Republic Day : ఈ గణతంత్ర దినోత్సవాల్లో రికార్డుల మోత!
ABN, First Publish Date - 2023-01-26T13:12:38+05:30
దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవాలు గురువారం ఘనంగా జరుగుతున్నాయి. దేశ రాజధాని నగరం ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవాలు గురువారం ఘనంగా జరుగుతున్నాయి. దేశ రాజధాని నగరం ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో జరిగిన వేడుకల్లో అనేక రికార్డులు నమోదయ్యాయి. రక్షణ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నివీర్ పథకం క్రింద నియమితులైన అగ్నివీరులు మొట్టమొదటిసారి గణతంత్ర దినోత్సవాల కవాతులో పాల్గొన్నారు. గతంలో రాజ్‌పథ్‌గా పిలిచిన మార్గానికి ఇప్పుడు కర్తవ్యపథ్ అని పేరు పెట్టారు. ఈ పేరు పెట్టిన తర్వాత తొలిసారి ఇక్కడ కవాతు జరిగింది.
ఆత్మనిర్భర్ భారత్ (స్వయంసమృద్ధ భారత్) పథకంలో భాగంగా మన దేశంలోనే తయారు చేసిన 105ఎంఎం లైట్ ఫీల్డ్ గన్స్‌తో 21సార్లు పేల్చి గౌరవ వందనం చేశారు. ఈ తుపాకులతో ఈ విధంగా గౌరవ వందనం చేయడం ఇదే తొలిసారి.
గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు ఎల్-సిసి (El-Sisi) హాజరయ్యారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఈజిప్టు నేతను ఆహ్వానించడం ఇదే మొదటిసారి. ఆ దేశ సైన్యం గణతంత్ర దినోత్సవాల కవాతులో పాల్గొంది. ఇది కూడా మొదటిసారే. ఎల్ సిసి మంగళవారం ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు.
ద్రౌపది ముర్ము (Draupadi Murmu) రాష్ట్రపతి హోదాలో గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొనడం ఇదే ప్రథమం. ఈ సందర్భంగా ఆమె తన స్వరాష్ట్రమైన ఒడిశా సంస్కృతిని ప్రదర్శించేవిధంగా ఆ రాష్ట్రంలో తయారైన టెంపుల్ బోర్డర్ గల పట్టుచీరను ధరించారు.
ఒంటెల దళంతో మహిళలు కవాతు నిర్వహించడం ఇదే మొదటిసారి. వీరు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF)కు చెందినవారు. సోనాల్, నిషా, భగవతి, అంబిక, కుసుమ్, ప్రియాంక, కౌసల్య, కాజల్, భావన, హీనా తదితరులు ఈ దళంలో ఉన్నారు.
అందరూ మహిళలే ఉన్న సీఆర్‌పీఎఫ్-పీస్‌కీపర్స్ ఆఫ్ ది నేషన్ కంటింజెంట్ కూడా కవాతు నిర్వహించింది. దీనికి అసిస్టెంట్ కమాండెంట్ పూనమ్ గుప్తా నాయకత్వం వహించారు. వుమెన్ ఆర్మ్‌డ్ పోలీస్ బెటాలియన్ ఏర్పాటవడం ప్రపంచంలో ఇదే తొలిసారి.
మాదక ద్రవ్యాల నియంత్రణకు కృషి చేస్తున్న నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో మొట్టమొదటిసారి ఓ శకటాన్ని ప్రదర్శించింది. మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారడానికి వ్యతిరేకంగా ఈ శకటాన్ని తీర్చిదిద్దింది.
35 మంది మహిళా కానిస్టేబుళ్ళతో ఢిల్లీ పోలీస్ వుమెన్ పైప్ బ్యాండ్ ఈ కవాతులో పాల్గొనడం కూడా ఇదే మొదటిసారి.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వర్ణరంజితమైన తలపాగాను ధరించారు. పొడవైన వస్త్రం వేలాడేవిధంగా అనేక రంగులతో కూడిన ఈ రాజస్థానీ తలపాగా అంతరార్థం ఏమిటని చాలా మంది ఆసక్తిగా ప్రశ్నిస్తున్నారు. తెల్లని కుర్తా, ప్యాంట్స్, ఆ పైన నల్లని కోటు ధరించిన మోదీ రంగు రంగుల తలపాగాను ధరించడానికి కారణం మన దేశంలోని వైవిద్ధ్యాన్ని ప్రదర్శించేందుకేనని తెలుస్తోంది.
Updated Date - 2023-01-26T14:16:53+05:30 IST