Afzal Ansari: ఎంపీ అఫ్జల్ అన్సారీపై అనర్హత వేటు
ABN, First Publish Date - 2023-05-01T22:36:44+05:30
బహుజన్ సమాజ్ పార్టీ (BSP) ఎంపీ అఫ్జల్ అన్సారీపై (Afzal Ansari) అనర్హత వేటు పడింది.
న్యూఢిల్లీ: బహుజన్ సమాజ్ పార్టీ (BSP) ఎంపీ అఫ్జల్ అన్సారీపై (Afzal Ansari) అనర్హత వేటు పడింది. బీజేపీ (BJP) ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ కిడ్నాప్, హత్య కేసులో ఘాజీపూర్ ఎంపీ, ఎమ్మెల్యే కోర్ట్ జైలుశిక్ష విధించడంతో అన్సారీపై ఈ వేటు పడింది. ఘాజీపూర్ ఎంపీ అయిన అఫ్జల్ అన్సారీ గ్యాంగ్‌స్టర్ ముక్తార్ అన్సారీకి సోదరుడు.
బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ కిడ్నాప్, హత్యకు సంబంధించిన కేసులో ప్రస్తుతం జైలులో ఉన్న ముఖ్తార్ అన్సారీ (Mukhtar Ansari)ని దోషిగా (Convicted) నిర్ధారిస్తూ ఘాజీపూర్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు తీర్పు చెప్పింది. అన్సారీకి పదేళ్ల జైలు శిక్ష, రూ.5 లక్షల జరిమానా విధించింది. అన్సారీని వర్చువల్ తరహాలో కోర్టు ముందు హాజరుపరిచారు. ఘాజీపూర్‌లో 2005లో బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ హత్యకు గురయ్యారు. కిడ్నాప్, హత్య కేసులో ముఖ్తార్ అన్సారీ, ఆయన సోదరుడు అఫ్జల్ అన్సారీ నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో న్యాయస్థానం అఫ్జల్ అన్సారీకి నాలుగేళ్ల జైలుశిక్ష, లక్ష జరిమానా విధించింది. నాలుగేళ్ల జైలుశిక్ష పడటంతో అఫ్జల్ అన్సారీ ఎంపీ పదవిని కోల్పోవాల్సి వచ్చింది.
2001లో జరిగిన గ్యాంగ్ వార్ ఘటనకు సంబంధించి ఈ ఏడాది జనవరిలో ముఖ్తార్ అన్సారీకి హత్య కేసు నమోదు చేసారు. దీనికి ముందు బాంద్రాలోని సుపీరియర్ క్లాస్ జైలులో అన్సారీని ఉంచాలంటూ జనవరి 18న ఘజీపూర్ ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు ఇచ్చిన ఆదేశాలను అలహాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది. కాగా, గత ఏడాది డిసెంబర్‌లో అన్సారీకి, ఆయన సహచరుడు భీమ్ సింగ్‌కు హత్య, హత్యాయత్నాలకు సంబంధించిన ఐదు కేసుల్లో ఘజీపూర్ గ్యాంగ్‍స్టర్ కోర్టు పదేళ్లు జైలు శిక్ష విధించింది. వీటిలో కానిస్టేబుల్ రఘువంశ్ సింగ్ హత్య కేసు, ఘాజీపూర్ అడిషనల్ ఎస్పీపై హత్యాయత్నం కేసు కూడా ఉన్నాయి.
మోదీ ఇంటి పేరు కలవారందరూ దొంగలే అని వ్యాఖ్యానించినందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎంపీ పదవిపై వేటు పడింది. ఈ కేసులో సూరత్ కోర్ట్ ఆయనకు రెండేళ్ల జైలుశిక్ష విధించడంతో రాహుల్ ఎంపీ పదవి కోల్పోవాల్సి వచ్చింది.
Updated Date - 2023-05-01T22:36:48+05:30 IST