Kharge letter to PM: నేరాలపై విచారణకే సీబీఐ, రైలు ప్రమాదాలకు కాదు : మోదీకి ఖర్గే ఘాటు లేఖ
ABN, First Publish Date - 2023-06-05T17:34:02+05:30
ఒడిశా రైలు ప్రమాద ఘటనపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఘాటు లేఖ రాశారు. సీబీఐ కానీ, ఇతర దర్యాప్తు సంస్థలు కానీ సాంకేతిక, సంస్థాగత, రాజకీయ వైఫల్యాలపై జవాబుదారీతనాన్ని నిర్ధారించ లేవని అన్నారు.
న్యూఢిల్లీ: భారత రైల్వే చరిత్రలో అత్యంత ఘోర విషాద ఘటనల్లో ఒకటైన ఒడిశా (Odisha) రైలు ప్రమాద ఘటనపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఘాటు లేఖ రాశారు. కేంద్ర విచారణ సంస్థ (CBI) కానీ, ఇతర దర్యాప్తు సంస్థలు కానీ సాంకేతిక, సంస్థాగత, రాజకీయ వైఫల్యాలపై జవాబుదారీతనాన్ని నిర్ధారించ లేవని అన్నారు. నిరంతర లోపభూయిష్ట విధానాల కారణంగా రైలు ప్రయాణాల్లో అభద్రత చోటుచేసుకుని, ప్రజల ఇబ్బందులు ఇబ్బడి ముబ్బడి అవుతున్నాయని తప్పుపట్టారు.
''దురదృష్టకరం ఏమిటంటే...సమస్య ఉన్న విషయాన్ని మీరు (The people incharge), రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ అంగీకరించడం లేదు. రైల్వే మంత్రి ఇప్పటికే ఒక కారణం వెతికిపట్టుకున్నారు. అయినప్పటికీ సీబీఐ చేత దర్యాప్తు జరిపించాలని ఆయన కోరుతున్నారు. సీబీఐ అనేది నేరాలను విచారించడానికి ఉద్దేశించినదే కానీ రైల్వై ప్రమాదాలకు ఉద్దేశించినది కాదు. సాంకేతిక, సంస్థాగత, రాజకీయ వైఫల్యాలపై జవాబుదారితనాన్ని సీబీఐ కానీ, ఇతర ఏజెన్సీలు కానీ నిర్ధారించ లేవు. రైల్వేల భద్రత, సిగ్నలింగ్, మెయింటెనెన్స్ విధానాలకు సంబంధించిన సాంకేతిక నైపుణ్యాలు, శిక్షణ సీబీఐకి ఉండవు'' అని ఖర్గే తన లేఖలో పేర్కొన్నారు.
రైళ్లు ఢీకొనకుండా గత ప్రభుత్వం తీసుకువచ్చిన రక్షా కవచ్‌ను ఎందుకు వెనుకబాట పట్టించారు? అని కూడా కేంద్ర సర్కార్‌ను ఖర్గే నిలదీశారు. రక్షా కవచ్‌ను కొంకణ్ రైల్వే అభివృద్ధి పరచిందని, రైసెర్చ్ డిజైన్స్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (ఆర్‌డీఎస్ఓ) 2011లో విజయవంతంగా పరీక్షలు నిర్వహించిందని ఆయన తెలిపారు. ''మీ ప్రభుత్వం ఆ పథకానికి 'కవచ్' అని 2020లో పేరు మార్చింది. ఇదొక సరికొత్త ఇన్వెన్షన్‌గా మీ రైల్వే మంత్రి ఘనంగా చెప్పారు. కానీ ప్రశ్న మాత్రం అలాగే ఉండిపోయింది. ఇంతవరకూ ఇండియన్ రైల్వే రూట్లలో కేవలం 4 శాతం రూట్లలో మాత్రమే కవచ్ ఏర్పాటు ఎందుకు పరిమితమైంది? ఇది మీ ప్రగల్బాలను బహిర్గతం చేస్తోంది. ఒడిశా ఘోర ప్రమాదం అందరికీ కనువిప్పు కావాలి. ఈ ప్రమాదం వెనుక అసలైన కారణాలేమిటో ప్రభుత్వం వెలుగులోకి తీసుకురావాలి'' అని ఖర్గే అన్నారు. ఈ దిశగా రైల్వే సేఫ్టీ ప్రమాణాలను నిర్ధారించడం, రైల్వే రూట్లలో అందుకు అవసరమైన సామాగ్రిని అమర్చడం, బాలాసోర్ ఘటనలు పునరావృతం కాకుండా చూడటం వంటి చర్యలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానికి రాసిన లేఖలో ఖర్గే సూచించారు.
Updated Date - 2023-06-05T17:34:02+05:30 IST