Chennai: 22న మంత్రివర్గ సమావేశం.. కీలక ఘట్టాలపై చర్చ
ABN, First Publish Date - 2023-07-20T10:46:35+05:30
ఒకవైపు మంత్రులపై ఈడీ దాడులు, మరోవైపు గవర్నర్ విమర్శల పిడుగులతో ఉక్కిరిబిక్కిరవుతున్న రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీ
చెన్నై, (ఆంధ్రజ్యోతి): ఒకవైపు మంత్రులపై ఈడీ దాడులు, మరోవైపు గవర్నర్ విమర్శల పిడుగులతో ఉక్కిరిబిక్కిరవుతున్న రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 22వ తేదీన రాష్ట్రమంత్రివర్గం భేటీ కానుంది. ఉదయం 10 గంటలకు సచివాలయంలో జరగనున్న ఈ భేటీకి ముఖ్యమంత్రి స్టాలిన్ అధ్యక్షత వహించనున్నారు. కాగా మనీ ల్యాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) అరెస్టు చేయడంతో పుళల్ జైలులో ఉన్న మంత్రి సెంథిల్‌బాలాజీ ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం లేకుండా పోయింది. ఇటీవల రాష్ట్ర మంత్రులు సెంథిల్ బాలాజి, పొన్ముడి(Ministers Senthil Balaji, Ponmudi) నివాసాల్లో ఈడీ సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే. పదేళ్లక్రితం నాటి కేసుల్ని తిరగదోడి, తమను వేధిస్తోందంటూ డీఎంకే వర్గాలు విమర్శిస్తున్నాయి. దీనికి తోడు మరో మంత్రి అనితా రాధాకృష్ణన్ వ్యవహారంపైనా దర్యాప్తుకు ఈడీ సిద్ధమవుతోంది. ఆ మేరకు తమకు అనుమతి ఇవ్వాలంటూ స్థానిక కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో మునుముందు మరిన్ని ఈడీ దాడులు జరిగే అవకాశముందని డీఎంకే(DMK) వర్గాలు అనుమానిస్తున్నాయి. అక్రమంగా తమ నేతల్ని అరెస్టు చేసి, తమను బద్నాం చేయడమే లక్ష్యంగా కేంద్రం రాష్ట్రంపైకి ఈడీని ఉసిగొల్పుతోందంటూ ఆ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంలో ఏం చేయాలన్నదానిపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా గవర్నర్ తీరుపైనా ప్రభుత్వ నేతలు ఆగ్రహంతో వున్నారు. మంత్రి సెంథిల్ బాలాజీని డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటించడం, అంతలోనే ఆ ఉత్తర్వులను నిలుపుదల చేస్తున్నట్లు చెప్పడం, బహిరంగ కార్యక్రమాల్లో ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టేలా వ్యాఖ్యలు చేయడం తదితరాలపై ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) ఆగ్రహంగా వున్నారు. అందువల్ల గవర్నర్ వ్యవహారంపైనా ఈ భేటీలో చర్చ జరిగే అవకాశముందని తెలిసింది. అంతేగాక సెప్టెంబరులో అర్హులైన మహిళలకు ప్రతి నెలా రూ.1000 పంపిణీ పథకం ప్రారంభమవుతోంది. ఈ పథకానికి సంబంధించిన నియమ నిబంధల్ని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం అమలుపైనా మంత్రివర్గం చర్చించనుంది. అంతేగాక ఇతర పథకాల అమలు, మునుముందు ప్రవేశపెట్టాల్సిన పథకాల, వర్షాకాలంలో తీసుకోవాల్సిన చర్యలపైనా మంత్రివర్గం చర్చించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
Updated Date - 2023-07-20T10:46:35+05:30 IST