Kaveri: 15 రోజులు ‘కావేరి’ని వదలండి
ABN, First Publish Date - 2023-08-30T09:01:24+05:30
రాష్ట్రంలోని కావేరి డెల్టా జిల్లాల్లో పంటలసాగు కోసం 15 రోజలు పాటు సెకనుకు 5వేల ఘనపుటడుగుల చొప్పున కావేరి జలాలను విడుదల
- కర్ణాటకకు కావేరి నిర్వాహక మండలి ఆదేశం
చెన్నై, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని కావేరి డెల్టా జిల్లాల్లో పంటలసాగు కోసం 15 రోజలు పాటు సెకనుకు 5వేల ఘనపుటడుగుల చొప్పున కావేరి జలాలను విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కావేరి నిర్వాహక మండలి ఆదేశించింది. కావేరి నదీ జలాల పంపిణీకి సంబంధించి కావేరి నిర్వాహక మండలి 23వ సమావేశం ఢిల్లీలో మంగళవారం మధ్యాహ్నం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రానికి చెందిన ప్రతినిధులతోపాటు కర్ణాటక, పుదుచ్చేరి, కేరళ(Karnataka, Puducherry, Kerala) రాష్ట్రాల ప్రభుత్వ ప్రతినిధులు హాజరయ్యారు. కావేరి జలాల వివాదంపై రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టు(Supreme Court)లో పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. ఆ పిటిషన్‌పై ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ప్రత్యేక ధర్మాసనం అత్యవసర కేసుగా విచారణను చేపట్టింది. కావేరి జలాలకు సంబంధించి తీసుకోనున్న తదుపరి చర్యలను నివేదికగా మూడు రోజుల్లోగా సమర్పించాలని కావేరి నిర్వాహక మండలికి ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు మంగళవారం నిర్వహించిన కావేరి నిర్వాహక మండలి సమావేశంలో రాష్ట్రప్రభుత్వ తరఫు ప్రతినిధులు సెకనుకు 24 వేల ఘనపుటడుగుల చొప్పున కావేరి జలాలను విడుదల చేస్తే డెల్టా జిల్లాల్లో పంటలు సాఫీగా పండించగలమని పేర్కొన్నారు. కర్ణాటక ప్రభుత్వ తరఫు ప్రతినిధులు తమ వాదనలు వినిపిస్తూ ప్రస్తుతం తమ రాష్ట్రంలోని జలాశయాల్లో 47 శాతం మేరకే నీటి నిల్వలు ఉన్నాయని, ఆ జలాలు తాగునీటి అవసరాలకే సరిపోతాయని, ఆ పరిస్థితుల్లో తమిళనాడుకు ఎలా జలాలను పంపగలమని ప్రశ్నించారు.
రెండు రాష్ట్రాలకు చెందిన ప్రతినిధుల వాదనల తర్వాత నిర్వాహక మండలి కర్ణాటక ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తమిళనాడుకు పదిహేను రోజులపాటు అంటే సెప్టెంబర్ 12 దాకా సెకనుకు 5వేల ఘనపుటడుగుల చొప్పున కావేరి జలాలను విడుదల చేయాలని తేల్చి చెప్పింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రధానాధికారి ఎన్‌ఎ్‌సకే కల్‌ధర్ ఈ ఉత్తర్వును వెలువరించారు. అయితే కర్ణాటక ప్రభుత్వం మాత్రం కావేరి నిర్వాహక మండలి జారీ చేసిన ఈ ఆదేశాలను పాటించే ప్రసక్తే లేదని ప్రకటించింది. ఈ సమావేశం జరగటానికి ముందే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పాత్రికేయులతో మాట్లాడుతూ... రాష్ట్రంలోని జలాశయాల్లో నీటి నిల్వలు బాగా తగ్గిపోవడం, దానికి తోడు జలాశయాల పరివాహక ప్రాంతాల్లో వర్షాలు కురవకపోవడంతో మునుపటిలా తమిళనాడు(Tamil Nadu)కు కావేరి జలాలను సరఫరా చేయలేమని ప్రకటించారు. ఇదిలా ఉండగా కావేరి నిర్వాహక మండలి ఉత్తర్వు నకలును కావేరి జలాల వివాదంపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనానికి సమర్పించనున్నారని తెలుస్తోంది. ఈ ఉత్తర్వులను పరిశీలించిన మీదటే ధర్మాసనం తీర్పు వెలువరించనుంది.
Updated Date - 2023-08-30T09:02:45+05:30 IST