Rahul Gandhi: దేశ ఆర్థిక వ్యవస్థ నడ్డివిరిచిన బీజేపీ: రాహుల్
ABN, First Publish Date - 2023-09-02T16:43:13+05:30
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. బీజేపీ భారతదేశ ఆర్థిక వ్యవస్థ నడ్డివిరిచిందని అన్నారు. జీఎస్టీ, పెద్దనోట్ల రద్దుతో చిన్న వ్యాపారాలు ధ్వంసమయ్యాయని, ఇవి ఉద్దేశపూర్వకంగా చేసినవేనని తప్పుపట్టారు.
రాయపూర్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరోసారి విమర్శలు గుప్పించారు. బీజేపీ భారతదేశ ఆర్థిక వ్యవస్థ నడ్డివిరిచిందని అన్నారు. జీఎస్టీ, పెద్దనోట్ల రద్దుతో చిన్న వ్యాపారాలు ధ్వంసమయ్యాయని, ఇవి ఉద్దేశపూర్వకంగా చేసినవేనని తప్పుపట్టారు. ఛత్తీస్‌గఢ్ కొత్త రాజధాని కానున్న 'నవ రాయపూర్'లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 'రాజీవ్ యువ మితాన్ క్లబ్' కార్యక్రమంలో రాహుల్ ఆదివారంనాడు ప్రసంగించారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ చెప్పుకున్న గొప్పలను రాహుల్ ప్రస్తావిస్తూ, ప్రతి ఎన్నికలకు ముందు బీజేపీ ఒక సంఖ్య చెబుతుందని, కర్ణాటకలో కూడా 230 నుంచి 250 సీట్లు గెలుచుకుంటామని చెప్పుకుందని, కానీ కర్ణాటకలోని ప్రతి పేద వ్యక్తి కాంగ్రెస్‌కు ఓటు వేశాడని అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో తొలిసారి ఓటు హక్కు వేసేవారు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఈ ఏడాది చివర్లో ఛత్తీస్‌గఢ్ ఎన్నికలు జరుగనుండగా, గత ఫిబ్రవరిలో కాంగ్రెస్ ప్లీనరీ సమావేశం రాయ్‌పూర్‌లో జరిగింది. అనంతరం ఛత్తీస్‌గఢ్‌లో రాహుల్ పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ కూడా పాల్గొన్నారు.
యువ ఓటర్లకు గాలం...
ఛత్తీస్‌గఢ్‌లో యువ ఓటర్ల సంఖ్య గణనీయంగా ఉండటంతో ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ యువతను ఆకట్టుకునే ప్రయత్నాలు బలంగా చేస్తున్నాయి. 48 లక్షల మంది యువ ఓటర్లు ఇక్కడ ఉండగా, వీరిలో 4.43 లక్షల మంది తొలిసారి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 90 అసెంబ్లీ సీట్లలో 68 సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంది. బీజేపీ 15 సీట్లకే పరిమితమైంది. జేసీసీ (జే) ఐదు నియోజకవర్గాల్లో గెలుపొందగా, దాని భాగస్వామ్య పార్టీ బీఎస్పీ రెండు సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్‌కు ప్రస్తుత అసెంబ్లీలో 71 మంది సభ్యుల బలం ఉంది.
Updated Date - 2023-09-02T16:43:13+05:30 IST