Bangalore: బీజేపీ సీనియర్ నేత ఇంటికి డీకే శివకుమార్.. పార్టీలోకి ఆహ్వానించారంటూ...
ABN, First Publish Date - 2023-09-07T11:52:20+05:30
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్(DK Shivakumar) బుధవారం బీజేపీ సీనియర్ నేత, చిత్రదుర్గ జిల్లా
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్(DK Shivakumar) బుధవారం బీజేపీ సీనియర్ నేత, చిత్రదుర్గ జిల్లా హిరియూరు మాజీ ఎమ్మెల్యే పూర్ణిమ(Former MLA Poornima) నివాసానికి వెళ్లారు. బెంగళూరు కేఆర్ పురంలోని దేవసంద్రలో గల పూర్ణిమ నివాసానికి వెళ్లిన డీసీఎంకు కుటుంబ సభ్యులు ఘనస్వాగతం పలికారు. ఇదే సందర్భంగా పూర్ణిమాతో పాటు భర్త శ్రీనివాస్ కుటుంబీకులు డీకే శివకుమార్‌తో ఫొటోలు తీయించుకున్నారు. డీకే రాకపై అనంతరం పూర్ణిమ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో చేరేలా ఉంటే బహిరంగ ప్రకటన చేసి వెళతానన్నారు. హిరియూరులో సీఎంలు యడియూరప్ప, బసవరాజ్ బొమ్మై(Yeddyurappa, Basavaraj Bommai) ఇచ్చిన గ్రాంట్లతో సమగ్ర అభివృద్ధి చేశానని కానీ ఇటీవల ఎన్నికలలో ఓటమి చెందానన్నారు.
బీజేపీ పట్ల తనకు ఎటువంటి అసంతృప్తి లేదని అయినా పార్టీని వీడేటట్లయితే ముందుగానే ప్రకటిస్తానన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని పూర్ణిమ నివాసంలో ఏర్పాటైన కార్యక్రమానికి కుటుంబ సభ్యుల ఆహ్వానం మేరకు వచ్చానని, రాజకీయాల గురించి చర్చించలేదని అనంతరం డీసీఎం డీకే శివకుమార్(DCM DK Shivakumar) మీడియాకు చెప్పారు. తాము ఆపరేషన్ హస్త చేయడం లేదని, కో ఆపరేషన్ చేస్తున్నామన్నారు. పూర్ణిమ తండ్రి ఎ. కృష్ణప్ప తమ నాయకుడు అన్నారు. ఆయన ఎంతో కాలం కాంగ్రెస్‌లో ఉన్నారని గుర్తు చేశారు. కాగా ఇటీవలే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు తేజస్విని అనంతకుమార్ కూడా డీకే శివకుమార్‌ను సదాశివనగర్‌లోని నివాసంలో భేటీ అయిన సంగతి విదితమే. ఆదమ్య చేతన ట్రస్టు అధ్యక్షురాలి హోదాలోనే ఆమె డీసీఎంను కలిశారని, దీనికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యతలేదని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.
Updated Date - 2023-09-07T11:53:35+05:30 IST