Demonetisation: పెద్ద నోట్ల రద్దుకు ముందు కేంద్రం సలహా తీసుకున్నది ఎక్కడనుంచో తెలుసా?
ABN, First Publish Date - 2023-01-02T18:07:33+05:30
పెద్ద నోట్ల రద్దుకు ముందు కేంద్రం సలహా తీసుకున్నది ఎక్కడనుంచంటే...
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుపై సుప్రీంకోర్టు కేంద్రాన్ని సమర్థించడంపై భారతీయ జనతా పార్టీ హర్షం వ్యక్తం చేసింది. దేశ ప్రయోజనాల కోసం పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను సుప్రీంకోర్టు సమర్థించినట్లైందని బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. నోట్ల రద్దుకు ముందు ఆర్బీఐ సలహా తీసుకున్నామని తెలిపారు. ఆర్ధికపరమైన నిర్ణయాలు తీసుకునే హక్కు కేంద్రానికి ఉందని సుప్రీం వ్యాఖ్యానించిందని ఆయన గుర్తు చేశారు. నల్లధనాన్ని అరికట్టేందుకు, ఉగ్రవాదులకు నిధులు అందకుండా చూసేందుకు, మనీలాండరింగ్ ఆపేందుకే పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నామన్నారు. పెద్ద నోట్ల రద్దు పేద ప్రజల మేలు కోసమేనని రవిశంకర్ ప్రసాద్ పునరుద్ఘాటించారు. పెద్ద నోట్ల రద్దుపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తొలినుంచీ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ విదేశాల్లో కూడా పెద్ద నోట్ల రద్దు అంశంపై తీవ్ర విమర్శలు చేశారని రవిశంకర్ ప్రసాద్ గుర్తు చేశారు. సుప్రీం తీర్పు నేపథ్యంలో దేశ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు యత్నించిన రాహుల్ గాంధీ దేశానికి క్షమాపణలు చెప్పాలని రవిశంకర్ ప్రసాద్ డిమాండ్ చేశారు.
2016 నవంబర్ 8న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించారు. నల్లధనాన్ని అరికట్టేందుకు తీసుకుంటున్న నిర్ణయంగా ప్రకటించారు. అప్పటివరకూ చలామణిలో ఉన్న వెయ్యి, ఐదొందల నోట్లను రెండు నెలల్లోగా బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవాలని, గడువు దాటితే పెద్ద నోట్లు చిత్తుకాగితాలకింద మారతాయని ప్రధాని ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. చాలా మంది అక్రమంగా సంపాదించినవారు పెద్ద నోట్లను సంచుల్లో పెట్టి కాలవల్లో పడేశారు. మరికొందరు నోట్లను కాల్చేశారు. మరికొందరు నోట్లతో ఉన్న సంచులను పూడ్చేశారు. బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునేందుకు వ్యవధి తక్కువగా ఉండటంతో జనం బ్యాంకుల వద్ద భారీగా క్యూ కట్టారు. ఆ సమయంలో నగదు విత్‌డ్రాలపై కూడా పరిమితి విధించడం, ఏటీఎంలలో నగదు నిల్వలు లేక జనం ఇబ్బందులు పడ్డారు.
మరోవైపు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మొత్తం 58 పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. చివరకు నేడు సుప్రీం తుది తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎస్ఏ నజీర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తుది తీర్పు వెలువరిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. 4:1 మెజార్టీతో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీం కోర్టు సమర్థించింది.
Updated Date - 2023-01-02T18:38:43+05:30 IST