Bhupesh Baghel: అధికారం కట్టబెట్టిన పాత పాచికనే బయటకు తీసిన సీఎం
ABN, First Publish Date - 2023-10-23T19:04:23+05:30
ఒక హామీ బీజేపీ 15 ఏళ్ల పాలనకు చరమగీతం పాడి కాంగ్రెస్‌కు 2018 ఎన్నికల్లో పట్టంగట్టింది. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ ఇప్పుడు మళ్లీ అదే పాచిక బయటకు తీశారు. ఈసారి కూడా ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపిస్తే రాష్ట్రంలోని రైతు రుణాలను మాఫీ చేస్తామని ఆయన సోమవారంనాడు వాగ్దానం చేశారు.
రాయపూర్: ఒక హామీ బీజేపీ 15 ఏళ్ల పాలనకు చరమగీతం పాడి కాంగ్రెస్‌కు 2018 ఎన్నికల్లో పట్టంగట్టింది. ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ (Bhupesh Baghel) ఇప్పుడు మళ్లీ అదే పాచిక బయటకు తీశారు. ఈసారి కూడా ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపిస్తే రాష్ట్రంలోని రైతు రుణాలను మాఫీ చేస్తామని ఆయన సోమవారంనాడు వాగ్దానం చేశారు. శక్తి అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ర్యాలీలో సీఎం మాట్లాడుతూ, కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే గతంలోలాగే ఈసారి కూడా రైతు రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని ప్రకటించారు.
పటిష్ట వ్యవసాయ రంగం, రైతుల అభ్యున్నతితోనే ఛత్తీస్‌గఢ్‌కు ఆర్థిక పరిపుష్టి కలుగుతుందని సీఎం అన్నారు. ఆర్థిక మందగనమం ఇతర రాష్ట్రాల్లో చూశామని, కానీ ఛత్తీస్‌గఢ్‌లో ఈ ప్రభావం ఎంతమాత్రం లేదని అన్నారు. రైతు రుణాలను తాము మాఫీ చేయడంతో ఆ ప్రభావం రాష్ట్రంలో వాణిజ్యాభివృద్ధికి ఎంతో దోహదపడిందని చెప్పారు. 2018లో తాము వాగ్దానం చేసినట్టుగానే రూ.9,270 కోట్ల రైతు రుణాలను మాఫీ చేశామని, ఇందువల్ల 18.82 లక్షల మంది రైతులకు మేలు చేకూరిందని తెలిపారు.
కాంగ్రెస్ 4 కీలక హామీలివే...
కాంగ్రెస్ పార్టీ ఇంతవరకూ రాష్ట్ర ప్రజానీకానికి నాలుగు ముఖ్యమైన హామీలు ఇచ్చింది. తాము అధికారంలోకి రాగానే కులగణన చేపతామని, ఎకరాకు 20 క్వింటాళ్ల ధాన్యాన్ని సేకరిస్తామని, 17.5 లక్షల మందికి ఇళ్లు కల్పిస్తామని, రైతు రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించింది. భూపేష్ బఘెల్ ఇటీవల పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో రైతులే నిర్ణయాత్మక శక్తి అని చెప్పారు. రైతుల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ 75 సీట్లు గెలుచుకోనుందని తెలిపారు.
కాగా, 90 అసెంబ్లీ స్థానాలున్న ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీకి రెండు విడతలుగా ఎన్నికలు జరగనున్నారు. నవంబర్ 7న జరిగే తొలి విడత ఎన్నికల్లో 20 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. తక్కిన 70 స్థానాలకు నవంబర్ 17న రెండో విడత పోలింగ్ ఉంటుంది. ప్రస్తుత అసెంబ్లీ కాల పరిమితి 2024 జనవరి 3వ తేదీతో ముగియనుంది.
Updated Date - 2023-10-23T19:04:23+05:30 IST