BJP: బీజేపీ రాష్ట్ర చీఫ్ సంచలన వ్యాఖ్యలు.. ఆయన ఏమన్నారంటే..
ABN, First Publish Date - 2023-06-14T08:09:44+05:30
అవినీతికి వ్యతిరేకంగా పోరాడటమే తన ప్రధాన లక్ష్యమని, అదే సమయంలో రాష్ట్రంలో పాలకుల అవినీతిని సహించబోనని బీజేపీ రాష్ట్ర అ
చెన్నై, (ఆంధ్రజ్యోతి): అవినీతికి వ్యతిరేకంగా పోరాడటమే తన ప్రధాన లక్ష్యమని, అదే సమయంలో రాష్ట్రంలో పాలకుల అవినీతిని సహించబోనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) ప్రకటించారు. తన విమర్శలను ఖండిస్తూ అన్నాడీఎంకే చేసిన తీర్మానం పట్ల ఆయన స్పందిస్తూ.. మంగళవారం సాయంత్రం ప్రకటన విడుదల చేశారు. తాను చేసిన వ్యాఖ్యలను సరిగ్గా అర్థం చేసుకోకుండా తనను విమర్శిస్తున్నారని, అన్నాడీఎంకే మాజీ మంత్రుల్లా తాను దిగజారుడు విమర్శలు చేయదలచుకోలేదన్నారు. అదే సమయంలో తనను విమర్శిస్తున్నవారికి, బీజేపీ శ్రేణులకు, రాష్ట్ర ప్రజలకు కొన్ని వాస్తవాలను తెలియజేయటం తన దర్మమని తెలిపారు. రాష్ట్రంలో అవినీతే ప్రధాన సమస్య అని, ఇన్నేళ్లుగా సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలకు చేరలేదని, ఆ పథకాలను తమ స్వలాభాలకు వాడుకుని రాజకీయ నేతలే ఉన్నత స్థితికి చేరుకుంటున్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో కొన్ని రాజకీయ పార్టీలు ఓటుకు నోటిస్తే చాలు, ఐదేళ్లపాటు ప్రజలను దోచుకోవచ్చనే పంథానే ఎంచుకున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రజలను ప్రత్యేకించి నిరుపేదలను సాయం కోసం చేతులు చాచే యాచకులుగానే ఆ పార్టీలు భావిస్తున్నాయన్నారు. ఇలాంటి హేయమైన రాజకీయాలనే తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని పేర్కొన్నారు. కూటమి పార్టీలు, కూటమికి నాయకత్వం వహించే నాయకుల పట్ల ఎలా వ్యవహరించాలన్న విషయంపై ఎవరూ తనకు పాఠాలు నేర్పాల్సిన అవసరం లేదని అన్నామలై పేర్కొన్నారు.
Updated Date - 2023-06-14T08:09:44+05:30 IST