Delhi liquor policy: ఓ బలమైన వ్యక్తిని విచారణకు పిలిచినప్పుడు పిళ్లై స్టేట్మెంట్ మార్చుకున్నారు...
ABN, First Publish Date - 2023-03-13T17:36:49+05:30
మార్చి 15న కవిత ఆడిటర్ బుచ్చిబాబుతో కలిపి పిళ్ళైను విచారించనున్నారు. ఈ నేపథ్యంలో పిళ్లై కస్డడీ పొడిగింపునకు ప్రాధాన్యత ఏర్పడింది. కవిత విచారణ రోజు వరకూ పిళ్లై కస్టడీ పొడిగించడంతో ఆమెతో కలిపి విచారణ జరిపే అవకాశం ఉంది.
న్యూఢిల్లీ: దేశాన్ని కుదిపేస్తోన్న ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు(Delhi liquor policy)లో అరెస్టయిన అరుణ్ రామచంద్ర పిళ్లై(Arun Ramachandra Pillai) వారం రోజుల ఈడీ(Enforcement Directorate) కస్టడీ మరో మూడు రోజులు పొడిగించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీ నేటితో ముగియడంతో అధికారులు పిళ్లైని మరోసారి రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. దీంతో న్యాయస్థానం పిళ్లై కస్టడీని మరో మూడు రోజలు పొడిగించింది. ఇదే కేసుకు సంబంధించి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత(BRS MLC K Kavitha)ను శనివారం విచారించిన ఈడీ అధికారులు 16వ తేదీన మళ్లీ విచారణకు రావాలని ఆమెను ఆదేశించారు. అంతకు ముందు రోజే అంటే మార్చి 15న కవిత ఆడిటర్ బుచ్చిబాబు(Kavithas auditor Butchibabu Gorantla)తో కలిపి పిళ్ళైను విచారించనున్నారు. ఈ నేపథ్యంలో పిళ్లై కస్డడీ పొడిగింపునకు ప్రాధాన్యత ఏర్పడింది. కవిత విచారణ రోజు వరకూ పిళ్లై కస్టడీ పొడిగించడంతో ఆమెతో కలిపి విచారణ జరిపే అవకాశం ఉంది.
మరోవైపు ఈడీ తన వద్ద తీసుకున్న వాంగ్మూలాన్ని ఉపసంహరించుకునేందుకు అవకాశం ఇవ్వాలని పిళ్లై సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో దీనిపై నేడు విచారణ జరిగింది. ఇప్పటికే ఈడీ 29 సార్లు పిళ్ళైని విచారణకు పిలిచి 11 సార్లు స్టేట్ మేంట్ రికార్డు చేసిందని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పిళ్ళై ఇప్పటికే ఈ కేసు విచారణకు సహకరించారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇతర నిందితులతో కలిపి ప్రశ్నిస్తే... విచారణలో న్యాయవాది కూడా ఉండాలని పిళ్ళై తరపు న్యాయవాది కోర్టును కోరారు. గత వారం కస్టడీతో కలిపి 36 సార్లు పిళ్ళై కేసు విచారణకు హాజరయ్యరని చెప్పారు. హోటల్ రికార్డులు చూపించి లిక్కర్ కేసు పిళ్ళైకి ఆపాదించాలని చూస్తున్నారని పిళ్ళై తరపు న్యాయవాది వాదించారు.
