Assembly: అసెంబ్లీలో మాజీసీఎం సీటు మార్చాల్సిందే... ప్రతిపక్ష సభ్యుల గెంటివేత
ABN, First Publish Date - 2023-10-12T07:56:59+05:30
మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం (Former Chief Minister O. Panneerselvam), ఆయన వర్గానికి చెందిన శాసనసభ్యుల
- స్పీకర్ పోడియం ముట్టడి
చెన్నై, (ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం (Former Chief Minister O. Panneerselvam), ఆయన వర్గానికి చెందిన శాసనసభ్యుల సీట్ల వ్యవహారం అసెంబ్లీలో వేడి పుట్టించింది. తమ పార్టీ కాని నేతను తమతో పాటు సీటు కేటాయించడమేంటని అన్నాడీఎంకే సభ్యులు స్పీకర్‌తో వాగ్వాదానికి దిగడంతో అసెంబ్లీలో గందరగోళ పరిస్థితి తలెత్తింది. అన్నాడీఎంకే సభాపక్ష నాయకుడు, మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి(Former CM Edappadi Palaniswami)కి స్పీకర్ అప్పావుకు మధ్య తీవ్ర వాగ్యుద్ధం చోటుచేసుకుంది. ఓపీఎస్ సీటు మార్పు కుదరదంటూ అప్పావు తేల్చి చెప్పడంతో అన్నాడీఎంకే సభ్యులంతా నిరసన నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియంను ముట్టడించారు. స్పీకర్ అప్పావు చుట్టూ నిలిచి ధర్నా చేపట్టారు. కొంతమంది అన్నాడీఎంకే సభ్యులు నేలపై కూర్చుని స్పీకర్‌కు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ అప్పావు... అన్నాడీఎంకే సభ్యులందరిని సభ నుంచి గెంటివేయాలని మార్షల్స్‌ను ఆదేశించారు. దాంతో మార్షల్స్ సభలోపలకు వచ్చి అన్నాడీఎంకే సభ్యులందరినీ గెంటివేశారు.
సీటు మార్పు... కుదరదన్న అప్పావు
శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయం ముగియగానే ఈపీఎస్ లేచి అన్నాడీఎంకే సభాపక్ష ఉపనాయకుడి సీటు మార్పు విషయాన్ని లేవనెత్తారు. ప్రధాన ప్రతిపక్షం సభా పక్ష ఉపనాయకుడి సీటు గురించి స్పీకర్ అప్పావు వద్ద తమ పార్టీ సభ్యుల బృందం పదిసార్లు వినతిపత్రాలు సమర్పించిందంటూ తేదీల సహా వెల్లడించారు. ఓపీఎస్, ఆయన వర్గం శాసనసభ్యులను పార్టీ నుంచి తొలగించామని, వారిని మళ్లీ పార్టీలో చేర్చుకునే అవకాశం లేదని సుప్రీంకోర్టు కూడా స్పష్టమైన తీర్పు వెలువరించిందంటూ అందుకు సంబంధించిన దస్తావేజులను స్పీకర్‌కు అందించామని చెప్పారు. రెండు రోజుల క్రితం కూడా తమ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ సభాపక్ష ఉపనాయకుడు ఆర్బీ ఉదయకుమార్‌ను ప్రస్తుతం తన పక్కనున్న సీటును కేటాయించాలని విజ్ఞప్తి చేశారన్నారు. స్పీకర్ అప్పావు బదులిస్తూ... శాసనసభలో ప్రధాన ప్రతిపక్షం సభాపక్ష నాయకుడికి కోరుకున్న చోట సీటును కేటాయించే అధికారం మాత్రమే తనకుందని, ఉపనాయకుడి సీటు ప్రస్తావన శాసనసభ నిబంధనల్లో ఎక్కడా లేదన్నారు. మునుపటి స్పీకర్‌లాగే తాను సీట్ల విషయంలో నిర్ణయాలు తీసుకున్నానని తెలిపారు. సభాపక్ష ఉపనాయకుడిగా, పార్టీ విప్‌గా ఎవరిని ఎంపిక చేసినా