Karnataka : జైన మఠాధిపతి హత్య కేసుపై సీబీఐ దర్యాప్తు చేయాలి : బీజేపీ
ABN, First Publish Date - 2023-07-12T15:25:04+05:30
జైన మఠాధిపతి ఆచార్య శ్రీ కామకుమార నంది మహరాజ్‌ను అత్యంత కిరాతకంగా హత్య చేశారని, ఈ కేసు దర్యాప్తును CBIకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ధర్నా చేసింది. శాసన సభ వద్ద బుధవారం మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్ నేతృత్వంలో ఈ ధర్నా జరిగింది
బెంగళూరు : జైన మఠాధిపతి ఆచార్య శ్రీ కామకుమార నంది మహరాజ్‌ను అత్యంత కిరాతకంగా హత్య చేశారని, ఈ కేసు దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI)కి అప్పగించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ధర్నా చేసింది. శాసన సభ వద్ద ఉన్న గాంధీ విగ్రహం ఎదుట బుధవారం మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్ నేతృత్వంలో జరిగిన ఈ ధర్నాలో బీజేపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
కర్ణాటకలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని, జైన మఠాధిపతి హత్య కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని ధర్నాలో పాల్గొన్నవారంతా నినాదాలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టినప్పటి నుంచి హిందూ ప్రముఖుల హత్యాకాండలో మలి దశ ప్రారంభమైందని ఆరోపించారు. జైన మఠాధిపతి హత్య దీనికి స్పష్టమైన ఉదాహరణ అని తెలిపారు. దీనిపై నిష్పాక్షిక దర్యాప్తు అవసరమని చెప్పారు. ఈ ధర్నాలో మాజీ మంత్రులు ఆర్ అశోక, వీ సునీల్ కుమార్, డాక్టర్ సీఎన్ అశ్వత్థ నారాయణ్ తదితరులు పాల్గొన్నారు. ధర్నా అనంతరం బీజేపీ నేతలంతా గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించేందుకు రాజ్ భవన్‌కు ప్రదర్శనగా వెళ్లారు.
బెళగావి జిల్లా, చిక్కోడి తాలూకాలోని హిరేకోడిలో జైన మఠానికి అధిపతి ఆచార్య శ్రీ కామకుమార నంది మహరాజ్. ఆయనను ఇటీవల చిత్రహింసలు పెట్టి హత్య చేశారు. ఆయన శరీరాన్ని ముక్కలుగా నరికేశారు. ముక్కలైన శరీర భాగాలను పాడుపడిన బోరు బావిలో పడేశారు.
ఈ కేసులో నారాయణ బసప్ప మడి, హసన్ దలయత్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్థికపరమైన అంశాలే ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
Former Minister: ఆదాయానికి మించి ఆస్తులు.. మాజీ మంత్రిపై ఛార్జీషీటు దాఖలు
Collegium system : కొలీజియం వ్యవస్థపై సీజేఐ చంద్రచూడ్ సంచలన వ్యాఖ్యలు
Updated Date - 2023-07-12T15:25:04+05:30 IST