Jodo Yatra : దేశవ్యాప్తంగా ‘జోడో’ ప్రభావం
ABN, First Publish Date - 2023-01-30T02:15:41+05:30
తాను చేపట్టిన భారత్ జోడో యాత్ర దక్షిణం నుంచి ఉత్తర భారతానికి సాగినా.. దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. భారత రాజకీయాలపై కచ్చితంగా ప్రభావం ఉంటుందని, అయితే ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేనని పేర్కొన్నారు. బీజేపీ-ఆర్‌ఎ్‌సఎ్‌సల విద్వేష, దురంహకార వైఖరికి తన యాత్ర ప్రత్యామ్నాయ
బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ విద్వేష వైఖరికి..
ప్రత్యామ్నాయ విధానాన్ని చూపించాం
ఇంత స్పందనను ఊహించలేదు
ప్రజల శక్తి, సామర్థ్యాలను చూశాం
పార్టీలకు, ప్రజలకు మధ్య అంతరం
జమ్మూకశ్మీర్ పరిస్థితి బాగుంటే
అమిత్‌షా పాదయాత్ర చేయాలి
రెండో యాత్రపై ఆలోచిస్తా: రాహుల్
శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌లో ముగిసిన
జోడో.. త్రివర్ణ పతాకం ఆవిష్కరణ
త్రివర్ణ పతాకావిష్కరణ.. నేడు ముగింపు సభ
శ్రీనగర్, జనవరి 29: తాను చేపట్టిన భారత్ జోడో యాత్ర దక్షిణం నుంచి ఉత్తర భారతానికి సాగినా.. దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. భారత రాజకీయాలపై కచ్చితంగా ప్రభావం ఉంటుందని, అయితే ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేనని పేర్కొన్నారు. బీజేపీ-ఆర్‌ఎ్‌సఎ్‌సల విద్వేష, దురంహకార వైఖరికి తన యాత్ర ప్రత్యామ్నాయ ఆలోచనా విధానాన్ని చూపిందన్నారు. విపక్షాలు చీలికలుపేలికలుగా ఉన్నాయన్న వాదన నిజం కాదని తెలిపారు. వాటి మధ్య విభేదాలున్న మాట వాస్తవమని, అయితే చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఈ సైద్ధాంతిక పోరులో ఈ పార్టీలన్నీ కలిసికట్టుగా ఉంటాయని, సంఘ్-బీజేపీ ఓ వైపు.. వాటిని వ్యతిరేకించేవారు మరోవైపు ఉన్నారని వివరించారు. 145 రోజులపాటు సాగిన రాహుల్ జోడోయాత్ర ఆదివారం శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌లో త్రివర్ణ పతాకావిష్కరణతో సంపూర్ణమైంది. ఉదయం 10.45 గంటలకు శ్రీనగర్‌లోని పంథాచౌక్ నుంచి తన సోదరి ప్రియాంకాగాంధీ వాద్రా, జమ్మూకశ్మీరు కాంగ్రెస్ నేతలతో కలిసి రాహుల్ యాత్రను ప్రారంభించారు. కాంగ్రెస్ మద్దతుదారులు, మహిళలు జాతీయ పతాకాలు, పార్టీ జెండాలను పట్టుకుని వెంట నడిచారు. పీడీపీ నాయకురాలు, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ వచ్చి రాహుల్, ప్రియాంకలతో జతకలిశారు. సొన్వార్ ప్రాంతం వరకు ఏడు కిలోమీటర్లు నడిచారు. అక్కడి నుంచి రాహుల్, ప్రియాంక, పార్టీ నాయకులు ఎంఏ రోడ్డులోని పీసీసీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి లాల్‌చౌక్‌కు చేరుకుని మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి పోలీసు బలగాలు బహుముఖ భద్రత కల్పించాయి. లాల్‌చౌక్‌కు కిలోమీటరు పరిధిలో శనివారం రాత్రే రోడ్లన్నీ మూసివేశారు. పతాకావిష్కరణ తర్వాత భారత్ యాత్రీలతో కలిసి రాహుల్ నెహ్రూ పార్కు వరకు నడిచారు. దీంతో సుమారు నాలుగు నెలలపాటు సాగిన జోడో యాత్ర పరిసమాప్తమైంది. లాల్‌చౌక్‌లో జాతీయ పతాకావిష్కరణ అనంతరం రాహుల్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
అందమైన అనుభవం..
