Assembly elctions 2023: బీసీల వ్యతిరేకి కాంగ్రెస్: అమిత్‌షా
ABN, First Publish Date - 2023-11-21T18:44:31+05:30
వెనుకబడిన వర్గాలకు అశోక్ గెహ్లాట్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి వ్యతిరేకమని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. రాజస్థాన్‌లోని ఆల్వార్ జిల్లా ఖైర్తాల్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో అమిత్‌షా పాల్గొన్నారు.
జైపూర్: వెనుకబడిన వర్గాల (Backwar class)కు అశోక్ గెహ్లాట్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి వ్యతిరేకమని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆల్వార్ జిల్లా ఖైర్తాల్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో అమిత్‌షా మంగళవారంనాడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్, గెహ్లాట్ ప్రభుత్వం బీసీల వ్యతిరేకులని, ఏళ్ల తరబడిన మండల్ కమిషన్ నివేదికను కాంగ్రెస్ వ్యతిరేకించిందని, బీసీ కమిషన్‌కు రాజ్యాంగ గుర్తింపును ఇవ్వలేదని చెప్పారు. నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం బీసీ కమిషన్‌కు రాజ్యాంగ గుర్తింపునిచ్చిందని తెలిపారు.
కేంద్ర విద్యాసంస్థలన్నింటిలోనూ బీసీలకు 27 శాతం రిజర్వేషన్లను మోదీ ప్రభుత్వం ఇచ్చిందని అమిత్‌షా చెప్పారు. కేంద్ర మంత్రుల్లో 27 శాతం మంది బీసీలు ఉన్నారని, వెనుకబడిన తరగతుల సంక్షేమానికి కేంద్రం ఎంతో పాటుపడుతోందని అన్నారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలకు పరాకాష్టకు చేరుకున్నాయని విమర్శించారు. పట్టపగలే టైలర్ కన్హయ్య లాల్ హత్య జరిగిందని, హిందూ పండుగల సమయంలో 144 విధించడం, రామ్‌దర్బార్‌పై బుల్డోజర్లు నడపడం, ప్రతిచోట మతఘర్షణలు చేటుచేసుకుంటూనే ఉన్నాయన్నారు. మతఘర్షణలకు బీజేపీ ప్రభుత్వాలు ఎలాంటి ఆస్కారం ఇవ్వమని చెప్పారు. బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వానికి రాజస్థాన్ ప్రజలు ఓటువేయాలని, అల్లర్ల రహిత రాష్ట్రంగా రాజస్థాన్‌ను నిలిపే బాధ్యత బీజేపీ తీసుకుంటుందని అన్నారు. రాజస్థాన్‌లో పేపర్ లీక్ అంశాన్ని అమిత్‌షా ప్రస్తావిస్తూ, బీజేపీ అధికారంలోకి వస్తే అవినీతిపై కొరఢా ఝలిపిస్తుందని చెప్పారు. నవంబర్ 25న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుండగా, డిసెంబర్ 3న ఫలితాలు వెలువడతాయి.
Updated Date - 2023-11-21T18:44:39+05:30 IST