Bengaluru: డిప్యూటీ సీఎం వర్సెస్ బీజేపీ ఎమ్మెల్యే.. డీకే కాళ్లు మొక్కిన మునిరత్న
ABN, First Publish Date - 2023-10-12T11:23:57+05:30
రాష్ట్రంలో ప్రభుత్వం మారాక కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రత్యేకించి బెంగళూరులో వివిధ నియోజకవర్గాలకు గత బీజేపీ
- గ్రాంట్ల రద్దు, బిల్లుల అక్రమాలపై వివాదం
- గాంధీ విగ్రహం వద్ద ఎమ్మెల్యే నిరసన
- ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో భేటీ
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రభుత్వం మారాక కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రత్యేకించి బెంగళూరులో వివిధ నియోజకవర్గాలకు గత బీజేపీ ప్రభుత్వం కేటాయించిన గ్రాంట్లు, టెండర్లను రద్దు చేశారు. గతంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో అవకతవకలు జరిగాయని, విచారణకు ఆదేశించారు. ప్రత్యేకించి రాజరాజేశ్వరినగర్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న(BJP MLA Muniratna), ప్రస్తుత ఉపముఖ్యమంత్రి, బెంగళూరు నగరాభివృద్ధిశాఖ మంత్రి డీకే శివకుమార్(DK Shivakumar), ఆయన సోదరుడు, బెంగళూరు గ్రామీణ ఎంపీ డీకే సురేశ్ మధ్య వివాదం తలెత్తింది. మూడు నెలలుగా సాగుతున్న వివాదం బుధవారం అనూహ్యమైన మలుపులు తిరిగింది. రాజరాజేశ్వరినగర్ ఎమ్మెల్యే మునిరత్న నేరుగా విధానసౌధకు చేరుకుని గాంధీ విగ్రహం వద్ద తన నియోజకవర్గానికి అభివృద్ధి విషయంలో అన్యాయం జరిగిందని ఒంటరిగా నిరసనకు దిగారు. కాసేపటికి ఆయన అభిమానులు, అనుచరులు, బీజేపీ నాయకులు మద్దతు ఇచ్చారు. దీంతో పోలీసులు స్పందించి కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఒంటరిగానే మునిరత్న నిరసన కొనసాగించారు. విషయం తెలియగానే బీజేపీ అగ్రనేత యడియూరప్ప నేరుగా అక్కడికి వెళ్లి మునిరత్నను బుజ్జగించి నిరసన విరమింపచేశారు.
ప్యాలెస్ మైదానంలో డీకే కాళ్లు మొక్కిన మునిరత్న
బెంగళూరులో కంబళ క్రీడా పోటీల నిర్వహణకు భూమిపూజలో పాల్గొన్న డీకే శివకుమార్ వద్దకు ఎమ్మెల్యే మునిరత్న వచ్చారు. తొలుత పోలీసులు అనుమతి లేదని అడ్డుకున్నారు. ఆ తర్వాత తాను ఎమ్మెల్యేనని, మంత్రితో మాట్లాడాలని తెలిపిన మేరకు వారు సమ్మతించారు. ఇదే సందర్భంలో ప్రసంగిస్తున్న డీకే శివకుమార్ నేరుగా మునిరత్నను ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కొందరు యాక్టింగ్ చేసేందుకు వచ్చారని, వారి గురించి తర్వాత మాట్లాడతానని పేర్కొన్నారు. సభ ముగిశాక బయటకు వస్తున్న డీకే శివకుమార్ చెంతకు మునిరత్న వెళ్లారు. అందరూ చూస్తుండగానే డీకే శివకుమార్ కాళ్లకు వంగి నమస్కరించారు. దీంతో అక్కడివారంతా ఖంగు తిన్నారు. ఆ వెంటనే డీకే శివకుమార్ స్పందించి మునిరత్న భుజం తట్టి ఇంటికి వస్తే మాట్లాడదామంటూ ఆహ్వానించారు. ఆ తర్వాత నేరుగా సదాశివనగర్‌కు వెళ్లిన మునిరత్నతో డీసీఎం చర్చలు జరిపారు. అనంతరం డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ మునిరత్న తన కాళ్లు మొక్కారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాజరాజేశ్వరినగర్‌లో వాస్తవంగా జరిగిన పనులకు సంబంధించి ఒక నివేదిక ఇవ్వాలని వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చానన్నారు. మరోవైపు మునిరత్న మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసం కాళ్లకు నమస్కరించానని, పరిష్కారం కాకుంటే పోరాటం చేస్తానన్నారు. బొమ్మై సీఎంగా ఉన్నప్పుడు హొసకెరెహళ్ళి చెరువుతోపాటు పలు పార్కుల అభివృద్ధికి 120 కోట్ల రూపాయలు గ్రాంటు కేటాయించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వెంటనే వాటిని రద్దు చేశారన్నారు. సదరు సొమ్ములో పులకేశినగర్, బ్యాటరాయనపుర, యశ్వంతపుర(eswanthapura) నియోజకవర్గాలకు చెరో రూ.40కోట్లు మార్చారన్నారు. రాజకీయ వైషమ్యాలతో తన నియోజకవర్గప్రజలకు అన్యాయం జరుగుతోందని విచారం వ్యక్తం చేశారు.
Updated Date - 2023-10-12T11:23:57+05:30 IST