BJP: అన్నామలై పాదయాత్రకు రండి
ABN, First Publish Date - 2023-07-27T09:47:56+05:30
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) పాదయాత్రలో పాల్గొనాలని ఎట్టకేలకు డీఎండీకే(DMDK)కు ఆహ్వానం అందింది
- బీజేపీ నుంచి డీఎండీకేకు ఆహ్వానం
పెరంబూర్(చెన్నై): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) పాదయాత్రలో పాల్గొనాలని ఎట్టకేలకు డీఎండీకే(DMDK)కు ఆహ్వానం అందింది. ‘ఎన్ మన్ ఎన్ మక్కల్’ పేరుతో అన్నామలై ఈనెల 28నుంచి రామేశ్వరం నుంచి చేపట్టనున్న 110 రోజుల పాదయాత్రను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రారంభించనున్నారు. ఈ పాదయాత్రలో పాల్గొనాలని ఎన్డీఏ కూటమి పార్టీలు అన్నాడీఎంకే, పీఎంకే, టీఎంసీ సహా పలు పార్టీలకు బీజేపీ రాష్ట్ర అధిష్ఠానం ఆహ్వాన లేఖలు రాయగా, గతంలో ఆ కూటమిలో ఉన్న డీఎండీకేకు మాత్రం అందలేదు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ కూటమి పక్షాల సమావేశానికి ఆహ్వానం లేకపోవడంతో డీఎండీకే నేతలు ఆగ్రహంతో ఉండగా, అన్నామలై పాదయాత్ర కూడా ఆహ్వానం లేకపోవడం మరింత ఆందోళనకు గురిచేసింది. ఈ విషయమై డీఎండీకే కోశాధికారి ప్రేమలత స్పందిస్తూ... రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఏ కూటమి పొత్తు లేదని మంగళవారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో, అన్నామలై పాదయాత్రలో పాల్గొనాలంటూ ఆ పార్టీ నేత కరు.నాగరాజన్ బుధవారం డీఎండీకే నేతలను కలసి ఆహ్వాన లేఖ అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎన్డీఏ కూటమిలో డీఎండీకే కూడా భాగస్వామ్యంగా ఉందని, అందువల్ల పాదయాత్ర ప్రారంభోత్సవంలో పాల్గొనాలని వారిని ఆహ్వానించినట్లు తెలిపారు.
Updated Date - 2023-07-27T09:47:58+05:30 IST