అయితే కీలక సమయంలో వాంగ్మూలాల ఉపసంహరణ కోసం అప్లికేషన్ దాఖలు చేశారని ఈడీ తరపు న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు. పిళ్ళై విచారణకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీ, ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. విచారణ సమయంలో పిళ్ళై తోపాటు ఆయన న్యాయవాదికి అనుమతి ఇవ్వాలన్న వాదనను వ్యతిరేకించిన ఈడీ వ్యతిరేకించింది. ఇప్పుడు స్టేట్‌మెంట్ వెనక్కి తీసుకుంటామంటున్నారు... కానీ బలవంతం చేసి పిళ్ళై స్టేట్ మెంట్ రికార్డు చేయలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. పిళ్ళై వాంగ్మూలం రికార్డ్ చేసేందుకు అన్ని నిబంధనలు పాటించామని, భయపెట్టి, బలవంతం చేసి పిళ్ళై వాంగ్మూలం తీసుకోలేదని స్పష్టం చేసింది. మొదటి సారి గతేడాది సెప్టెంబర్ 18న పిళ్ళై స్టేట్ మెంట్ రికార్డు చేశామని, ముడుపుల వ్యవహారంలో పిళ్ళై కీలకపాత్ర పోషించారని, ముడుపుల్లో ప్రధాన పాత్రదారి పిళ్ళై అని ఈడీ న్యాయస్థానానికి స్పష్టం చేసింది. పిళ్ళై, బుచ్చిబాబు(Kavithas auditor Butchibabu Gorantla) కలిసి లిక్కర్ పాలసీ రూపకల్పనలో భాగస్వాములుగా ఉన్నారని, బుచ్చిబాబు ఇచ్చిన సమాచారం ఆధారంగా పిళ్ళైని, బుచ్చిబాబును ప్రశ్నించాల్సి ఉందని ఈడీ తెలిపింది. న్యాయవాదుల సమక్షంలో పీఎంఎల్ఏ సెక్షన్ 50 ప్రకారం నిందితుల విచారణ జరగదన్న ఈడీ స్పష్టం చేసింది. గత ఏడాది సెప్టెంబర్ 18న పూర్తి స్టేట్మెంట్ నమోదు చేశామని, రెండోసారి, మూడో దఫా ఇచ్చిన వాగ్మూలంలో కూడా వివరాలను ఖరారు చేశారని ఈడీ తెలిపింది. పిళ్లైని టార్చర్ చేస్తే మిగిలిన స్టేట్మెంట్‌లలో అవే విషయాలను ఎలా కన్ఫర్మ్ చేస్తారని ఈడీ ప్రశ్నించింది. మార్చి తర్వాతే స్టేట్ మెంట్ మార్చుకున్నారని, ఎందుకు మార్చుకున్నారో తెలుసని ఈడీ కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. బలమైన వ్యక్తిని విచారణకు పిలిచినప్పుడు పిళ్లై తన స్టేట్మెంట్ మార్చుకున్నారని ఈడీ కోర్టుకు తెలిపింది.
మరోవైపు ఢిల్లీ మద్యం కుంభకోణం(Delhi Liquor Scam Case) హైదరాబాద్‌లోనే జరిగిందని ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) కీలక నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి ( former Delhi Deputy Chief Minister) మనీశ్ సిసోడియా(Manish Sisodia) కస్టడీ రిపోర్ట్‌లో ఈడీ ఇప్పటికే వెల్లడించింది. ఐటీసీ కోహినూర్ హోటల్‌లోనే స్కామ్‌కు కుట్ర జరిగిందని తెలిపింది. సౌత్‌గ్రూప్ దినేష్ అరోరాను హైదరాబాద్‌కు పిలిచిందని, విజయ్‌నాయర్, అర్జున్ పాండే, అభిషేక్ బోయినపల్లి, కవిత ఆడిటర్ బుచ్చిబాబు(Kavithas auditor Butchibabu Gorantla), అరుణ్ పిళ్లై కలిసే కుట్ర చేశారని ఈడీ స్పష్టం చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత పేరును మరోసారి ప్రస్తావించింది. కేజ్రీవాల్‌తో కవితకు స్పష్టమైన రాజకీయ సంబంధాలున్నాయని, కవితకు ఆమ్ ఆద్మీ పార్టీకి ముడుపులపై స్పష్టమైన అవగాహన కుదిరిందని ఈడీ వెల్లడించింది. తమకు అనుకూలంగా లిక్కర్ పాలసీ ఉంటే ముడుపులు ఇస్తామని కవిత ఆప్ నేతలకు చెప్పారని ఈడీ తెలిపింది. 2021మార్చిలో విజయ్‌నాయర్‌ను కవిత కలిశారని బుచ్చిబాబు చెప్పారని కస్టడీ రిపోర్ట్‌లో ఈడీ వెల్లడించింది. మాగుంట రాఘవకు 32.5శాతం, కవితకు 32.5శాతం... సమీర్ మహేంద్రుకు 35శాతం ఇండోస్పిరిట్స్‌లో వాటా కుదిరిందని, సౌత్ గ్రూప్ ద్వారా వందకోట్లు ఆప్‌కు చెల్లించారని ఈడీ తెలిపింది.
Updated Date - 2023-03-13T17:36:53+05:30 IST