Disqualification petition: శరద్ పవార్ ఎమ్మెల్యేలపై అజిత్ పవార్ వర్గం అనర్హత పిటిషన్
ABN, First Publish Date - 2023-09-22T19:35:14+05:30
మహారాష్ట్రలోని అజిత్ పవార్ వర్గం, శరద్ పవార్ ఎన్‌సీపీ వర్గం మధ్య చిచ్చు చల్లారడం లేదు. తాజాగా, ఎన్‌సీపీ అజిత్ పవార్ వర్గం మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ నార్వేకర్‌కు లేఖ రాసింది. శరద్ పవార్ వర్గం ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా అనర్హత పిటిషన్‌ను దాఖలు చేసింది.
ముంబై: మహారాష్ట్రలోని అజిత్ పవార్ (Ajit pawar) వర్గం, శరద్ పవార్ (Sharad Pawar) ఎన్‌సీపీ వర్గం మధ్య చిచ్చు చల్లారడం లేదు. తాజాగా, ఎన్‌సీపీ అజిత్ పవార్ వర్గం మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ నార్వేకర్‌కు లేఖ రాసింది. శరద్ పవార్ వర్గం ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా అనర్హత పిటిషన్‌ను (Disqualification petition) దాఖలు చేసింది. రాష్ట్ర అసెంబ్లీలో ఎన్‌సీపీ అజిత్ వర్గానికి చెందిన చీఫ్ విప్ అనిల్ పాటిల్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. శరద్ పవార్ వెంట ఉన్న ఎమ్మెల్యేలు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. అక్టోబర్ 6వ తేదీన ఎన్‌సీపీకి చెందిన రెండు వర్గాల వాదనలు వినేందుకు వ్యక్తిగతంగా తమ ముందు హాజరుకావాలని భారత ఎన్నిక కమిషన్ ఇటీవల పిలుపునిచ్చిన నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది. అయితే, ఎన్‌సీపీలోని రెండు వర్గాలు పార్టీలో చీలక రాలేదంటూ చెబుతూ వస్తున్నాయి.
దీనికి ముందు, శరద్ పవార్ వర్గం మహారాష్ట్ర అసెబ్లీ స్పీకర్‌కు ఒక పిటిషన్ సమర్పించింది. 41 మంది ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలని కోరింది. అయితే, ఆ ఎమ్మెల్యేలు ఎవరికీ స్పీకర్ ఇంతవరకూ నోటీసులు ఇవ్వలేదు. కాగా, అజిత్ పవార్ వర్గం తాజాగా స్పీకర్‌కు ఇచ్చిన అనర్హత పిటిషన్‌లో శరద్ పవార్ వర్గానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం శరద్ పవార్‌తో ఎమ్మెల్యేలు జయంత్ పాటిల్, జితేంద్ర అవథ్, రోహిత్ పవార్, అనిల్ దేశ్‌ముఖ్, రాజేష్ తోపె, బాలాసాహెబ్ పాటిల్, సందీప్ క్షీరసాగర్, సునీల్ భుసర, సుమంతాయ్ పాటిల్, ప్రాజక్త్ తనపురే, అశోక్ పవార్ ఉన్నారు.
అజిత్ పవార్ గత జూలై 2న ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంలో చేరడంతో పాటు ఎకాఎకిన రెండవ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. దీంతో ఎన్‌సీపీలో చీలక తలెత్తిది. అజిత్ పవార్‌తో పాటు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు షిండే ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఎన్‌సీపీకి చెందిన 53 మంది ఎమ్మెల్యేలలో 43 మంది అజిత్ పవార్‌కు మద్దతిచ్చినట్టు బీజేపీ చెబుతోంది. మరోవైపు, శరద్ పవార్ సైతం అజిత్ వెంట వెళ్లిన వారిలో 80 మంది ఎమ్మెల్యేలు వెనక్కి వస్తున్నట్టు చెబుతున్నారు.
Updated Date - 2023-09-22T19:39:05+05:30 IST