Amitsha Vs Stalin: స్టాలిన్ సవాలుకు అమిత్‌షా ప్రతిసవాల్..!
ABN, First Publish Date - 2023-06-11T18:37:50+05:30
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తమిళనాడులో కేంద్రం చేపట్టిన పథాకాలేమిటో చెప్పాలంటూ ఎంకే స్టాలిన్ చేసిన సవాలుకు అమిత్‌షా వెల్లూరులో జరిగిన ఓ బహిరంగ సభలో సమాధానమిచ్చారు. మోదీ చేసి పనులను ఏకరువు పెడుతూ, దమ్ముంటే రేపటి లోగా స్టాలిన్ సమాధానం ఇవ్వాలని ప్రతిసవాలు విసిరారు.
వెల్లూరు: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin), కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit shah) మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తమిళనాడులో కేంద్రం చేపట్టిన పథాకాలేమిటో చెప్పాలంటూ ఎంకే స్టాలిన్ చేసిన సవాలుకు అమిత్‌షా వెల్లూరులో జరిగిన ఓ బహిరంగ సభలో సమాధానమిచ్చారు. తొమ్మిదేళ్లలో తమిళనాడుకు మోదీ చేసిన పనులను ఆయన ఏకరువు పెడుతూ, దమ్ముంటే రేపటి లోగా స్టాలిన్ దీనికి సమాధానం ఇవ్వాలని అమిత్‌షా ప్రతిసవాలు విసిరారు.
''ముఖ్యమంత్రి స్టాలిన్ నాకు బహిరంగంగా సవాలు విసిరారు. తొమ్మిదేళ్లలో తమిళనాడుకు మోదీ ఏం చేశారో చెప్పమన్నారు. ఈ వివరాలు ఇప్పుడు చెబుతున్నాను వినండి. మీకు ధైర్యం ఉంటే రేపు సమాధానం ఇవ్వండి'' అని అమిత్‌షా సవాలు చేశారు. తమిళనాడులో కాంగ్రెస్-డీఎంకే ప్రభుత్వం పదేళ్లుగా ఉందని, రూ.12,000 కోట్ల అవినీతి, కుంభకోణాలకు ప్రభుత్వం పాల్పడిందని ఆరోపించారు. మోదీ ప్రభుత్వంపై ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదని, ప్రపంచదేశాల్లో భారతదేశ ప్రతిష్టను మోదీ ఇనుమడింపజేశారని, భారతదేశానికి భద్రతను పాదుకొలిపారని అమిత్‌షా వివరించారు. ఇటీవలే పార్లమెంటు నూతన భవనాన్ని ప్రారంభించారని, చోళుల నాటి రాజదండాన్ని సాంప్రదాయబద్ధంగా పార్లమెంటు భవనంలో మోదీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పారు.
స్టాలిన్ విసుర్లు..
దీనికి ముందు, స్టాలిన్ కేంద్రలోని బీజేపీ ప్రభుత్వానికి సవాలు విసిరారు. తమిళనాడులో కేంద ప్రభుత్వం అమలు చేసిన ప్రత్యేక పథకాల జాబితా విడుదల చేయాలని అమిత్‌షాకు సవాలు విసిరారు. 2004-14 మధ్య యూపీఏ హయాంలో తమిళనాడులో అమలు చేసిన పలు పథకాలను స్టాలిన్ శనివారంనాడు జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో వివరించారు. కాంగ్రెస్ సారథ్యంలోని కూటమి ప్రభుత్వం తమిళనాడు కోసం అనేక ప్రత్యేక పథకాలు తీసుకువచ్చిందని అన్నారు. చెన్నై మెట్రో రైల్ తొలి దశ అమలు చేశారని అన్నారు. కాగా, 2024 ఎన్నికల్లో బీజేపీని పటిష్టం చేసే వ్యూహంలో భాగంగా అమిత్‌షా తమిళనాడులో ఆదివారం పర్యటించారు. కనీసం 20 స్థానాలను బీజేపీ గెలుచుకునేందుకు కార్యకర్తలు పట్టుదలగా పనిచేయాలని వెల్లూరు సభలో పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Updated Date - 2023-06-11T18:37:50+05:30 IST