Akhilesh Yadav: ఇండియా కూటమికి ఊహించని దెబ్బ.. అఖిలేశ్ యాదవ్ ఔట్?
ABN, First Publish Date - 2023-10-20T21:25:49+05:30
వచ్చే ఏడాది జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీని ఓడించడమే లక్ష్యంగా.. కొన్ని విపక్ష పార్టీలు కలిసి ఇండియా కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఇప్పటివరకూ ఈ కూటమి విజయవంతంగా మూడు సమావేశాలు...
వచ్చే ఏడాది జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీని ఓడించడమే లక్ష్యంగా.. కొన్ని విపక్ష పార్టీలు కలిసి ఇండియా కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఇప్పటివరకూ ఈ కూటమి విజయవంతంగా మూడు సమావేశాలు నిర్వహించింది. అంతేకాదు.. కొన్ని పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయని వార్తలు వచ్చిన ప్రతిసారి ఆయా పార్టీల నేతలు వాటిని ఖండిస్తూ వచ్చారు. తామంతా కలిసే ఉన్నామని, తమ మధ్య ఎలాంటి గొడవలూ లేవని సమాధానాలిచ్చారు. గందరగోళ వాతావరణం సృష్టించడం కోసం బీజేపీనే ఈ పుకార్లు సృష్టిస్తోందని.. ఆ పార్టీని ఓడించేందుకు తామంతా కలిసే పోరాటం చేస్తామని చెప్పుకొచ్చారు. అలాంటి ఇండియా కూటమికి ఇప్పుడు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పెద్ద ఝలక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఈ కూటమి నుంచి తప్పుకోవాలని ఆయన ఆలోచిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సీట్ల షేరింగ్ విషయంలో కాంగ్రెస్ పార్టీతో నెలకొన్న విభేదాలే ఇందుకు కారణమని తెలుస్తోంది.
అసలు ఏమైందంటే.. సమాజ్‌వాదీ పార్టీకి ఉత్తరప్రదేశ్‌తో పాటు మధ్యప్రదేశ్‌లోనూ పలుకుబడి ఉంది. ఈ రాష్ట్రంలోని కొన్ని స్థానాల్లో ఆ పార్టీ బలంగా ఉంది. త్వరలోనే అక్కడ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో.. తాము బలంగా ఉన్న స్థానాల్లో అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీని కోరారు. ఎలాగో ఇండియా కూటమిలో కలిసే ఉన్నారు కాబట్టి.. ఈ ఎన్నికల్లోనూ కలిసి సీట్లు పంచుకోవాలన్న ఉద్దేశంతో అఖిలేశ్ యాదవ్ ఈ మేరకు అభ్యర్థన పెట్టారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కమల్‌నాథ్‌తో పాటు దిగ్విజయ్ సింగ్‌తోనూ కలిసి.. చర్చలు జరిపారు. తమ పార్టీ మధ్యప్రదేశ్‌లో రెండో స్థానంలో ఉందని, ఎవరెవరికి ఎక్కడెక్కడ బలముందో వివరాలు కూడా వివరించారు. ఈ భేటీలో భాగంగా.. ఆరు సీట్లు ఇవ్వడం గురించి ఆలోచిస్తామంటూ కాంగ్రెస్ భరోసా కల్పించింది. కానీ.. సమాజ్‌వాదీ పార్టీకి ఒక్క సీటు కల్పించకుండానే కాంగ్రెస్ పార్టీ ఫైనల్ జాబితాను ప్రకటించింది. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. తమకు ఒక్క సీటు కూడా ఇవ్వకపోవడంతో మండిపడ్డ అఖిలేశ్.. తన పార్టీ తరఫు నుంచి 18 స్థానాల్లో అభ్యర్థుల్ని పోటీకి దింపాలని నిర్ణయించారు. అంతేకాదు.. కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కూడా!
కొన్ని రోజుల ముందు జరిగిన చర్చల్లో ఆరు సీట్ల ఇవ్వడం గురించి ఆలోచిస్తామన్న కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు ఒక్క సీటు కూడా ఇవ్వలేదని అఖిలేశ్ యాదవ్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కూటమి లేదని తనకు ముందే తెలిసి ఉంటే.. అసలు ఇండియా కూటమితో కలిసేవాడ్ని కాదని, కాంగ్రెస్ నేతలతో మాట్లాడేవాడినే కాదంటూ కుండబద్దలు కొట్టారు. ఒకవేళ కాంగ్రెస్ ఇలాగే కొనసాగితే.. వారితో ఎవరు నిలబడతారు? అని ప్రశ్నించారు. బీజేపీ ఒక పెద్ద పార్టీ అని.. ఇది వ్యవస్థీకృతమైన పక్షమని.. అలా పార్టీకి వ్యతిరేకంగా బరిలోకి దిగుతున్నప్పుడు ఎలాంటి గందరగోళం ఉండకూడదని అన్నారు. ఒకవేళ గందరగోళంతో పోరాడితే.. ఏ ఎన్నికల్లోనూ గెలవలేరని తేల్చి చెప్పారు. రాష్ట్ర ఎన్నికల్లో పొత్తు ఉండదని ఇండియా కూటమి తమకు ముందే స్పష్టం చేసి ఉండాల్సిందని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్‌కు మద్దతు అవసరమైనప్పుడు.. ఎస్‌పీ ఎమ్మెల్యే మొదటగా ముందుకొచ్చారని, అప్పుడే ప్రభుత్వం ఏర్పడిందని గుర్తు చేశారు. కానీ.. కాంగ్రెస్ ఇప్పుడు ప్రవర్తిస్తున్న తీరు కరెక్ట్ కాదని కుండబద్దలు కొట్టారు. ఇలా అఖిలేశ్ తీవ్రంగా రియాక్ట్ అవ్వడం చూస్తుంటే.. ఆయన ఇండియా కూటమిని గుడ్‌బై చెప్పాలా ఉన్నారని చర్చించుకుంటున్నారు.
Updated Date - 2023-10-20T21:25:49+05:30 IST