Asaduddin Owaisi: అక్కడ కూల్చడానికి ఇప్పుడు ఒక్క ముస్లిం ఇల్లు కూడా మిగల్లేదు.. నూహ్ వివాదంపై ఒవైసీ ధ్వజం
ABN, First Publish Date - 2023-08-28T17:01:10+05:30
గత నెలలో హర్యానాలోని నూహ్ ప్రాంతంలో చేపట్టిన ఒక ర్యాలీ.. ఎలాంటి వివాదాలకు తెరలేపిందో అందరికీ తెలిసిందే. విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ఆ ర్యాలీని చేపట్టగా.. ఒక వర్గం వారు దాన్ని...
గత నెలలో హర్యానాలోని నూహ్ ప్రాంతంలో చేపట్టిన ఒక ర్యాలీ.. ఎలాంటి వివాదాలకు తెరలేపిందో అందరికీ తెలిసిందే. విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ఆ ర్యాలీని చేపట్టగా.. ఒక వర్గం వారు దాన్ని అడ్డుకున్నారు. దీంతో.. అక్కడ మత ఘర్షణలు, అల్లర్లు చెలరేగాయి. వీటిని ఆపేందుకు అక్కడ భారీఎత్తున పోలీసుల్ని మోహరించడం, ఇతర ఆంక్షలు విధించడం జరిగింది. ఇంకా అక్కడి పరిస్థితులు చల్లారలేదు. ఇలాంటి తరుణంలో వీహెచ్‌పీ మరోసారి సంచలన ప్రకటన చేసింది. సోమవారం శోభాయాత్ర నిర్వహిస్తామని ప్రకటించింది. దీంతో.. నూహ్‌తో పాటు హర్యానా మొత్తం హై అలర్ట్ అయ్యింది. మళ్లీ అల్లర్లు చెలరేగుతాయన్న ఉద్దేశంతో.. ఈ యాత్రని నిలిపివేయడం కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.
ఈ నేపథ్యంలోనే.. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ట్విటర్ (X ప్లాట్‌ఫార్మ్) మాధ్యమంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘హర్యానాలోని బీజేపీ ప్రభుత్వ ఆదేశాలకు వ్యతిరేకంగా శోభాయాత్ర చేపడతామని వీహెచ్‌పీ బెదిరింపులకు పాల్పడుతోంది. ఈ యాత్ర ముసుగులో ముస్లింలను లక్ష్యంగా చేసుకుంటారని.. నూహ్ హింసకు ముందే బీజేపీ ప్రభుత్వానికి తెలుసు. ఒకవేళ ముస్లింలపై ఏకపక్షంగా చట్టపరమైన చర్యలు తీసుకోకుండా, అసలు దోషిని నెత్తినెక్కించుకోకుండా ఉండి ఉంటే.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా యాత్ర నిర్వహించాలన్న ధైర్యం ఈ సైన్యానికి వచ్చేది కాదు. చూస్తుంటే.. ఈ క్రిమినల్స్ ముందు బీజేపీ నిస్సహాయంగా కనిపిస్తోంది. నుహ్‌లో మళ్లీ హింసాత్మక ఘటనలు జరిగితే.. దానికి బీజేపీ ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. దానికి హర్యానాలోని బీజేపీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అయినా.. ఇప్పుడు అక్కడ కూల్చడానికి ముస్లిం ఇళ్లు లేవు’’ అంటూ ఒవైసీ తన ట్వీట్‌లో మండిపడ్డారు.
ఇదిలావుండగా.. సోమవారం వీహెచ్‌పీ మరోసారి శోభాయాత్ర చేపడతామని పిలుపునిచ్చిన నేపథ్యంలో నూహ్‌లో మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. అలాగే బల్క్ ఎస్ఎంఎస్ సేవల్ని సైతం నిషేధించారు. భారీ భద్రతా ఏర్పాట్లతో పాటు డ్రోన్స్‌ని మోహరించారు. జిల్లాలోని అన్ని ఎంట్రీ పాయింట్ల వద్ద భద్రతా సిబ్బందిని మోహరించి.. బయటి వ్యక్తులు నుహ్‌లోకి ప్రవేశించకుండా నిషేధించారు. వివిధ పాయింట్ల వద్ద పోలీసులు బారికేడ్‌లను ఏర్పాటు చేశారు. కాగా.. జులై 31వ తేదీన నూహ్‌లో జరిగిన మతఘర్షణల్లో ఇద్దరు హోంగార్డులతో పాటు ఒక మత గురువు, ఆరుగువు వ్యక్తులు మృతి చెందిన విషయం విదితమే!
Updated Date - 2023-08-28T17:01:10+05:30 IST