Poonch terror attack: రెండు ఉగ్రవాద సంస్థలకు చెందిన ఏడుగురు ఉగ్రవాదుల పనే!
ABN, First Publish Date - 2023-04-21T19:48:39+05:30
పీపుల్స్ యాంటీ-ఫాసిస్ట్ ఫ్రంట్ దాడిలో అమరులైన ఐదుగురు జవాన్లకు ఆర్మీ ఘనంగా నివాళులర్పించింది.
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని (Jammu and Kashmir) పూంచ్ ప్రాంతంలో (Poonch) రాష్ట్రీయ రైఫిల్స్ (Rashtriya Rifles) యూనిట్ జవాన్లు ప్రయాణిస్తున్న ట్రక్కుపై లష్కరే తాయిబా అనుబంధ సంస్థ పీపుల్స్ యాంటీ-ఫాసిస్ట్ ఫ్రంట్ (People's Anti-Fascist Front ) దాడిలో అమరులైన ఐదుగురు జవాన్లకు ఆర్మీ ఘనంగా నివాళులర్పించింది. హవల్దార్ మందీప్ సింగ్, లాన్స్ నాయక్, లాన్స్ నాయక్ కుల్వంత్ సింగ్, సిపాయి హరికిషన్ సింగ్, సిపాయి సేవత్ సింగ్ భౌతికకాయాల వద్ద సైన్యాధికారులు పుష్పగుచ్ఛాలుంచి శ్రద్ధాంజలి ఘటించారు. ప్రాణత్యాగాలు చేసిన జవాన్లను జాతి ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని సైన్యాధికారులు తెలిపారు. అమరులైన ఐదుగురు జవాన్లలో నలుగురు పంజాబ్‌కు చెందినవారు కాగా, దేవాశిష్ బస్వాల్ (Lance Naik Debashish) ఒడిశాకు (Odisha) చెందినవారు. మృతుల కుటుంబాలకు సైన్యం ఇచ్చే పరిహారానికి అదనంగా కోటి రూపాయల పరిహారం అందిస్తున్నట్లు పంజాబ్ ప్రభుత్వం తెలిపింది.
మరోవైపు ఘటనా స్థలానికి ఎన్‌ఐఏ (National Investigation Agency) టీమ్ చేరుకుంది. ఆధారాలు సేకరిస్తోంది. జైష్ ఎ మహ్మద్ Jaish-e-Mohammed (JeM), లష్కర్ ఎ తొయిబా Lashkar-e-Taiba (LeT) ఉగ్రవాద సంస్థలకు చెందిన ఏడుగురు ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్లు సైన్యాధికారులు గుర్తించారని తెలిసింది.
రాజౌరీ (Rajouri) సెక్టార్‌లోని భీంబేర్‌గలీ నుంచి పూంచ్ వెళ్తున్న ఆర్‌ఆర్‌యూ జవాన్ల ట్రక్కుపై పీఏఎఫ్ఎఫ్ (PAFF) ఉగ్రవాదులు నిన్న మెరుపుదాడి చేశారు. భారీ వర్షాలు కురుస్తుండడం.. రహదారి స్పష్టంగా కనిపించకపోవడంతో జవాన్లు అక్కడే నక్కి ఉన్న ఉగ్రమూకలను గుర్తించలేదని తెలుస్తున్నట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. తొలుత కాల్పులు జరిపిన ఉగ్రవాదులు ఆ తర్వాత గ్రనేడ్ లాంచర్‌తో దాడి చేసి ఉంటారని అభిప్రాయపడ్డారు. జవాన్ల శరీరాల్లోకి దూసుకుపోయిన స్టీల్ తూటాలు చైనాలో తయారైనవిగా గుర్తించినట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. ఈ దాడిలో ట్రక్కు పూర్తిగా దహనమైంది. అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు జవాన్లు సజీవ దహనమయ్యారు. మరో సైనికుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆయన్ను రాజౌరీ ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. ట్రక్కులో కిరోసిన్ ఉండడంతో మంటల తీవ్రత పెరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటన జరగ్గానే కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించామని ఆర్మీ అధికారులు తెలిపారు. డ్రోన్లతో అడవులను జల్లెడ పడుతున్నట్లు వెల్లడించారు. ఈ దాడిలో మొత్తం ఏడుగురు ఉగ్రవాదులు పాల్గొని ఉంటారని అనుమానిస్తున్నారు. ఘటనపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. అమర జవాన్ల కుటుంబాలకు సంతాపం తెలిపారు.
మరోవైపు జవాన్లపై దాడికి తమదే బాధ్యత అని పీఏఎఫ్ఎఫ్ ప్రకటించింది. సరిగ్గా.. 2021లో ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశంలోనే పీఏఎఫ్ఎఫ్ (PAFF) ఈ ఘాతుకానికి ఒడిగట్టింది. 2019లో అల్ ఖైదా ప్రేరణతో పురుడుపోసుకున్న ఈ ఉగ్రసంస్థ.. జైషే మహమ్మద్‌కు అనుబంధంగా పనిచేస్తోంది. యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షిస్తూ రిక్రూట్‌మెంట్లకు పాల్పడుతోంది. జమ్మూకశ్మీర్‌లో జరిగిన పలు ఉగ్రదాడుల్లో పీఏఎ్‌ఫఎఫ్ పాత్ర ఉండడం, దేశంలోని పలు ప్రాంతాల్లో విధ్వంసాలకు కుట్రలు పన్నడంతో కేంద్ర హోంశాఖ ఈ ఏడాది జనవరిలో ఈ సంస్థపై నిషేధం విధించింది. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో భారత్ పర్యటన ఖరారైన కొన్ని గంటల్లోనే జమ్మూకశ్మీర్‌లో పాక్ ప్రేరేపిత ఉగ్రమూకలు దారుణానికి పాల్పడ్డాయి. వచ్చేనెల శ్రీనగర్‌లో జరగనున్న జీ-20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాన్ని వ్యతిరేకిస్తూ ఈ ఘాతుకానికి పాల్పడ్డాయి.
రాజౌరీ సెక్టార్‌లోని అడవుల్లో ఉగ్రవాదులు నక్కి ఉన్నారని ఇంటెలిజెన్స్ బ్యూరో ఇటీవలే హెచ్చరికలు జారీ చేసింది. జీ-20 సమావేశాన్ని వ్యతిరేకిస్తున్న జైషే మహమ్మద్, దాని అనుబంధ సంస్థలు గ్రనేడ్ దాడులకు పాల్పడే ప్రమాదముందని తెలిపింది. శ్రీనగర్, దక్షిణ కశ్మీర్, రాజౌరీ, పూంచ్ సెక్టార్లలో అప్రమత్తంగాఉండాలని, భద్రతను కట్టుదిట్టం చేయాలని కేంద్ర హోంశాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. రెండు రోజుల క్రితం కూడా ఉగ్రవాదుల జాడపై ఆర్మీకి ఉప్పందినట్లు సమాచారం. దీంతో.. ముష్కరులు దాగి ఉన్న అటవీ ప్రాంతాన్ని వ్యూహాత్మకంగా చుట్టుముట్టి, దాడి చేయాలని ఆర్మీ నిర్ణయించింది. ఈ క్రమంలో యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ కోసం రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్స్‌ను ఆయా ప్రాంతాలకు తరలించింది. ఇంతలోనే ఉగ్రవాదులు దాడి చేసి భారత జవాన్లను పొట్టనపెట్టుకున్నారు.
Updated Date - 2023-04-21T19:58:51+05:30 IST