Arakkonam Temple Festival: సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో.. రెప్పపాటులోనే..
ABN, First Publish Date - 2023-01-23T12:55:29+05:30
తమిళనాడులోని అరక్కోణంలో (Arakkonam) విషాదం చోటుచేసుకుంది. ఆలయ ఉత్సవాల్లో క్రేన్ కూలడంతో (Crane Crash) నలుగురు భక్తులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన..
చెన్నై: తమిళనాడులోని అరక్కోణంలో (Arakkonam) విషాదం చోటుచేసుకుంది. ఆలయ ఉత్సవాల్లో క్రేన్ కూలడంతో (Crane Crash) నలుగురు భక్తులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. తమిళనాడు దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్ బాబు ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోమవారం నాడు ప్రమాద జరిగిన ప్రాంతానికి వెళ్లి మంత్రి పరిశీలించనున్నారు. క్రేన్ ఉపయోగించడానికి అనుమతి లేనప్పటికీ నిర్వాహకులు వినియోగించినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. క్రేన్ ఆపరేటర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నట్లు రాణిపేట్ కలెక్టర్ భాస్కర పాండ్యన్ మీడియాకు తెలిపారు. ఈ ఘటనలో మరో 9 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన వారిలో ముగ్గురు ఎవరనేది పోలీసులు గుర్తించారు. బి.జోతిబాబు (17), ఎస్.భూపాలం(40), కె.ముత్తుకుమార్‌తో(39) పాటు మరొకరు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం రాత్రి 8.15 నిమిషాలకు ఈ ఘటన జరిగింది.
నెమిలి అనే ప్రాంతానికి సమీపంలో ఉన్న మాండియమ్మన్ ఆలయంలో (Mandiyamman Temple) మైలార్ ఉత్సవాలు (Mylar Festival) ప్రతీ ఏటా పొంగల్ సందర్భంగా జరుగుతాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రతీ సంవత్సరం దేవత విగ్రహాన్ని క్రేన్‌పై ఉంచి కొందరు భక్తులు అదే క్రేన్‌కు వేలాడుతూ కింద ఉన్న భక్తులు ఇచ్చిన పూల దండలను అమ్మవారికి సమర్పిస్తుంటారు. ఆ దండలు అందుకునేందుకు కొందరు భక్తులు క్రేన్‌పై ఉంటారు. అప్పుడు క్రేన్ ఆపరేటర్ చుట్టూ తిప్పుతూ భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కలిగేలా, అమ్మవారు భక్తులు అందించే పూలమాలలు అందుకునేలా చేస్తాడు. అలా క్రేన్‌ను చుట్టూ తిప్పే క్రమంలో అదుపు తప్పి కుప్పకూలింది. ఈ ఘటనతో భక్తులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఈ క్రేన్ ప్రమాదం జరిగిన సమయంలో 1,500 మంది భక్తులు ఆ ఉత్సవాల్లో భాగంగా అక్కడ ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటన జరిగిన సమయంలో క్రేన్‌పై మొత్తం 8 మంది ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనతో తమిళనాడు ఉలిక్కిపడింది. క్రేన్‌కు వేలాడుతూ దండలు తీసుకునేందుకు భక్తులు ప్రయత్నించడం ప్రమాదకరం కావడంతో పోలీసులు క్రేన్ ఉపయోగించేందుకు అనుమతి ఇవ్వలేదు. అయినప్పటికీ ఈ ఉత్సవాల్లో క్రేన్‌ను ఉపయోగించడం, ఆ క్రేన్ కూలిపోవడంతో రెప్పపాటులోనే ఊహించని విషాదం చోటుచేసుకుంది.
Updated Date - 2023-01-23T13:08:58+05:30 IST