Beers: మద్యం ప్రియులకో గుడ్ న్యూస్.. రెండు బీర్లకు మరొకటి ఉచితం, మహిళలకు మద్యం ఫ్రీ..
ABN, First Publish Date - 2023-07-07T09:33:49+05:30
దేశంలో మరెక్కడా లభించని ‘కిక్కు’ కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి(Puducherry) మద్యంలోనే లభిస్తుందనేది మందుబాబుల
పుదుచ్చేరి, (ఆంధ్రజ్యోతి): దేశంలో మరెక్కడా లభించని ‘కిక్కు’ కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి(Puducherry) మద్యంలోనే లభిస్తుందనేది మందుబాబుల వాదన. ‘సరకు’ టేస్ట్ కోసమే వారాంతపు సెలవుల్లో పొరుగురాష్ట్రాల నుంచి మందుబాబులు పుదుచ్చేరికి తరలివస్తుంటారు. పుదుచ్చేరిలోనే 900 రకాల మద్యం, 35 రకాల బీర్లు లభిస్తాయంటే అతిశయోక్తి కాదు. రాష్ట్రంలో మద్యం దుకాణాల సంఖ్యా ఎక్కువే, వాటికి తగ్గట్టుగా బార్లు కూడా అధికమే. ఇటీవల మద్యం దుకాణాల మధ్య విపరీతమైన పోటీ నెలకొంది. మందుబాబులను ఆకట్టుకునేందుకు రాయితీలు ప్రకటిస్తున్నారు. తమ దుకాణంలో మందు కొంటే కోడిగుడ్డు ఉచితమని, రెండు బీర్లు కొంటే మరొకటి ఉచితమని ఆకర్షణీయమైన ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఇక నగరంలో ఈ పోటీ తీవ్రస్థాయికి చేరుకుంది. ఇక్కడి రెస్టారెంట్లలోనే మద్యం బార్లు నడుపుతున్నారు. పర్యాటకులు బస చేసే గదుల వద్దకే మద్యాన్ని సరఫరా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీరు(Beer) తాగేవారిని ఆకట్టుకునేందుకు చెన్నై నుంచి పుదుచ్చేరికి ‘బీర్ బస్’ను నడిపేందుకు కూడా ప్రయత్నాలు జరిగాయి. అయితే పలు వర్గాల నుంచి విమర్శలు రావడంతో ఆఖరిక్షణంలో ఆ సర్వీసు ఆగిపోయింది. అదే సమయంలో ఈస్ట్‌కోస్ట్ రోడ్డులో మహిళల కోసం ప్రత్యేకంగా మద్యం బార్లను తెరిచారు. ఈ బార్లలో మగువలే మద్యాన్ని అందించటం విశేషం. ఇక మరికొన్ని బార్లలో మహిళలను ఆకట్టుకునేందుకు వారికి ఉచితంగా మద్యం అందిస్తామంటూ రెండు రోజులుగా అంతర్జాలంలో వెలువడిన ప్రకటనలు కలకలం సృష్టించాయి. మద్యం గురించి ప్రకటనలు చేయడం శిక్షార్హమంటూ పుదుచ్చేరి పోలీసులు అదేపనిగా హెచ్చరికలు జారీ చేస్తున్నా మద్యం దుకాణాల యజమానులు పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం పుదుచ్చేరి మూడు వైన్లు, ఆరు బీర్లుగా విరాజిల్లుతోందంటే అతిశయోక్తి కాదు.
Updated Date - 2023-07-07T09:33:49+05:30 IST