా.. క్రమంగా ఉక్రెయిన్ సైతం ధీటుగా ఎదురుదాడులకు దిగింది. అమెరికా లాంటి అగ్రరాజ్యం అండదండలతో.. రష్యాని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మొదట్లో రష్యా ఆక్రమించిన ఉక్రెయిన్ భూభాగాల్ని తిరిగి మెల్లగా తన వశం చేసుకుంటోంది. దీంతో రష్యా తన దాడుల్ని మరింత పెంచింది. ఉక్రెయిన్‌ని బెంబేలెత్తించడం కోసం వరుస డ్రోన్ దాడులకి దిగింది.

ఈ క్రమంలోనే.. ఉక్రెయిన్‌‌లోని అతిపెద్ద పోర్టు నగరమైన ఒడెస్సా మీద భారీ దాడి చేయాలని ఆదివారం రష్యా మాస్టర్ ప్లాన్ వేసింది. ఆ ప్రాంతంపై దాదాపు 25 డ్రోన్లను రష్యా పంపింది. అయితే.. రష్యా ప్లాన్‌ని పసిగట్టిన ఉక్రెయిన్, పరిస్థితి చెయ్యి దాటకముందే ఆ ప్లాన్‌ని పటాపంచలు చేసింది. ఒడెస్సాపై దాడికి వచ్చిన డ్రోన్లను కూల్చేసింది. స్వయంగా ఉక్రెయిన్ ఈ విషయాన్ని వెల్లడించింది. ‘‘ఇరానియన్స్ తయారు చేసిన షహీద్‌ 136, 131 రకం డ్రోన్లను దక్షిణ, ఆగ్నేయ ఒడెస్సాపైకి రష్యా పంపింది. అయితే.. మా వాయుసేన, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ఆ డ్రోన్లను గుర్తించి కూల్చేశాయి. మొత్తం 22 డ్రోన్లను మా సైన్యం నాశనం చేసింది’’ అని ఉక్రెయిన్ ఎయిర్‌ ఫోర్స్‌ టెలిగ్రామ్‌ ఛానల్‌లో పేర్కొంది.


కాగా.. ధాన్యం రవాణాకు ఉక్రెయిన్‌కు ఒడెస్సా పోర్టు ఎంతో కీలకమైంది. అయితే.. ఐరాస మధ్యవర్తిత్వం వహించిన నల్ల సముద్రపు ధాన్యం ఒప్పందం నుంచి జులైలో రష్యా వైదొలిగినప్పటి నుంచి.. ఉక్రెయిన్‌లోని ఆగ్నేయ ఒడెస్సా, మైకలోవ్‌ ప్రాంతాలపై తన దాడుల్ని తీవ్రం చేసింది. ఒప్పటికే ఒడెస్సా పోర్టులోని కీలక సదుపాయాలను ధ్వంసం చేసింది. ఉక్రెయిన్‌ని కుంగదీయాలన్న లక్ష్యంతోనే రష్యా ఈ ప్రాంతంలో దాడుల్ని పెంచింది. ఆహార సంక్షోభం, కరువు తీసుకరావాలన్న ఉద్దేశంతోనే.. రష్యా ఇలా ఓడరేవు మౌలిక సదుపాయాలపై దాడి చేస్తోందని ఉక్రేనియన్ అధ్యక్షుడి చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆండ్రీ యెర్మాక్ టెలిగ్రామ్‌లో రాసుకొచ్చారు.

ఇదిలావుండగా.. ఈమధ్య కాలంలో ఉక్రెయిన్ ఎదురుదాడులు మందగించాయని ప్రచారం జరగ్గా, ఇందులో వాస్తవం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పందించారు. ఎవరెన్ని చెప్పినా.. రష్యాపై ఉక్రెయిన్‌ ఎదురుదాడులు ముందుకు కొనసాగుతుంటాయని తేల్చి చెప్పారు. మరోవైపు.. క్రిమియా వంతెనపై డ్రోన్‌ బోట్లతో దాడికి ఉక్రెయిన్ ప్రయత్నించిందని, దీనిని తాము తిప్పికొట్టామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తొలుత శుక్రవారం దాడి చేయాలని ఉక్రెయిన్ ప్రయత్నించిందని.. శనివారం ఉదయం కూడా మరో రెండు డ్రోన్‌ పడవలను దాడి ఉద్దేశంతో వంతెన వద్దకు పంపిందని చెప్పుకొచ్చింది.

Updated Date - 2023-09-03T22:29:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising