Karnataka Assembly Elections: ప్రధాని మోదీపై నోరుపారేసుకున్న ఖర్గే తనయుడు
ABN, First Publish Date - 2023-05-01T17:15:21+05:30
మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) కుమారుడు ప్రియాంక్ ఖర్గే (Priyank Kharge) అనుచిత వ్యాఖ్యలు చేశారు.
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly Elections) వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై (PM Modi) కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) కుమారుడు ప్రియాంక్ ఖర్గే (Priyank Kharge) అనుచిత వ్యాఖ్యలు చేశారు. కలబురిగి జిల్లా పర్యటనలో భాగంగా బంజారా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రధాని మోదీని నాలాయక్ బేటా (nalayak beta) అని సంబోధించారు. నాలాయక్ బేటా అంటే పనికిమాలిన కుమారుడు(useless son) అని అర్థం.
ప్రధాని మోదీ ఇటీవలే కర్ణాటక పర్యటనలో భాగంగా బంజారా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ బంజారా ప్రజల కుమారుడిగా తాను ఢిల్లీలో ఉన్నానని, అందరి బాగోగులు చూస్తానని చెప్పారు. దీనికి కౌంటర్‌గా ప్రియాంక్ ఖర్గే మాట్లాడుతూ ప్రధాని తనను తాను బంజారాల కుమారుడంటూనే బంజారాలను మోసం చేశారని, రిజర్వేషన్ల విషయంలో బంజారాలను అయోమయంలో పడేశారని చెప్పారు. అంతేకాదు ప్రధానిని నాలాయక్ బేటా అని కూడా అన్నారు.
ప్రియాంక్ ఖర్గే తండ్రి మల్లికార్జున ఖర్గే నాలుగు రోజుల క్రితం మోదీని విష పాముతో (poisonous snake) పోల్చారు. కలబుర్గిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన అక్కడి బహిరంగ సభలో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీ విషపాము అని విషం ఉందా లేదా అని నాకి చూస్తే చచ్చి ఊరుకుంటారని ఖర్గే అన్నారు. అయితే తన వ్యాఖ్యలు మోదీపై కాదని, బీజేపీపై అని ఖర్గే వివరణ ఇచ్చుకున్నారు. క్షమాపణలు కూడా చెప్పారు.
మల్లిఖార్జున ఖర్గే అనుచిత వ్యాఖ్యల రగడ కొనసాగుతుండగానే ఆయన తనయుడు ప్రియాంక్ ఖర్గే కూడా ప్రధానిపై నోరుపారేసుకోవడం దుమారం రేపుతోంది. మల్లికార్జున ఖర్గేపై బీజేపీ నేతలు ఈసీకి కూడా ఫిర్యాదు చేశారు.
కాంగ్రెస్ నాయకులు గతంలో కూడా మోదీని వ్యక్తిగతంగా విమర్శించారు. మోదీని మౌత్ కా సౌదాగర్ (మృత్యు వ్యాపారి) అని స్వయంగా సోనియా అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గరకు వచ్చి చాయ్ అమ్ముకోమని మణిశంకర్ అయ్యర్ గతంలో విమర్శించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అలాగే 2014, 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు మోదీని వ్యక్తిగతంగా విమర్శించారు. ఎన్నికల్లో మాత్రం లబ్ది పొందలేకపోయారు.
కాంగ్రెస్ నేతలు తనను ఇప్పటివరకూ 91 తిట్లు తిట్టారని ప్రధాని మోదీ చెప్పారు.
కర్ణాటక (Karnataka)లో మే 10న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు మే 13న జరుగుతుందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
Updated Date - 2023-05-01T17:26:58+05:30 IST