Siddaramaih vs Dk Shivakumar: సీఎం రేసులో మూడో కృష్ణుడు?
ABN, First Publish Date - 2023-05-16T15:54:35+05:30
బెంగళూరు: కర్ణాటక తదుపరి సీఎం ఎంపిక ప్రక్రియి కీలక దశకు చేరుకుంది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లలో ఒకరిని ఎంపిక చేసే అవకాశాలున్నప్పటికీ, ఈ విషయంలో జరుగుతున్న జాప్యంతో సీఎం అభ్యర్థిగా దళిత సామాజిక వర్గానికి చెందిన జి.పరమేశ్వర పేరు తాజాగా తెరపైకి వచ్చింది.
బెంగళూరు: కర్ణాటక తదుపరి సీఎం ఎంపిక ప్రక్రియి (Karnataka CM tussle) కీలక దశకు చేరుకుంది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లలో ఎవరిని ఎంపిక చేస్తే బాగుంటుంది? ఎవరిని ఎంపిక చేస్తే ఎలాంటి పరిణమాలు ఎదురవుతాయి? అనే విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం క్షణం తీరిక లేకుండా మంతనాలు సాగిస్తోంది. అయితే సీఎం పదవికి జరుగుతున్న జాప్యంతో సీఎం అభ్యర్థిగా మరో సామాజిక వర్గానికి చెందిన కొత్త నేత పేరు తాజాగా తెరపైకి వచ్చింది. దళిత సామాజిక వర్గానికి చెందిన వెటరన్ కాంగ్రెస్ నేత జి.పరమేశ్వర (G.parameshwara)ను సీఎంగా ఎంపిక చేయాలంటూ ఆయన మద్దతుదారులు తుంకూరులో మంగళవారంనాడు ప్రదర్శన నిర్వహించారు. ''దళితునికి సీఎం పదవి ఇవ్వండి'' అనే నినాదాలున్న ప్లకార్డులతో వీరు ప్రదర్శన నిర్వహించారు.
ఖర్గేకు 'ఆల్ ఇండియా వీరశైవ మహాసభ' లేఖ...
మరోవైపు, సీఎం పదవిని ఆశిస్తూ బలమైన లింగాయత్ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆల్ ఇండియా వీరశైవ మహాసభ సైతం పావులు కదుపుతోంది. కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో 34 మంది లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన వారున్నారని, రాబోయే లోక్‌సభ ఎన్నికలను సైతం దృష్టిలో ఉంచుకుని వీరశైవ లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన నేతకు సీఎం పదవి ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని మహాసభ కోరుతోంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు మహాసభ లేఖ రాసింది.
కాంగ్రెస్ 46 సీట్లు తమ అభ్యర్థులకు కేటాయించగా 34 మంది గెలిచిన విషయాన్ని ఆ లేఖలో మహాసభ గుర్తుచేసింది. తమ సంస్థ అధ్యక్షుడైన 91 ఏళ్ల షమనూరు శివశంకరప్ప ఈసారి దేవనగెరె సౌత్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారని తెలిపింది. మరో 50 నియోజకవర్గాల్లోని ఇతర చిన్న సామాజిక వర్గాల గెలుపులో కూడా తమ పాత్ర కీలకంగా ఉందని, బీజేపీకి సంప్రదాయబద్ధంగా మద్దతిస్తున్న లింగాయత్ సామాజిక వర్గం ఈసారి కాంగ్రెస్‌కు మద్దతుగా నిలవడంతో 134 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుపు సాకారమైందని పేర్కొంది. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఇదేవిధంగా తమ కమ్యూనిటీ మద్దతును నిలబెట్టుకోవాలని సూచించింది. ఈ వాస్తవాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని వీరశైవ లింగాయత్ నేతకు సీఎం పదవి ఇవ్వాలని కోరింది. గణనీయంగా ఉన్న తమ ఎమ్మెల్యేల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని తగిన సంఖ్యలో మంత్రి పదవులు ఇవ్వాలని కూడా ఆ సంస్థ విజ్ఞప్తి చేసింది.
ప్రస్తుతం సీఎం రేసులో ఉన్న డీకే శివకుమార్ వొక్కలిక సామాజిక వర్గానికి చెందిన నేత కాగా, సిద్ధరామయ్య కురుబ నేత. తాజాగా వీరశైవ లింగాయత్ సామాజిక వర్గం నుంచి ఖర్గేకు వినతులు వెళ్లగా, దళిత వర్గ నేత జి.పరమేశ్వర్‌కు సీఎం పదవి ఇవ్వాలంటూ ఆయన మద్దతుదారులు ప్రదర్శనకు దిగారు. ఏదిఏమైనా సీఎం అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం మీనమేషాలు లెక్కడుతుంటే మరికొంత మంది పేర్లు తెరపైకి వచ్చే అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
Updated Date - 2023-05-16T15:56:01+05:30 IST