Jammu: 2024 లోక్‌సభ ఎన్నికలే టార్గెట్.. ప్రచారానికి దిగుతున్న అమిత్‌షా, రాజ్‌నాథ్
ABN, First Publish Date - 2023-06-16T21:24:42+05:30
2024 లోక్‌సభ ఎన్నికల ప్రచారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు, మంత్రులు జమ్మూకశ్మీర్‌లో ప్రచారానికి సిద్ధమవుతున్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలనలో సాధించిన విజయాలను హైలైట్ చేస్తూ జమ్మూకశ్మీర్‌లో ఈ నెల చివరి వారంలో ప్రచారానికి నేతలంతా సమాయత్తమవుతున్నారు.
న్యూఢిల్లీ: 2024 లోక్‌సభ ఎన్నికల (2024 Lok Sabha Elections) ప్రచారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ (BJP) అగ్రనేతలు, మంత్రులు జమ్మూకశ్మీర్‌లో (Jammu & kashmir) ప్రచారానికి సిద్ధమవుతున్నారు. నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలనలో సాధించిన విజయాలను హైలైట్ చేస్తూ జమ్మూకశ్మీర్‌లో ఈ నెల చివరి వారంలో ప్రచారానికి నేతలంతా సమాయత్తమవుతున్నారు. ఈనెల 23న భాగ్‌వతినగర్‌లో జరిగే మెగా ర్యాలీలో అమిత్‌షా (Amit Shah) పాల్గొంటారు. జూన్ 26న జరిగే ''సెక్యూరిటీ కాంక్లేవ్''లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) పాల్గొని ప్రసంగిస్తారు. జమ్మూలో ఈనెల 27న జరిగే మరో ర్యాలీలో బీజేవైఎం అధ్యక్షుడు తేజస్వి సూర్య (Tejaswi Surya) పాల్గొంటారు. సెక్యూరిటీ కాంక్లేవ్ సభాస్థలి (Venue) ఇంకా ఖరారు కాలేదు. ఆహ్వానితుల జాబితాను బీజేపీ జమ్మూకశ్మీర్ యూనిట్ సిద్ధం చేస్తోంది.
కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్రనేత పర్యటనపై రాష్ట్ర జమ్మూకశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా మాట్లాడుతూ, ఇప్పటికైతే పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ర్యాలీలు ఉంటాయని, 23న జమ్మూ పార్లమెంటరీ నియోజకవర్గంలో జరిగే మెగా ర్యాలీలో అమిత్‌షా పాల్గొంటారని చెప్పారు. రాజ్‌నాథ్ సింగ్ పాల్గొనే సెక్యూరిటీ కాంక్లేవ్ పూర్తిగా రాజకీయేతరమైన కార్యక్రమమని, భారతీయ సైనిక పాఠం, జాతీయ భద్రతా అంశాలకు సంబంధించిన ఆందోళనలు, సరిహద్దు భద్రతకు సంబంధించిన తీసుకుంటున్న చర్యల గురించి మంత్రి మాట్లాడతారని చెప్పారు.
370 అధికరణ తర్వాత తొలి లోక్‌సభ ఎన్నికలు
జమ్మూకశ్మీర్‌లో 370వ అధికరణ రద్దు తర్వాత జరుగనున్న తొలి లోక్‌సభ ఎన్నికలు ఇవే కావడంతో బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్టు చెబుతున్నారు. కేంద్ర పాలిత ప్రాంతంలోని ఐదు పార్లమెంటరీ స్థానాల్లోనూ బీజేపీ పోటీ చేయనుంది.
Updated Date - 2023-06-16T21:24:42+05:30 IST