Same-sex marriage : స్వలింగ వివాహాలపై పిటిషన్లను తోసిపుచ్చండి.. సుప్రీంకోర్టును కోరిన కేంద్రం..
ABN, First Publish Date - 2023-04-17T15:37:18+05:30
స్వలింగ వివాహాలను గుర్తించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చాలని కేంద్ర ప్రభుత్వం (Union Government) సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : స్వలింగ వివాహాలను గుర్తించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చాలని కేంద్ర ప్రభుత్వం (Union Government) సుప్రీంకోర్టు (Supreme Court)ను కోరింది. ఈ సమస్యను ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధుల నిర్ణయానికి వదిలిపెట్టాలని కోరింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ (Chief Justice of India D Y Chandrachud) నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ పిటిషన్లపై ఈ నెల 18న విచారణ జరుపుతుంది. ఈ ధర్మాసనంలో జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ హిమ కొహ్లీ, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ ఉన్నారు.
స్వలింగ వివాహాల (Same Sex Marriages)కు చట్టబద్ధమైన గుర్తింపు ఇవ్వాలని కోరుతూ దాఖలైన 15 పిటిషన్లపై ఈ రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతుంది. ఈ పిటిషన్లు పట్టణ ఉన్నత వర్గాల అభిప్రాయాలను ప్రతిబింబిస్తున్నాయని, ఆ అభిప్రాయాలకు సాంఘిక ఆమోదం కోరుతున్నాయని, అందువల్ల వీటిని తిరస్కరించాలని కేంద్ర ప్రభుత్వం సోమవారం కోరింది. స్వలింగ వివాహం చేసుకునే హక్కును గుర్తించే విషయంలో న్యాయస్థానం నిర్ణయం తీసుకుందంటే, దాని అర్థం, చట్టం యొక్క యావత్తు శాఖను దాదాపుగా న్యాయ వ్యవస్థ తిరిగి రాసినట్లేనని తెలిపింది. ఇటువంటి భారీ ఆదేశాలను జారీ చేయడం నుంచి న్యాయస్థానం సంయమనం పాటించాలని కోరింది. దీనికి సరైన అధికారంగల వ్యవస్థ తగిన చట్టసభేనని వివరించింది. ఈ చట్టాల ప్రాథమిక సాంఘిక మూలాలను పరిశీలించినపుడు, ఏదైనా మార్పు చట్టబద్ధతతో సమర్థనీయం కావాలంటే, అది క్రింది స్థాయి నుంచి పై స్థాయికి రావాలని తెలిపింది. చట్టం ద్వారా మాత్రమే ఆ మార్పు రావాలని తెలిపింది. అటువంటి మార్పును న్యాయస్థానం తీర్పుతో నిర్బంధంగా రుద్దకూడదని వివరించింది. మార్పు గతిని అత్యుత్తమంగా నిర్ణయించే తీర్పరి (Judge) చట్టసభలు మాత్రమేనని స్పష్టం చేసింది.
ఏదైనా సాంఘిక, చట్టపరమైన సంబంధాన్ని చట్టబద్ధ అనుమతిగల ఓ వ్యవస్థగా గుర్తించేటపుడు రాజ్యాంగం ప్రకారం అనుమతించదగిన ఏకైక రాజ్యాంగ మార్గం ఇదేనని తెలిపింది. ఈ అంశాల పట్ల అవగాహన కలిగిన ఏకైక రాజ్యాంగ విభాగం సమగ్ర అధికార పరిధి కలిగిన చట్టసభేనని తెలిపింది. దేశంలోని యావత్తు ప్రజానీకం యొక్క అభిప్రాయాలకు పిటిషనర్లు ప్రతినిధులు కాదని వివరించింది.
భారత రాజ్యాంగం మౌలిక నిర్మాణంలో అధికారాల విభజన ఓ భాగమని తెలిపింది. ఈ అధికారాల విభజన సిద్ధాంతం సుస్థిరంగా, స్పష్టంగా ఉందని తెలిపింది. కేవలం ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులకు మాత్రమే కేటాయించబడిన శాసన అధికారాలలోకి చొరబడటం ఈ సుస్థిర అధికార విభజన సిద్ధాంతాలకు వ్యతిరేకమని వివరించింది. అధికారాల విభజన భావం నుంచి ఈ విధంగా పక్కకు మళ్ళడం రాజ్యాంగ నైతికతకు విరుద్ధమని వివరించింది.
వివాహ వ్యవస్థ అనేది సామాజిక భావన అని, దీనికి సంబంధిత చట్టాలు, ఆచారాలు, సంప్రదాయాల ప్రకారం పవిత్రత, మాన్యత, గౌరవం లభించాయని తెలిపింది. సామాజిక ఆమోదం ప్రాతిపదికపై ఈ చట్టాలకు గౌరవం లభించినట్లు వివరించింది. వివాహానికి సంబంధించిన సామాజిక, చట్టపరమైన వ్యవస్థను గుర్తించే విషయంలో, సామాజిక విలువలు, ఉమ్మడి విలువలు, వేర్వేరు మతాల పరస్పర నమ్మకాలను పాటించడం, సామాజికంగా ఆమోదించడం వంటివాటిని సంఖ్యాబలం ప్రాబల్యంతో పోల్చుకుని గందరగోళపడకూడదని స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి :
ABN: ఏబీఎన్ వాహనంపై దాడికి యత్నించిన అవినాష్ అనుచరులు
Delhi: మోదీ సర్కారు 9 ఏళ్ల పాలనపై దేశవ్యాప్త ప్రచారం..
Updated Date - 2023-04-17T15:37:18+05:30 IST