Chennai: రాష్ట్ర వ్యాప్తంగా ‘అల్పాహార పథకం’
ABN, First Publish Date - 2023-08-25T08:09:37+05:30
రాష్ట్రంలో సీఎం బడిపిల్లల అల్పాహార పథకాన్ని శుక్రవారం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయడానికి రంగం సిద్ధమైంది.
- 31 వేల సర్కారు బడుల్లో నేటినుంచి అమలు
- 17లక్షల మంది చిన్నారులకు లబ్ధి
చెన్నై, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సీఎం బడిపిల్లల అల్పాహార పథకాన్ని శుక్రవారం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయడానికి రంగం సిద్ధమైంది. గత యేడాది సెప్టెంబర్ 15న మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై జయంతి సందర్భంగా ప్రయోగాత్మకంగా 1500 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రారంభించిన ఈ అల్పాహార పథకానికి మంచి స్పందన లభించింది. విద్యార్థుల హాజరు రోజురోజుకూ పెరిగింది. దీంతో ఈ పథకాన్ని యేడాది తిరగకముందే రాష్ట్రవ్యాప్తంగా విస్తరింపజేయాలని ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) నిర్ణయించారు. ఆ మేరకు నెల రోజులుగా అన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఉదయం పూట అల్పాహార పథకాన్ని అమలు చేయడానికి తగు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వంటలను శుచిగా శుభ్రంగా తయారు చేయడానికి ప్రత్యేకమైన వంటగదులను ఎంపిక చేశారు. ఈ పథకం కింద ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల్లో 1 నుంచి ఐదు వరకు చదివే బాలబాలికలకు రోజూ ఉదయం ఉప్మా, రవ్వ కిచెడి, రవ్వ కేసరి, కూరగాయల సాంబార్ ఇస్తున్నారు. ఈ అల్పాహారాన్ని ప్రత్యేక వంటశాలలో తయారు చేసి వ్యాన్లలో ఆయా పాఠశాలలకు ఉదయం ఏడుగంటల్లోపు సరఫరా చేస్తున్నారు. ఇప్పటివరకూ రూ.33.56 కోట్లతో 1545 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఈ అల్పాహార పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ పథకం విస్తరణను ముఖ్యమంత్రి స్టాలిన్ నాగపట్నం జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి దివంగత కరుణానిధి ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన తిరుకువలై ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ఉదయం చేపట్టనున్నారు. అల్పాహార విస్తరణ పథకం అమలుకుగాను ఇటీవలే రూ.500 కోట్లు విడుదల చేశారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 17లక్షల మంది చిన్నారులు లబ్ధిపొందనున్నారు.
డెల్టా జిల్లాల్లో సీఎం పర్యటన..
డెల్టా జిల్లాల్లో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గురువారం ఉదయం బయలుదేరి వెళ్ళారు. ఆ మేరకు గురువారం ఉదయం చెన్నై నుండి విమానంలో బయలుదేరి తిరుచ్చి విమానాశ్రయం చేరారు. తిరుచ్చిలో డీఎంకే ప్రముఖులు, మంత్రులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి కారులో తంజావూరు జిల్లా కుంభకోణం చేరి, అక్కడి స్టార్‌హోటల్‌లో మధ్యాహ్నం భోజనం చేసి, కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం కారులో బయలుదేరి ధర్మపురం ఆధీనంను కలుసుకుని, ఆధీనం ఆధ్వర్యంలో నడుపుతున్న కళాశాలలో జరిగిన కార్యక్రమానికి హాజరై కొన్ని పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాలను ముగించుకుని ఆయన కారులో బయలుదేరి వేలాంగన్ని చేరుకున్నారు. రాత్రి అక్కడే బసచేశారు. శుక్రవారం ఉదయం ఆయన నాగపట్నం జిల్లా తిరుకువలై ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సీఎం బడిపిల్లల అల్పాహార పథకాన్ని ప్రారంభించనున్నారు. ఆ తర్వాత కలెక్టర్ కార్యాలయంలో అధికారుల సమావేశంలో పాల్గొంటారు. ఇదే విధంగా శనివారం నాగపట్టినం కలెక్టర్ కార్యాలయంలో తంజావూరు, తిరువారూరు, నాగపట్టినం, మైలాడుదురై జిల్లా అధికారుల సమావేశంలో పాల్గొంటారు. ఆదివారం తిరువారూరులో ఎంపీ సెల్వరాజ్ ఇంటి వివాహ వేడుకలో స్టాలిన్ పాల్గొంటారు.
Updated Date - 2023-08-25T08:09:39+05:30 IST