Share News

Gaza Hospitals: గాజాలో హెల్త్ ఎమర్జెన్సీ? ఆసుపత్రుల్లో వైద్యం అందట్లేదన్న హమాస్

ABN , First Publish Date - 2023-11-13T16:48:09+05:30 IST

గాజా(Gaza)లో ఇజ్రాయెల్ చేస్తున్న మారణహోమంలో భయంకర విషయాలు బయటకివస్తున్నాయి. ఉత్తర గాజా స్ట్రిప్(Gaza Strip)లో ఆసుపత్రులేవీ పని చేయడం లేదని హమాస్(Hamas) ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇవాళ తెలిపింది.

Gaza Hospitals: గాజాలో హెల్త్ ఎమర్జెన్సీ? ఆసుపత్రుల్లో వైద్యం అందట్లేదన్న హమాస్

గాజా: గాజా(Gaza)లో ఇజ్రాయెల్ చేస్తున్న మారణహోమంలో భయంకర విషయాలు బయటకివస్తున్నాయి. ఉత్తర గాజా స్ట్రిప్(Gaza Strip)లో ఆసుపత్రులేవీ పని చేయడం లేదని హమాస్(Hamas) ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇవాళ తెలిపింది. దీంతో రోగులు వైద్యం అందక అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. విషయం తెలుసుకున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ దేశాలు మౌనం వీడాలని కోరింది. ఇజ్రాయెల్(Israeil) దాడుల్లో క్షతగాత్రులైన వారిని గాజాలోని ఆసుపత్రుల్లో చేర్చారు. అయితే వివిధ కారణాల వల్ల ఇప్పుడు రోగులకు వైద్యం ఆపేయాల్సిన దుస్థితి ఏర్పడింది.

గాజాలోని అల్-షిఫా ఆసుపత్రి ఇక పని చేయదని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ గెబ్రియాసిస్(Tedros Adhanom Ghebreyesus) తెలిపారు. ఆసుపత్రుల్లో(Gaza Hospitals) మరణాలు సంభవించడంపై ప్రపంచం నిశ్శబ్దంగా ఉండటం మంచిది కాదని.. ఆసుపత్రుల్లో మరణాలు, విధ్వంసం మానవ సమాజానికి మాయని మచ్చలా మిగులుతాయని హెచ్చరించారు. "ఉత్తర గాజాలో పరిస్థితి భయంకరంగా ఉంది. ఇక్కడ ఆసుపత్రులను ఇజ్రాయెల్ దళాలు దిగ్బంధించాయి. లోపల ఉన్నవారికి సంరక్షణ అందించలేకపోతున్నాయి.


ఇంధన కొరతతో అల్-షిఫా ఆసుపత్రిలో ఆరుగురు శిశువులు, తొమ్మిది మంది రోగులు మరణించారు. హాస్పిటళ్లలో కరెంట్ సరఫరాకు అంతరాయం కలుగుతోంది. జనరేటర్లలు ఇంధన కొరతతో ఆగిపోయాయి" అని అధికారులు తెలిపారు. గాజాలోని ఆసుపత్రులను హమాస్ తమ ఆపరేషన్ల కోసం ఉపయోగిస్తోందని ఇజ్రాయెల్ పలు సందర్భాల్లో ఆరోపించింది. "దాదాపు 3 వేల మంది రోగులు ఆసుపత్రిలో ఆశ్రయం పొందుతున్నారు. వారికి నీరు, ఆహారం లేదు. నా కళ్ల ముందే ఇద్దరు శిశువుల మరణించారు" అని ఓ వ్యక్తి వాపోయాడు. అక్టోబర్ 7న ప్రారంభమైన ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధంలో ఇప్పటివరకు 11 వేలకు పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వేల సంఖ్యలో వైమానికదాడులకు పూనుకున్న ఇజ్రాయెల్ హమాస్ అంతమే లక్ష్యంగా పావులు కదుపుతుండగా.. దాడుల్లో అమాయకపు ప్రజలు సమిధలవుతున్నారు.

యుద్ధాన్ని ఆపాలని కోరుతున్నా ఎవరూ తగ్గట్లేదు. దీంతో గాజాలో ఇప్పుడు నెత్తుటేర్లు పొంగుతున్నాయి. ఇంకా వేలాదిమంది శిథిలాల కింద చిక్కుకుని ఉన్నారు. అటు.. ఇజ్రాయెల్ తన దాడుల్ని ఇంకా కొనసాగిస్తూనే ఉంది కాబట్టి, మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో.. అక్కడి ప్రజలు తమ ప్రాణాల్ని అరచేతిలో పట్టుకొని బతుకుతున్నారు. కాల్పుల విరమణ అంటే, హమాస్‌కి లొంగిపోవడమేనని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ(Benjamin Netanyahu) పేర్కొన్నారు.

పౌరుల మరణాలకు హమాస్‌దే బాధ్యత అని, ఇజ్రాయెల్‌ది కాదని తేల్చి చెప్పారు. ప్రపంచ దేశాలు ఇజ్రాయెల్‌ని కాదు, హమాస్ చర్యల్ని ఖండించాలని డిమాండ్ చేశారు. తమపై హమాస్ పాల్పడుతున్న నేరాలు.. రేపు పారిస్, న్యూయార్క్‌లలో కూడా జరగొచ్చని హెచ్చరించారు. అంతకుముందు కూడా.. పాలస్తీనా భూభాగాన్ని తిరిగి ఆక్రమించుకోవాలని ఇజ్రాయెల్ ప్లాన్ చేయలేదని, అయితే దానికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని అనుకుంటున్నామన్నారు.

Updated Date - 2023-11-13T16:48:11+05:30 IST