Adani Group Vs Hindenburg : హిండెన్‌బర్గ్‌పై అదానీ కీలక నిర్ణయం
ABN, First Publish Date - 2023-02-10T16:57:01+05:30
అదానీ గ్రూప్ (Adani Group) కంపెనీలు స్టాక్ మానిపులేషన్, మోసాలకు పాల్పడుతున్నట్లు హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపించిన సంగతి తెలిసిందే.
న్యూఢిల్లీ : అమెరికన్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research)పై న్యాయ పోరాటానికి అదానీ గ్రూప్ సన్నాహాలు చేస్తోంది. ఈ రంగంలో గొప్ప పేరున్న న్యాయవాద సంస్థల్లో ఒకటైన వాచ్‌టెల్ (Wachtell)ను నియమించుకుంది. ఈ సంస్థలోని అత్యంత అనుభవజ్ఞులైన న్యాయవాదులు లిప్టన్, రోజెన్, కట్జ్‌లను ఎంపిక చేసుకుంది. న్యూయార్క్‌లో ఉన్న ఈ న్యాయవాద సంస్థకు కార్పొరేట్ చట్టాలు, భారీ, సంక్లిష్ట లావాదేవీల నిర్వహణలో గొప్ప పట్టు ఉంది.
అదానీ గ్రూప్ (Adani Group) కంపెనీలు స్టాక్ మానిపులేషన్, మోసాలకు పాల్పడుతున్నట్లు హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నివేదిక నేపథ్యంలో అదానీ గ్రూప్ ఆర్థిక సామ్రాజ్యం కుప్పకూలింది. ఈ గ్రూప్ స్టాక్స్ అమ్మకాలు నిరంతరం కొనసాగడంతో అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ ఎఫ్‌పీఓ (follow-on public offer)ను ఉపసంహరించుకోవలసి వచ్చింది.
హిండెన్‌బర్గ్ నైతికత లేని షార్ట్ సెల్లర్ అని అదానీ గ్రూప్ ఆరోపించింది. ఈ నివేదిక పూర్తిగా అబద్ధమని పేర్కొంది. పెట్టుబడిదారుల్లో భరోసాను నింపడంపై గౌతమ్ అదానీ (Gautam Adani) దృష్టి సారించారు. తన వ్యాపార సామ్రాజ్యం బలమైన పునాదులపై నిర్మితమైందని, ఎటువంటి ఆర్థిక నష్టభయాలు లేవని గట్టిగా చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ గ్రూప్ న్యూయార్క్‌లోని వాచ్‌టెల్ న్యాయవాద సంస్థను సంప్రదించిందని జాతీయ మీడియా వెల్లడించింది. ఈ సంస్థలోని అత్యంత అనుభవజ్ఞులైన లిప్టన్, రోజెన్, కట్జ్‌లను ఎంపిక చేసుకుందని తెలిపింది. ఈ న్యాయవాద సంస్థ అమెరికాలో అత్యంత ఖరీదైనదని పేర్కొంది. దీనినిబట్టి హిండెన్‌బర్గ్ నివేదిక ప్రభావం అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీలపై ఎంత తీవ్రంగా పడిందో అర్థం చేసుకోవచ్చునని తెలిపింది.
అమెరికాలోని భారీ కంపెనీలు తీవ్రంగా కోరుకునే న్యాయవాద సంస్థ వాచ్‌టెల్. దీనికి అనేక దశాబ్దాల చరిత్ర ఉంది. యాక్టివిస్ట్ ఇన్వెస్టర్ల దాడికి గురైన కంపెనీలు న్యాయ పోరాటం కోసం ఈ సంస్థనే ఆశ్రయిస్తూ ఉంటాయి.
Updated Date - 2023-02-10T16:57:05+05:30 IST