Rahul Gandhi: గిరిజనులను వనవాసీలను చేసి అడవులకే పరిమితం చేస్తున్న బీజేపీ
ABN, First Publish Date - 2023-08-13T14:43:56+05:30
పార్లమెంటు సభ్యత్వాన్ని పునరుద్ధరించిన తర్వాత తొలిసారి తన సొంత నియోజకవర్గమైన కేరళలోని వయనాడ్ లో రాహుల్ గాంధీ ఆదివారంనాడు రెండోరోజు పర్యటన సాగిస్తున్నారు. ఆదివాసీలను వనవాసీలుగా పిలుస్తూ వారిని కేవలం అడవులకే బీజేపీ పరిమితం చేయాలనుకుంటోందని విమర్శలు గుప్పించారు.
వయనాడ్: పార్లమెంటు సభ్యత్వాన్ని పునరుద్ధరించిన తర్వాత తొలిసారి తన సొంత నియోజకవర్గమైన కేరళలోని వయనాడ్ (Wayanad)లో రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆదివారంనాడు రెండోరోజు పర్యటన జరుపుతున్నారు. ఆదివాసీలను వనవాసీలుగా పిలుస్తూ వారిని కేవలం అడవులకే బీజేపీ పరిమితం చేయాలనుకుంటోందని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు. ఈ భూములకు నిజమైన యజమానుల హోదాను కల్పించడం లేదన్నారు. ఆదివాసీలను వనవాసీలుగా పిలవడం అంటే వారిని అనుమానించడమేనని, వారి అటవీ భూములను లాక్కుని పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టాలనుకుంటోందని ఆరోపించారు.
వయనాడ్ జిల్లా మనంతవాడి ప్రాంతంలోని డాక్టర్ అంబేద్కర్ జిల్లా మెమోరియల్ కేన్సర్ సెంటర్‌లో హెచ్‌టీ కనెక్షన్‌ను రాహుల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గిరిజనులను వనవాసీలుగా బీజేపీ పిలవడం వెనుక ఒక లాజిక్ ఉందన్నారు. యాజమాన్య హక్కులు నిరాకరించడం, అడువులు విడిచిపెట్టకుండా అక్కడే వారిని పరిమితం చేయడం వంటి ఉద్దేశాలు ఉన్నాయని ఆరోపించారు. ఈ ఆలోచనా విధానానని కాంగ్రెస్ పార్టీ అంగీకరించదన్నారు. వనవాసీలుగా పిలవడమంటే గిరిజన జాతుల సంప్రదాయాలను, చరిత్రను వక్రీకరించడమేనని, దేశంతో గిరిజనులకు ఉన్న సంబంధంపై దాడి జరపడమేనని చెప్పారు. "మాకు (కాంగ్రెస్) మీరు ఆదివాసీలే. మీరు ఈ భూమికి నిజమైన యజమానులు'' అని రాహుల్ చెప్పారు. దేశంలోని అందరికీ కల్పిస్తున్నట్టే ఆదివాసీలకు విద్య, ఉద్యోగాలు, వృత్తులు వంటి అన్ని అవకాశాలు కల్పించాలన్నారు. ఆదివాసీలకు ఈ ప్లానెట్‌లో అన్ని అవకాశాలు తెరిచి ఉండాలన్నారు. పర్యావరణం, పర్యావరణ పరిరక్షణ అనేది ఈరోజు ఫ్యాషన్‌గా మారుతోందని, ఆధునిక సొసైటీ పేరుతో అడవులను తగులబెడుతున్నారని, కాలుష్యం సృష్టిస్తున్నారని విమర్శించారు. అయినప్పటికీ ఆదివాసీలు వేల సంవత్సరాలుగా పర్యావరణాన్ని పరిరక్షిస్తున్నారని ప్రశంసించారు. ఆదివాసీలను చూసి అందరూ నేర్చుకోవాల్సింది ఎంతో ఉందన్నారు.
ఎంపీలాడ్స్ నుంచి రూ.50 లక్షలు
కేన్సర్ సెంటర్‌లో కొత్త ఎలక్ట్రిసిటీ కనెక్షన్ వల్ల ఈ ప్రాంతంలో డాక్టర్లు, పేషెంట్లు తరచు ఎదుర్కొంటున్న కరెంట్ కోతల సమస్య పరిష్కారమవుతుందని అన్నారు. ఎంపీలాండ్స్ నిధి నుంచి రూ.50 లక్షలు ఖర్చుచేయడం తనకెంతో సంతోషంగా ఉందని చెప్పారు. కాగా, రాహుల్ తన పర్యటనలో భాగంగా మంగళవారం సాయంత్రం కోజికోడ్ జిల్లాలోని కొడెంచెరిలో సెయింట్ జోసెష్ హైస్కూల్ ఆడిటోరియం వద్ద కమ్యూనిటీ డిసేబిలిటికీ మేనేజిమెంట్ సెంటర్ (సీడీఎంఎస్)కు శంకుస్థాపన చేస్తారు. రాత్రి 10.30 గంటలకు కాలికట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్తారు.
Updated Date - 2023-08-13T14:44:01+05:30 IST