AAP: ఆప్ వార్షికోత్సవ వేళ.. జైల్లో నేతలను గుర్తు చేసుకున్న కేజ్రీవాల్
ABN, First Publish Date - 2023-11-26T15:17:28+05:30
ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) వార్షికోత్సవం సందర్భంగా వివిధ కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న నేతలను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) గుర్తు చేసుకున్నారు. ఇవాళ ఆ పార్టీ 11వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పార్టీ కార్యాలయంలో జెండా ఎగురవేశారు.
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) వార్షికోత్సవం సందర్భంగా వివిధ కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న నేతలను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) గుర్తు చేసుకున్నారు. ఇవాళ ఆ పార్టీ 11వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పార్టీ కార్యాలయంలో జెండా ఎగురవేశారు. నాయకులు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు.
జైల్లో ఉన్న మనీష్ సిసోదియా(Manish Sisodia), సంజయ్ సింగ్ లను గుర్తు చేసుకున్నారు. అనంతరం కేజ్రీ మాట్లాడుతూ.. "11 ఏళ్లలో ఎన్నో లక్ష్యాలు చేరుకున్నాం. ప్రస్తుతం ఈడీ, సీబీఐ, పోలీసులు మా నేతలను టార్గెట్ చేసుకుని దాడులు చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ నేతలపై 250కి పైగా కేసులు పెట్టారు. కానీ దర్యాప్తులో ఒక్క అవినీతి చేసినట్లు రుజువు కాలేదు. బీజేపీ(BJP) నీచ రాజకీయాలకు ఇది పరాకాష్ట. ఇది సంతోషకరమైన రోజైనప్పటికీ సిసోదియా, సంజయ్, సత్యేందర్ జైన్లు నాతో లేనందుకు బాధగా ఉంది.
వారు లేకుండా చేస్తున్న తొలి వార్షికోత్సవం ఇది. వారి కుటుంబాలకు పార్టీ అండగా నిలుస్తుంది. బీజేపీ ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెట్టి విచ్చిన్నం చేయాలని చూస్తోంది. కానీ వారి బెదిరింపులకు తలవంచని నేతలను చూసి గర్వపడుతున్నా. 2012లో ఇదే రోజు ఓ సామాన్యుడు లేచి నిలబడి ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టాడు. అప్పటి నుంచి గడిచిన 11 ఏళ్లలో ఎన్నో ఒడిదొడుకులు, కష్టాలు ఎదురైనా మనందరి స్ఫూర్తి ఏమాత్రం తగ్గలేదు. ప్రజలు వారి ప్రేమ, ఆశీర్వాదంతో ఒక చిన్న ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీగా మార్చారు. మనమంతా దృఢ సంకల్పంతో ముందుకు సాగుదాం" అని అన్నారు.
ఆప్ ప్రస్తుతం ఢిల్లీ, పంజాబ్ లో అధికారంలో ఉంది. అనేక రాష్ట్రాల్లో విస్తరించడానికి ప్రణాళికలు రచిస్తోంది.
Updated Date - 2023-11-26T15:41:27+05:30 IST