India vs Bharat: జీ20 సమ్మిట్‌లో మోదీ నేమ్‌ప్లేట్‌పై ‘భారత్’ పేరు.. మరోసారి తెరమీదకి ఇండియా vs భారత్ వివాదం
ABN, First Publish Date - 2023-09-09T16:54:14+05:30
రాష్ట్రపతి భవనంలో జీ20 విందు ఆహ్వానాలపై ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కి బదులు ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని ముద్రించినప్పటి నుంచి.. దేశం పేరు మార్పుపై జాతీయంగా రగడ జరుగుతోంది. దేశం పేరు ఇండియా....
రాష్ట్రపతి భవనంలో జీ20 విందు ఆహ్వానాలపై ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కి బదులు ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని ముద్రించినప్పటి నుంచి.. దేశం పేరు మార్పుపై జాతీయంగా రగడ జరుగుతోంది. దేశం పేరు ఇండియా నుంచి భారత్‌గా మారే అవకాశాలు ఉన్నాయని.. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఈ తీర్మానం చేయొచ్చని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. చివరికి ఈ అంశంపై ఐక్యరాజ్య సమితి కూడా స్పందించింది. కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రక్రియ పూర్తి చేస్తే, ఐక్యరాజ్య సమితి రికార్డుల్లో ఇండియా పేరుని భారత్‌గా మారుస్తామని కూడా తెలిపింది.
ఇలాంటి తరుణంలో.. జీ20 వేదికలో ప్రధాని నరేంద్ర మోదీ నేమ్‌ప్లేట్‌పై దేశం పేరును భారత్‌గా పేర్కొనడంతో, దేశం పేరును మారుస్తున్నారనే వాదనలకు మరింత బలం చేకూర్చినట్లయ్యింది. అటు.. విదేశీ ప్రతినిధులకు ఇచ్చిన జీ20 బుక్‌లెట్‌లోనూ భారత్, మదర్ ఆఫ్ డెమోక్రసీ అని కూడా ముద్రించారు. రాజ్యాంగంలో పేర్కొన్న విధంగానే.. దేశం అధికారిక పేరు ‘భారత్’ అని బుక్‌లెట్‌లో స్పష్టం చేశారు. దీంతో.. ఇండియా vs భారత్ చర్చ మరోసారి తెరమీదకి వచ్చింది. దేశం పేరుని భారత్‌గా మార్చడం దాదాపు ఖాయమని అందరూ ఫిక్సైపోయారు. నెటిజన్లు సైతం.. ఇప్పటి నుంచే ‘ఇండియా’ పేరుని వాడకుండా, భారత్ అని రాస్తున్నారు. చాలామంది దేశం పేరుని భారత్‌గా మారిస్తేనే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు.
కానీ.. దేశం పేరుని భారత్‌గా మారిస్తే, గుర్తింపు కార్డులతో పాటు నోట్లపై ఉన్న ‘ఇండియా’ సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. అయినా.. రాజ్యాంగంలో ఇండియా, భారత్ పేర్లను దేశానికి వాడుకోవచ్చని ఉందని.. అలాంటప్పుడు ఈ కొత్త డ్రామా ఏంటని ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ సైతం నిలదీస్తోంది. మోదీ ప్రభుత్వం దేశ వారసత్వాన్ని నాశనం చేస్తున్నారని ఇండియా కూటమి ఆరోపణలు చేసింది. తమ ఇండియా కూటమిని చూసి మోదీ ప్రభుత్వం భయపడుతోందని, ఆ భయంతోనే దేశం పేరు మార్చాలని అనుకుంటోందని దుయ్యబట్టారు. ఈ విమర్శలకు బీజేపీ కూడా ధీటుగానే స్పందిస్తోంది. అయితే.. దేశం పేరుని భారత్‌గా మారుస్తున్నారనే విషయంపై కేంద్రం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం మాత్రం రాలేదు.
Updated Date - 2023-09-09T16:54:14+05:30 IST