India and Britain : భద్రతా సలహాదారుల సమావేశంలో రుషి సునాక్ ఇలా చేశారేంటి?
ABN, First Publish Date - 2023-02-05T10:36:56+05:30
భారత్, బ్రిటన్ జాతీయ భద్రతా సలహాదారుల వార్షిక వ్యూహాత్మక సమావేశంలో బ్రిటన్ ప్రధాన మంత్రి రుషి సునాక్
లండన్ : భారత్, బ్రిటన్ జాతీయ భద్రతా సలహాదారుల వార్షిక వ్యూహాత్మక సమావేశంలో బ్రిటన్ ప్రధాన మంత్రి రుషి సునాక్ (Rishi Sunak) కాసేపు పాల్గొనడం అందరినీ ఆశ్చర్యపరచింది. ఇది చాలా ప్రత్యేక సందేశమని భారత్ అభివర్ణించింది. ఇరు దేశాల మధ్య రక్షణ, వాణిజ్యం, సైన్స్, టెక్నాలజీ రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం కావడం చాలా విలువైనదని ఇండియన్ హై కమిషన్ పేర్కొంది.
బ్రిటన్‌లోని ఇండియన్ హై కమిషన్ ఇచ్చిన ట్వీట్‌లో, భారత దేశ జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్ (Ajit Doval), బ్రిటన్ ఎన్ఎస్ఏ టిమ్ బారో (Tim Barrow) బ్రిటన్ కేబినెట్ ఆఫీస్‌లో చర్చలు జరిపారని, ఈ సమయంలో బ్రిటన్ ప్రధాన మంత్రి రుషి సునాక్ కాసేపు ఈ చర్చల్లో పాల్గొనడం ఓ ప్రత్యేక సందేశాన్ని ఇస్తోందని తెలిపింది. ఇరు దేశాల మధ్య రక్షణ, వాణిజ్యం, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి తన ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందని రుషి హామీ ఇచ్చారని పేర్కొంది. టిమ్ బారో త్వరలోనే భారత దేశంలో పర్యటించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపింది.
అజిత్ దోవల్ అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులివన్‌తో వాషింగ్టన్‌లో చర్చలు జరిపారు. అక్కడి నుంచి లండన్ వెళ్లారు. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ పరిణామాలపై టిమ్ బారోతో చర్చించారు. ఆఫ్ఘనిస్థాన్-పాకిస్థాన్ ప్రాంతం నుంచి వస్తున్న ఉగ్రవాదంపై వీరు చర్చించినట్లు తెలుస్తోంది. మధ్య ప్రాచ్య దేశాల్లో పరిణామాలపై కూడా వీరు చర్చించారని చెబుతున్నారు.
భారత్, బ్రిటన్ మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కోసం ఇరు దేశాలు ఇప్పటికి ఆరుసార్లు చర్చలు జరిపాయి. మరో విడత చర్చలు త్వరలో జరగబోతున్నాయి. ఈ చర్చలు 2022 జనవరిలో ప్రారంభమయ్యాయి.
మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ వివాదం నేపథ్యంలో అజిత్ దోవల్ లండన్‌లో పర్యటించారు.
Updated Date - 2023-02-05T10:37:01+05:30 IST