Karnataka Polls: ప్రత్యర్థులకు చిక్కని కేసీఆర్ తాజా వ్యూహమిదే!
ABN, First Publish Date - 2023-02-20T19:18:22+05:30
కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో (Karnataka Polls) అనుసరించాల్సిన వ్యూహానికి భారత్ రాష్ట్ర సమితి (Bharat Rashtra Samithi) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు (K Chandrasekhar Rao) పదునుపెడుతున్నారు.
బెంగళూరు: కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో (Karnataka Polls) అనుసరించాల్సిన వ్యూహానికి భారత్ రాష్ట్ర సమితి (Bharat Rashtra Samithi) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు (K Chandrasekhar Rao) పదునుపెడుతున్నారు. ముందు అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల నాటికి కర్ణాటకలో బలపడాలని ఆయన యోచిస్తున్నారు. తొలుత అసెంబ్లీ ఎన్నికల్లో జనతాదళ్ సెక్యులర్ పార్టీతో(JDS) ఒప్పందం కుదుర్చుకుంటారని తెలుస్తోంది. జేడీఎస్‌తో పొత్తు ద్వారా తెలుగువారు బలంగా ఉన్న చోట్ల పోటీ చేసి గెలవాలని ఆయన తలపోస్తున్నారు. కళ్యాణ కర్ణాటక (Kalyana Karnataka) (పూర్వ హైదరాబాద్) లోని తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో పోటీ చేయాలని కేసీఆర్(KCR) నిర్ణయించినట్లు తెలుస్తోంది. పొత్తు పెట్టుకోకుండా వేర్వేరుగా పోటీచేస్తే ఓట్లు చీలే అవకాశం ఉండటంతో కలిసే పోటీచేయాలని కేసీఆర్, జేడీఎస్ అధినేత కుమార స్వామి (Kumara swamy) గతంలో నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో భాగంగా కేసీఆర్ స్వయంగా రాయ్‌చూర్, బీదర్, కలబురిగి, కొప్పాల్ జిల్లాల్లో పర్యటించనున్నారు. కేసీఆర్ పర్యటన సమయంలో ఇతర పార్టీల నుంచి కీలకమైన నేతలను బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించే అవకాశం ఉంది.
కళ్యాణ కర్ణాటక ప్రాంతంలో బీఆర్ఎస్ సొంతంగా 25 సీట్ల వరకూ పోటీ చేసే అవకాశం ఉంది. పొత్తు కూడా దీనికి తగ్గట్లే కుదుర్చుకోనున్నారు. 2018 ఎన్నికల్లో కళ్యాణ కర్ణాటక ప్రాంతంలో 40 స్థానాలకు గానూ జేడీఎస్ కేవలం 4 చోట్ల మాత్రమే గెలిచింది. ఈసారి బీఆర్ఎస్-జేడీఎస్ కాంబినేషన్‌లో మెజార్టీ స్థానాలు గెలుచుకోవాలని ఇద్దరు నేతలూ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. బెంగళూరులో తెలుగువారు పెద్ద సంఖ్యలో ఉండే చోట కూడా పోటీ చేయాలని కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. జేడీఎస్ ఇప్పటికే 93 మంది అభ్యర్థులను ప్రకటించింది. దీంతో మిగతా స్థానాలపైనే పొత్తు కుదిరే అవకాశం ఉంది.
ఆప్ కూడా కర్ణాటకలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. దీంతో భావసారూప్యత కోణంలో పొత్తు కుదుర్చునే అవకాశాలూ లేకపోలేదు. బీఆర్ఎస్-జేడీఎస్-ఆప్ కలిస్తే మెజార్టీ సీట్లు దక్కించుకునే అవకాశముందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ బీఆర్ఎస్-జేడీఎస్‌తో పొత్తు కుదుర్చుకుంటారా లేదా అనేది స్పష్టం కావాల్సి ఉంది.
ఇప్పటికే మహారాష్ట్రలో ఒంటరిగా పోటీచేస్తామని కేసీఆర్ నాందేడ్ సభ వేదికగా స్పష్టం చేశారు. తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో తెలుగువారు ఎక్కువగా ఉండే చోట్ల బీఆర్ఎస్ అభ్యర్ధులను గెలిపించుకోవాలని కేసీఆర్ వ్యూహాలు పన్నుతున్నారు.
బీజేపీకి చెక్ పెట్టాలనే యోచనతో పాటు జాతీయ స్థాయిలో బలమైన పార్టీగా బీఆర్ఎస్‌ను నిలపాలని కేసీఆర్ యోచిస్తున్నారు. అయితే ఆయన ఏమేరకు విజయం సాధించగలరనేది మరికొంత కాలం ఆగితే తప్ప స్పష్టత రాదని పరిశీలకులు అంటున్నారు.
జనవరి 18న ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు ఢిల్లీ, పంజాబ్, కేరళ సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్‌మాన్, పినరయ్ విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌తో పాటు పలు జాతీయ, ప్రాంతీయ పార్టీలు, సంఘాల నేతలు తరలివచ్చారు. అయితే కుమారస్వామి హాజరుకాలేదు. దీంతో కేసీఆర్‌కు ఆయనకు చెడిందని ప్రచారం జోరందుకుంది. అయితే ఆ ఆరోపణలన్నీ అబద్ధమని కుమారస్వామి తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ ఆవిర్భావ వేళ కుమారస్వామి స్వయంగా హైదరాబాద్ వచ్చి కేసీఆర్‌ను కలుసుకున్నారు.
Updated Date - 2023-02-20T19:20:07+05:30 IST