Asaduddin Owaisi: గూగ్లీ వేసి అమిత్ షాని ఇరకాటంలో పడేసిన అసదుద్దీన్ ఒవైసీ.. లాజిక్‌తో కొట్టారుగా!
ABN, First Publish Date - 2023-10-28T18:30:42+05:30
ఎన్నికలు వస్తున్నాయంటే చాలు.. అధికారం పొందడం కోసం రాజకీయ నాయకులు చేసే హామీలు అన్నీ ఇన్నీ కావు. అధికారం కట్టబెట్టినప్పుడు హామీలను పూర్తిగా నెరవేర్చని ఈ నేతలు.. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం...
ఎన్నికలు వస్తున్నాయంటే చాలు.. అధికారం పొందడం కోసం రాజకీయ నాయకులు చేసే హామీలు అన్నీ ఇన్నీ కావు. అధికారం కట్టబెట్టినప్పుడు హామీలను పూర్తిగా నెరవేర్చని ఈ నేతలు.. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం సరికొత్త హామీలతో ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తారు. ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికలు త్వరలోనే జరగబోతున్న తరుణంలో.. ప్రధాన రాజకీయ పార్టీలు రకరకాల హామీలు ఇస్తున్నాయి. ఒకరికి మించి మరొకరు పెద్ద పెద్ద ప్రతిజ్ఞలే చేస్తున్నారు. లేటెస్ట్‌గా బీజేపీ.. తమకు తెలంగాణలో గెలిపిస్తే, బీసీ నాయకుడ్ని ముఖ్యమంత్రి చేస్తామనీ పేర్కొంది. ఇందుకు ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ గట్టి కౌంటర్ ఇచ్చారు.
ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా.. తెలంగాణలోని సూర్యాపేటలో కేంద్ర హోమంత్రి అమిత్ షా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో నవంబర్ 30 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ అధికారంలోకి వస్తే, వెనుకబడిన తరగతి (బీసీ) నాయకుడిని ముఖ్యమంత్రిగా చేస్తామని ప్రకటించారు. అమిత్ షా నోటి నుంచి ఈ ప్రకటన వచ్చిన ఒక రోజు తర్వాత ఒవైసీ మాట్లాడుతూ.. లాజికల్ ప్రశ్నతో ఆ కేంద్ర హోంమంత్రిని ఇరకాటంలో పడేశారు. ‘‘మీకు నిజంగానే వెనుకబడిన తరగతుల పట్ల అంత సానుభూతి ఉంటే.. బీసీ జనాభా గణన ఎందుకు నిర్వహించడం లేదు’’ అని ఒవైసీ నిలదీశారు. పార్లమెంట్‌లో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ, ముస్లిం మహిళలకు సబ్-కోటా కల్పించాలన్న తన డిమాండ్‌కు ప్రధాని మోదీ గానీ, కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ గానీ మద్దతు ఇవ్వలేదని ఒవైసీ పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి జహీరాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు.
అంతేకాదు.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ రెండూ కవలలేనని ఒవైసీ ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు విజయం సాధించలేవని జోస్యం చెప్పారు. తెలంగాణలో ఆ రెండు పార్టీలకు అనుకూలంగా ఏమీ జరగదని, ఇక్కడ ప్రజలు ఆ పార్టీలను వెనక్కు పంపిస్తాయని పేర్కొన్నారు. ఎంఐఎం, బీజేపీ మధ్య రహస్య పొత్తు ఉందని రాహుల్ చేసిన వ్యాఖ్యల్ని ఖండించిన ఆయన.. అమేథీ నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో రాహుల్ ఎలా ఓడిపోయారని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో తాము పోటీ చేయని స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తామని తెలిపారు. ‘కాంగ్రెస్ ఈజ్ మదర్ ఆఫ్ ఆర్‌ఎస్‌ఎస్’ అనే పుస్తకంపై కూడా ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రాంతీయ పార్టీలు ఎక్కడ అధికారంలో ఉన్నా ప్రజలకు ప్రాధాన్యత ఇస్తారని ఉద్ఘాటించారు. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ప్రజల సమస్యల్ని పరిష్కరించేవారే ఉండరని ఒవైసీ చెప్పుకొచ్చారు.
Updated Date - 2023-10-28T18:30:42+05:30 IST