Madhya Pradesh : గిరిజనుడిపై మూత్ర విసర్జన చేసిన నిందితునికి పోలీస్ ట్రీట్‌మెంట్‌పై విమర్శలు
ABN, First Publish Date - 2023-07-06T12:34:30+05:30
: మధ్య ప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో ఓ గిరిజనుడిని అవమానించిన బీజేపీ నేత ప్రవేశ్ శుక్లా పోలీస్ స్టేషన్‌లోకి దర్జాగా వెళ్తున్నట్లు ఓ వీడియోలో కనిపించడంతో నెటిజన్లు విమర్శలు గుప్పించారు. దీంతో పోలీసులు గురువారం మరో వీడియోను విడుదల చేశారు.
భోపాల్ : మధ్య ప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో ఓ గిరిజనుడిని అవమానించిన బీజేపీ నేత ప్రవేశ్ శుక్లా పోలీస్ స్టేషన్‌లోకి దర్జాగా వెళ్తున్నట్లు ఓ వీడియోలో కనిపించడంతో నెటిజన్లు విమర్శలు గుప్పించారు. దీంతో పోలీసులు గురువారం మరో వీడియోను విడుదల చేశారు. శుక్లాను కొడుతూ, తోసుకుంటూ తీసుకెళ్తున్నట్లు ఈ వీడియోలో కనిపించింది. దీనిపై కూడా నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
దశమత్ రావత్ అనే గిరిజన కూలీపై ప్రవేశ్ శుక్లా మూత్ర విసర్జన చేస్తున్నట్లు కనిపిస్తున్న ఓ వీడియో ఇటీవల బయటపడింది. దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమైంది. ముఖ్యమంత్రి శివరాజ్ వెంటనే స్పందించి, నిందితునిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధితుడిని తాను భోపాల్‌లో కలుస్తానని, క్షమాపణ చెబుతానని ప్రకటించారు. నిందితుడిని పోలీసులు బుధవారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. ఐపీసీ సెక్షన్లు 294 (అసభ్యకర చర్యలకు పాల్పడటం), 504 (శాంతికి భంగం కలిగేవిధంగా ఉద్దేశపూర్వకంగా అవమానించడం), ఎస్సీ, ఎస్టీ చట్టం, జాతీయ భద్రత చట్టం ప్రకారం నిందితునిపై ఆరోపణలను నమోదు చేశారు. బుధవారం సాయంత్రం నిందితుని అక్రమ ఇంటిని బుల్డోజర్‌తో కూల్చేశారు. ఆ సమయంలో ఆయన తల్లి స్పృహ కోల్పోయారు. మధ్య ప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా మాట్లాడుతూ, నిందితునిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాధితుడు దశమత్ రావత్‌కు శివరాజ్ సింగ్ చౌహాన్ గురువారం క్షమాపణ చెప్పారు. రావత్‌ను కుర్చీలో కూర్చోబెట్టి, ఆయన పాదాలను శివరాజ్ కడిగారు. ఆయనకు శాలువ కప్పి సత్కరించారు. దీనికి సంబంధించిన ఫొటోలను ట్విటర్ వేదికగా షేర్ చేశారు. తన మనసు ఎంతో బాధతో నిండిపోయిందని, ప్రజలే తనకు దేవుళ్లని చెప్పారు.
ఇదిలావుండగా, పోలీసులు గురువారం విడుదల చేసిన వీడియోపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. బుధవారం విడుదల చేసిన వీడియోకు, ఈ వీడియోకు తేడాను వివరిస్తూ, చాలా రీటేక్‌ల తర్వాత ఈ వీడియోను రూపొందించినట్లు కనిపిస్తోందని ఆరోపించారు. పోలీసులు సోషల్ మీడియాను బాగా సన్నిహితంగా గమనిస్తున్నట్లు కనిపిస్తోందని, దేశాన్ని దేవుడే కాపాడాలని మరొకరు వ్యాఖ్యానించారు. పోలీసుల నటన అద్భుతమని మరొకరు దెప్పిపొడిచారు. వీరికి ఆస్కార్ అవార్డ్ రావాలన్నారు. డ్యామేజ్ కంట్రోల్ కోసం ఈ రెండో వీడియోను పోలీసులు విడుదల చేశారని ఎద్దేవా చేశారు.
ఇవి కూడా చదవండి
Canada : ‘ఖలిస్థాన్’పై కెనడా నేతలు మౌనం.. భారత దౌత్యవేత్తలకు భద్రత ఏర్పాట్లు..
Kapil Sibal : ఇది ప్రజాస్వామ్యం కాదు : కపిల్ సిబల్
Updated Date - 2023-07-06T12:34:30+05:30 IST