గుర్తిస్తానని, సీట్ల కేటాయింపులకు సంబంధించి తనకున్న విచక్షణాధికారాన్ని ప్రశ్నించలేరని స్పష్టం చేశారు. గతంలో అప్పటి స్పీకర్ ఓ పార్టీ చిహ్నంపై పోటీ చేసి గెలిచి ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓటేసిన 11 మంది సభ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రధాన ప్రతిపక్ష సభాపక్ష ఉపనాయకుడి (ఓపీఎ్‌స)కి ఈపీఎస్ పక్కనున్న సీటు ఇచ్చారని, తాను ఆ సీటును కేటాయించలేదన్న విషయాన్ని గుర్తించాలన్నారు. వెంటనే ఈపీఎస్ లేచి సీటు విషయమై మాట్లాడేందుకు ప్రయత్నించగా స్పీకర్ మైక్ కట్ చేశారు. దీంతో ఈపీఎస్ మాటలేవీ వినిపించలేదు. ఆ సమయంలో ఓపీఎస్ వర్గానికి చెందిన ఎమ్మెల్యే మనోజ్ పాండ్యన్ ఈపీఎ్‌సకు వ్యతిరేకంగా మాట్లాడారు. వెంటనే అన్నాడీఎంకే సభ్యులంతా లేచి మనోజ్ పాండ్యన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే స్పీకర్ జోక్యం చేసుకుని అన్నాడీఎంకే సభ్యులంతా వారి సీట్లలో కూర్చోవాలని ఆదేశించారు. స్పీకర్ నిర్ణయాలు ఏకపక్షంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ అన్నాడీఎంకే సభ్యులందరూ ఆయన పోడియం చుట్టూ గుమిగూడారు. అన్నాడీఎంకే డిప్యూటీ విప్ రవి, ఆ పార్టీ సభ్యులు కొందరు నేలపై బైఠాయించారు. స్పీకర్ అప్పావు జోక్యం చేసుకుంటూ అన్నాడీఎంకే సభ్యులు వాకౌట్ చేయాలనుకుంటున్నారా? లేక సభ నుంచి గెంటివేయాలని భావిస్తున్నారా? అని ప్రశ్నించారు. స్పీకర్ మాటలను పట్టించుకోకుండా అన్నాడీఎంకే సభ్యులంతా బిగ్గరగా నినాదాలు చేశారు. దీనితో స్పీకర్ మార్షల్స్‌ను రప్పించి అన్నాడీఎంకే సభ్యులందరినీ సభ నుంచి గెంటివేయించారు.
స్పీకర్ వైఖరి ఏకపక్షం: ఈపీఎస్
శాసనసభలో స్పీకర్ అప్పావు నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని, పాలకపక్షానికి అనుగుణంగా ప్రవర్తిస్తున్నారని, శాసనసభ్యులడిగే ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు చెప్పడానికి ముందే స్పీకర్ సమాధానాలిస్తున్నారని అన్నాడీఎంకే సభాపక్ష నాయకుడు ఈపీఎస్ ఆరోపించారు.
స్పీకర్ ఏకపక్షంగా వ్యహరిస్తున్నారు: ఈపీఎస్
శాసనసభ నుంచి గెంటివేతకు గురైన తర్వాత సచివాలయం వెలుపల మీడియా ప్రతినిధులతో ఈపీఎస్ మాట్లాడుతూ... ప్రధాన ప్రతిపక్షానికి చెందిన సభాపక్ష ఉపనాయకుడికి సీటు కేటాయింపు విషయమై ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా స్పీకర్ పట్టించుకోలేదన్నారు. ఆయన నిర్లక్ష్యధోరణిని ప్రదర్శిస్తూ ఏకపక్షంగా వ్యహరిస్తున్నారని ఆరోపించారు. శాసనసభలో ప్రతిపక్ష ప్రధాన నేత సూచనలను అనుసరించి సభాపక్ష ఉపనాయకుడికి స్పీకర్ సీటును కేటాయించడం ఆనవాయితీ అన్నారు. సీట్ల కేటాయింపునకు సంబంధించి తనకున్న విచక్షణాధికారాన్ని ఎవరూ ప్రశ్నించలేరంటూ స్పీకర్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
Updated Date - 2023-10-12T07:56:59+05:30 IST