AirIndia Pee-Gate: మూత్రంపోసిన వ్యక్తిపై వేటు.. తొలగించిన కంపెనీ!
ABN, First Publish Date - 2023-01-06T19:08:11+05:30
ఎయిర్ ఇండియా(Air India) విమానంలో మహిళా ప్రయాణికురాలిపై మూత్రం పోసిన(peed on by a co-flyer) ఘటనపై నిందితుడైన శంకర్ మిశ్రా
న్యూఢిల్లీ: న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలో వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేసిన శంకర్ మిశ్రా(35)ను కష్టాలు చుట్టుముడుతున్నాయి. ఆయన కోసం పోలీసులు గాలిస్తుండగా, మరోవైపు ఆయన పనిచేస్తున్న వెల్స్ ఫార్గో (Wells Fargo) అతడిని ఉద్యోగం నుంచి తొలగించింది. తమ ఉద్యోగులు హుందాగా ప్రవర్తించాలని తాము కోరుకుంటున్నట్టు వెల్స్ ఫార్గో పేర్కొంది. శంకర్ మిశ్రా(Shankar Mishra)పై వచ్చిన ఆరోపణలు తమను తీవ్రంగా కలవరపెడుతున్నాయని, ఆయనను కంపెనీ నుంచి తొలగిస్తున్నామని పేర్కొంది. ఈ విషయంలో విచారణకు పూర్తిగా సహకరిస్తామని తెలిపింది.
నిందితుడు శంకర్ మిశ్రాపై ఢిల్లీ పోలీసులు లుక్ అవుట్ (Look Out Notice) నోటీసు జారీ చేసి ఆయన కోసం గాలిస్తున్నారు. అతడి కోసం ఢిల్లీ పోలీసులు కొన్ని బృందాలను ముంబైకి పంపినా ఫలితం లేకుండా పోయింది. దీంతో అతడి కోసం గాలింపు మరింత ముమ్మరం చేశారు. ఈ క్రమంలో శంకర్ మిశ్రా చివరి లొకేషన్ బెంగళూరులో గుర్తించారు. శంకర్ మొబైల్ ఫోన్ ఈ నెల 3 బెంగళూరులో యాక్టివ్‌గా ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. అయితే, ఆ తర్వాత అతడి ఫోన్ స్విచ్చాఫ్ అయింది.
దీంతో ఢిల్లీ పోలీసులు శంకర్ మిశ్రా కుటుంబ సభ్యులను సంప్రదించారు. వారు శంకర్ మిశ్రాతో ఫోన్‌లో మాట్లాడారు. అయితే, వారు కూడా తమకు సహకరించడం లేదని పోలీసులు చెబుతున్నారు. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు మిశ్రా పరారీలో ఉన్నట్టు పేర్కొన్నారు.
ఏం జరిగింది?
నవంబరు 26న న్యూయార్క్(New York) నుంచి న్యూఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా(Air India) విమానంలోని బిజినెస్ క్లాస్‌లో ప్రయాణిస్తున్న శంకర్ మిశ్రా మద్యం మత్తులో ఓ వృద్ధ ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేశాడు. విషయం వెలుగులోకి రావడంతో డీజీసీఏ రంగంలోకి దిగింది. ఎయిర్ ఇండియాకు నోటీసులు జారీ చేసింది.
ఎవరీ శంకర్ మిశ్రా?
ముంబైకి చెందిన శంకర్ మిశ్రా వెల్స్ ఫార్గో కంపెనీ వైస్ ప్రెసిడెంట్. అమెరికాకు చెందిన ఈ మల్టీనేషనల్ కంపెనీ ఆర్థిక సేవలు అందిస్తుంది. కాగా, విమానంలో వృద్ధురాలిపై మూత్రవిసర్జన చేసిన శంకర్ మిశ్రాపై లైంగిక వేధింపులు, అశ్లీలత సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. మరోవైపు, శంకర్ మిశ్రాపై ఎయిర్ ఇండియా నెలరోజుల నిషేధం విధించడంతోపాటు నిందితుడిపై ఢిల్లీలోని పాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వ్యవహారం పీకలకు చుట్టుకుంటోందని భావించిన శంకర్ మిశ్రా పరారయ్యాడు. ఇప్పుడతడి కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.
Updated Date - 2023-01-06T21:29:20+05:30 IST