జోడో యాత్ర తన జీవితంలో గాఢమైన, చాలా అందమైన అనుభవమని రాహుల్ పేర్కొన్నారు. ప్రజల నుంచి అద్భుత స్పందన, ప్రేమ లభించాయని అన్నారు. ‘జోడో యాత్రలో లక్షల మందిని కలిసి మాట్లాడాను. దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న విద్వేషం, హింసలకు వ్యతిరేకంగా దేశాన్ని ఏకం చేయడం యాత్ర ఉద్దేశం. ఇంత ప్రేమతో కూడిన స్పందన లభిస్తుందని ఊహించలేదు. ప్రజల శక్తిసామర్థ్యాలను ప్రత్యక్షంగా చూశాం. రైతులు, నిరుద్యోగుల సమస్యలు విన్నాం’ అని రాహుల్ తెలిపారు. పశ్చిమ భారతం నుంచి తూర్పు భారతం వైపు మరో యాత్ర చేపట్టే ఉద్దేశం ఉందా అని అడుగగా.. తాను ఆలోచిస్తానని చెప్పారు. కాంగ్రెస్ , బీజేపీ వంటి పార్టీలకు, ప్రజలకు మధ్య అంతరం ఏర్పడిందన్నారు. మీడియా, ఇంటర్వ్యూలు, ప్రెస్ కాన్ఫరెన్సుల ద్వారా మాత్రమే దగ్గరగా ఉంటున్నాయని.. ఈ అంతరాన్ని తొలగించాల్సిన అవసరం ఉందని చెప్పారు. రోడ్లపైకి వెళ్లి వారిని కలిసి ఆలింగనం చేసుకోవాలన్నారు. ‘గతంలో ఇంటర్వ్యూలు, ప్రెస్ కాన్ఫరెన్సులకు సంబంధించి నిష్పక్షపాత రిపోర్టింగ్ ఉండేది. ఇప్పుడు మీడియాలోకీ వివక్ష ప్రవేశించింది. ప్రతిపక్షానికి ఇవ్వాల్సినంత ప్రాధాన్యం ఇవ్వడం లేదు’ అని ఆక్షేపించారు.
అంతా బాగుంటే.. మీరూ నడవండి!
జమ్మూకశ్మీరులో భద్రతా పరిస్థితిపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, బీజేపీపై రాహుల్ మండిపడ్డారు. రోజూ కొందరిని లక్ష్యంగా చేసుకుని హత్యలు జరుగుతున్నాయని, పేలుళ్లు సంభవిస్తున్నాయని అన్నారు. నిజంగా జమ్మూకశ్మీరు పరిస్థితి బాగుంటే బీజేపీ నేతలు, అమిత్ షా జమ్ము నుంచి శ్రీనగర్ లాల్‌చౌక్ వరకు ఎందుకు పాదయాత్ర చేయరని నిలదీశారు. జమ్ము, లద్ధాఖ్, కశ్మీరు ప్రాంత ప్రజలను కలిశానని.. ఇక్కడి పరిణామాలపై ఎవరూ సంతోషంగా లేరని చెప్పారు. రాష్ట్ర ప్రతిపత్తి, ప్రజాస్వామ్యం పునరుద్ధరణ ఇక్కడ కీలకంగా వేయాల్సిన ముందడుగులని.. తర్వాతి చర్యలు కాలానుగుణంగా చేపట్టాలని తెలిపారు. చైనా పట్ల మనం కఠినంగా వ్యవహరించాలన్నారు. ‘మన భూభాగంలో తిష్ఠ వేయడాన్ని సహించబోమని ఆ దేశానికి తెగేసి చెప్పాలి. చైనా మన భూభాగాన్ని ఆక్రమించిందని అంటుంటే ప్రభుత్వం అదే పనిగా ఖండిస్తోంది. ఇది చాలా ప్రమాదకరం. చైనా మన భూభాగాన్ని ఆక్రమించలేదన్న అభిప్రాయంతో ఉన్నది దేశంలో ఒక్క ప్రధాని మోదీ మాత్రమే’ అని విమర్శించారు. ప్రేమకే ఎల్లప్పుడూ విజయమని.. విద్వేషం ఓడిపోతుందని చెప్పారు. భారత్‌లో ఆశావాదానికి కొత్త ఉషోదయం రానుందని తెలిపారు. ‘భారత్ జోడో యాత్ర’ పూర్తిచేసి దేశానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానని అంతకుముందు ట్వీట్ చేశారు. కాగా.. జోడో యాత్ర దేశవ్యాప్తంగా ప్రేమ సందేశాన్ని వ్యాపింపజేసిందని ప్రియాంక ట్వీట్ చేశారు.
145 రోజులు.. 75 జిల్లాలు
రాహుల్ గత ఏడాది సెప్టెంబరు 7న తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభించిన ‘భారత్ జోడో యాత్ర’.. మొత్తం 145 రోజులపాటు జరిగింది. 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 75 జిల్లాల్లో మొత్తం 4,080 కిలోమీటర్లు నడిచారు. రాహుల్ 12 బహిరంగ సభల్లో, వందకుపైగా వీధి సమావేశాల్లో, 13 విలేకరుల సమావేశాల్లో ప్రసంగించారు. వాస్తవానికి త్రివర్ణ పతాకావిష్కరణ సోమవారం నాడు చేయాలని అనుకోగా.. అధికార యంత్రాంగం పీసీసీ కార్యాలయంలో చేసుకునేందుకు మాత్రమే తొలుత అనుమతి ఇచ్చిందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (కమ్యూనికేషన్లు) ట్విటర్‌లో తెలిపారు. చివరకు లాల్‌చౌక్‌లో ఎగురవేసేందుకు శనివారం సాయంత్రం పర్మిషన్ ఇచ్చిందని, అయితే ఆదివారమే పతాకావిష్కరణ చేసుకోవాలని షరతు పెట్టిందని ఆక్షేపించారు.
Updated Date - 2023-01-30T02:15:44+05:30 IST