Heart Condition : వ్యక్తిని ప్రాణాపాయం నుంచి కాపాడిన గడియారం!
ABN, First Publish Date - 2023-03-11T19:10:37+05:30
బ్రిటన్ (Britain)లోని బెడ్‌ఫోర్డ్‌షైర్, ఫ్లిట్‌విక్‌లో నివసిస్తున్న ఆడమ్ క్రోఫ్ట్ (Adam Croft) ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
న్యూఢిల్లీ : బ్రిటన్ (Britain)లోని బెడ్‌ఫోర్డ్‌షైర్, ఫ్లిట్‌విక్‌లో నివసిస్తున్న ఆడమ్ క్రోఫ్ట్ (Adam Croft) ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ముప్ఫయ్యారేళ్ళ వయసులో ఆయన హృదయ సంబంధిత అస్వస్థతకు గురయ్యారు. ఆ విషయాన్ని ఆయన గమనించకుండా తన పని తాను చేసుకుంటున్నారు. కానీ ఆయన ధరించిన ఆపిల్ గడియారం (Apple Watch) ఆయనను క్రమం తప్పకుండా హెచ్చరించి, చివరికి ఆసుపత్రికి వెళ్లి, చికిత్స చేయించుకునేలా ప్రేరేపించింది. దీంతో ఆయన తన గడియారానికి ధన్యవాదాలు చెప్తున్నారు.
బ్రిటిష్ మీడియాతో ఆడం క్రోఫ్ట్ మాట్లాడుతూ, తన ఆపిల్ గడియారంలోని ఈ ఫీచర్‌ను ఉపయోగించుకుంటానని తాను ఎన్నడూ అనుకోలేదన్నారు. ఓ రోజు సాయంత్రం తాను సోఫాపై నుంచి లేచానని, అప్పుడు తల దిమ్ముగా ఉన్నట్లు అనిపించిందని చెప్పారు. కొంచెం మంచినీళ్లు తాగుదామనుకొని వంట గదిలోకి వెళ్లానని, అప్పుడు ప్రపంచమంతా తలక్రిందులైనట్లు అనిపించిందని చెప్పారు. అప్పుడు అతి కష్టం మీద తాను నేలపై కూర్చున్నానని, అప్పుడు తన ఒళ్లంతా చల్లని చెమటతో నిండిపోయిందని తెలిపారు. తన గడియారం తనను ప్రతి రెండు గంటలకు ఒకసారి హెచ్చరించిన విషయాన్ని తాను ఆ మర్నాడు ఉదయం లేచినపుడు గమనించానని తెలిపారు. తన గుండె కొట్టుకోవడంలో అట్రియల్ ఫిబ్రిలేషన్ (గుండె క్రమరహితంగా కొట్టుకోవడం, తరచూ చాలా వేగంగా కొట్టుకోవడం) కనిపిస్తోందని, వెంటనే వైద్యులను సంప్రదించాలని తనను హెచ్చరించిందని చెప్పారు.
ఆ తర్వాత తాను బ్రిటిష్ మెడికల్ హెల్ప్‌లైన్ 111కు ఫోన్ చేశానని తెలిపారు. ఓ గంటలో ఆసుపత్రికి వెళ్లాలని తనకు సలహా ఇచ్చారని తెలిపారు. ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించి, అట్రియల్ ఫిబ్రిలేషన్ ఉందని నిర్థరించి, చికిత్స చేశారని, ఆపిల్ గడియారం హెచ్చరించి ఉండకపోతే తాను ఆసుపత్రికి వెళ్లి ఉండేవాడిని కాదని, ఈ గడియారం తనను ప్రాణాపాయం నుంచి కాపాడిందని తెలిపారు.
ఇవి కూడా చదవండి :
Worms Raining : చైనాలో మరో వైపరీత్యం... జనం ఎలా తప్పించుకుంటున్నారంటే...
Supreme Court : సేమ్ సెక్స్ మ్యారేజ్ చెల్లుబాటు... సుప్రీంకోర్టు విచారణ సోమవారం...
Updated Date - 2023-03-11T19:10:37+05:30 IST