Inidia vs Bharat: ఇండియాను భారత్‌గా మారుస్తున్నాం.. నచ్చకపోతే దేశం వదిలి వెళ్లిపోండి.. బీజేపీ లీడర్ హెచ్చరిక
ABN, First Publish Date - 2023-09-10T16:12:10+05:30
దేశం పేరు మార్పుపై కొన్ని రోజుల నుంచి జాతీయంగా తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. ఎప్పుడైతే రాష్ట్రపతి జీ20 విందు ఆహ్వానాలపై ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’ స్థానంలో ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని ముద్రించారో..
దేశం పేరు మార్పుపై కొన్ని రోజుల నుంచి జాతీయంగా తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. ఎప్పుడైతే రాష్ట్రపతి జీ20 విందు ఆహ్వానాలపై ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’ స్థానంలో ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని ముద్రించారో.. అప్పటి నుంచి ఈ రగడ మొదలైంది. ఇక జీ20 వేదికలో ప్రధాని నరేంద్ర మోదీ నేమ్‌ప్లేట్‌పై దేశం పేరును భారత్‌గా పేర్కొనడంతో.. దేశం పేరును మారుస్తున్నారనే వాదనలకు మరింత బలం చేకూరింది.
ఇలాంటి తరుణంలో పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత దిలీప్ ఘోష్ ఈ అంశంపై తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశం పేరుని ఇండియా నుంచి భారత్‌గా మారుస్తున్నామని, ఇది నచ్చని వాళ్లు దేశం విడిచి వెళ్లిపోవచ్చని ఆయన కుండబద్దలు కొట్టారు. ఆదివారం ఏర్పాటు చేసిన ‘చాయ్ పే చర్చ’ కార్యక్రమంలో దిలీప్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘పశ్చిమ బెంగాల్‌లో మా బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే విదేశీ విగ్రహాలను తొలగిస్తాం. ఇండియా పేరుని భారత్‌గా మార్చబోతున్నాం. ఎవరికైతే ఇది నచ్చదో, వాళ్లు సంతోషంగా దేశం విడిచి వెళ్లిపోవచ్చు’’ అంటూ చెప్పుకొచ్చారు.
ఇదే సమయంలో.. రాహుల్ సిన్హా అనే బీజేపీ నేత కూడా దేశం పేరు మార్పుపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశానికి రెండు పేర్లు ఉండవని, జీ20 సదస్సు కోసం దేశాధినేతలు ఢిల్లీలో ఉన్నారు కాబట్టి దేశం పేరు మార్చడానికి ఇదే సరైన సమయమని చెప్పుకొచ్చారు. ఇందుకు తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి శాంతిను సేన్ ధీటుగానే బదులిచ్చారు. సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని కౌంటర్ ఇచ్చింది. ‘‘ఇండియా కూటమిని చూసి బీజేపీ భయపడుతోంది. సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే ఈ కొత్త నాటకానికి తెరలేపింది’’ అని అన్నారు.
కాగా.. జీ20 దేశాధినేతలను విందుకు ఆహ్వానిస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ పేరుతో ఆహ్వానాలు పంపిన విషయం తెలిసిందే. ఇది సోషల్‌మీడియాలో వైరల్ అవ్వగా.. ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. ఇండియా కూటమిని చూసి బీజేపీ భయపడుతోందని, ఆ భయంతోనే దేశం పేరుని మార్చేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించాయి. ఎప్పటి నుంచో వ్యాప్తిలో ఉన్న ‘ఇండియా’ పేరును కాదని భారత్‌గా పేర్కొనడం దారుణమని మండిపడ్డాయి. అటు.. బీజేపీ పార్టీ కూడా ఈ విమర్శల్ని తిప్పికొట్టింది.
Updated Date - 2023-09-10T16:12:10+05:30 IST